maoist partys respond ganapati's surrender : గణపతి లొంగుబాటుపై మావోయిస్టు పార్టీ స్పందన

మావోయిస్టు పార్టీ అగ్రనేత త్వరలోనే లొంగిపోతున్నారంటూ గత కొద్దిరోజులుగా విస్తృతంగా ప్రచారం జరిగింది..

Update: 2020-09-04 01:49 GMT

మావోయిస్టు పార్టీ అగ్రనేత త్వరలోనే లొంగిపోతున్నారంటూ గత కొద్దిరోజులుగా విస్తృతంగా ప్రచారం జరిగింది. గణపతి లొంగుబాటుపై కుటుంబసభ్యులు కూడా సానుకూలంగా ఉన్నారని. ఆయనను పార్టీనుంచి బయటకు తీసుకురావడం కోసం వారు ప్రయత్నాలు చేస్తున్నారని కథనాలు ప్రసారం అయ్యాయి. దానికి తోడు తెలంగాణ డీజీపీ మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో పర్యటించడం కూడా మరింత ప్రాధాన్యం పెంచింది. అయితే ఈ కథనాలు, వార్తలపై మావోయిస్టు పార్టీ స్పందించింది. ఈ మేరకు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్‌ పేరుతో ఓ లేఖను విడుదల చేశారు.. అందులో గణపతి లొంగిపోతున్నారంటూ ప్రసారం చేసిన కథనాలు అన్ని కల్పితాలే అని.. పార్టీని దెబ్బతీయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న నాటకమని కొట్టిపారేసింది.

ఇదంతా కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ ఇంటెలిజెన్స్ అధికారులు ఆడిన నాటకమని, ఇందుకోసం మీడియాను పావుగా వాడుకున్నారని లేఖలో మావోయిస్టు పార్టీ స్పష్టం చేసింది. కామ్రేడ్ గణపతి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్నాడని.. చిన్న చిన్న అనారోగ్య కారణాల రీత్యా స్వచ్ఛందంగా బాధ్యతల నుంచి మాత్రమే తప్పుకున్నారని పేర్కొంది. అంతమాత్రాన ఆయన పార్టీని వీడి జనజీవనస్రవంతిలో కలిసిపోతున్నట్టు కాదని వెల్లడించింది. ఇదిలావుంటే గణపతి లొంగుబాటు ప్రచారం నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ ఎన్‌కౌంటర్‌ జరిగింది. గుండాల మండలం దేవలగూడెం అటవీప్రాంతంలో పోలీసులకు..మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇందులో ఒక మావోయిస్టు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఇక మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో డీజీపీ మహేందర్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. 

Tags:    

Similar News