Medaram Jatara: మేడారం మహాజాతర ప్రారంభం.. 14వేల మంది పోలీసులతో భద్రత
Medaram Jatara: ఈనెల 24 వరకు కొనసాగనున్న మేడారం జాతర
Medaram Jatara: మేడారం మహాజాతర ప్రారంభమయ్యింది. మహాజాతరలో తొలిఘట్టం ఆవిష్కృతం కానుంది. కన్నెపల్లి నుంచి మేడారం గద్దెలపైకి సారలమ్మ రానుంది. ఆదివాసి సంప్రదాయంలో పూజలు చేసి కన్నెపల్లి నుంచి అమ్మవారిని తరలిస్తారు. ఈఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు మేడారంకు పోటెత్తారు. భక్తకోటి మూట, ముల్లే కట్టుకుని మేడారం వైపు అడుగులు వేస్తున్నారు. పగిడిద్దరాజు, గోవిందరాజు కూడా గద్దె మీదకొస్తారు. సారలమ్మ మేడారానికి వేంచేయడంతోనే నాలుగురోజుల మహాజాతరకు తెరలేవనుంది.
సాయంత్రం ఆదివాసీ పూజారులు రహస్య పూజలు చేస్తారు. ఈ సమయంలోనే పూజారి సారయ్యను సారలమ్మ ఆవహిస్తుంది. తర్వాత సారలమ్మను ఆలయం నుంచి గద్దెల వైపు పూజారులు తీసుకొస్తారు. సమ్మక్క గారాల బిడ్డ అయిన సారలమ్మ ధైర్యానికి, వీరత్వానికి, త్యాగానికి ప్రతీక. 12వ శతాబ్దాంలో తమ గిరిజన ప్రాంతాన్ని కాపాడుకునేందుకు కాకతీయలతో సారలమ్మ యుద్ధం సాగించిన తీరును, వీరమరణం ద్వారా ఆమె త్యాగాన్ని భక్తులు స్మరించుకుంటూ దైవంగా కొలుస్తారు.
తల్లిని మొక్కితే సంతానం ప్రాప్తిస్తుందని, రుగ్మతలు పోతాయని భక్తుల విశ్వాసం. ఫలితంగా మేడారానికి సాగుతున్న సమయంలో సారలమ్మకు కన్నెపల్లిలో భక్తులు ఎదురెళ్లి మంగళహారతులు ఇస్తారు. సంతానం కలగాలని, సమస్యలు తీరాలని తడి బట్టలతో భక్తులు వరం పడతారు.