Lockdown Updates in Hyderabad: హైదరాబాద్ లో మళ్లీ లాక్ డౌన్ విధిస్తే.. పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారా?

Update: 2020-07-02 05:37 GMT

Lockdown Updates in Hyderabad: కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. దీని కట్టడికోసం హైదరాబాద్‌లో మరో సారి లాక్‌డౌన్‌ విధించడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. లాక్ డౌన్ ఉండనుందని ప్రజలు కూడా ఫిక్స్ అయిపోయారు. అయితే లాక్ డౌన్ అమలు చెయ్యాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థపైన ఉంది. వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న వేళ లాక్‌డౌన్‌ను అమలు చేయడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారా?

గ్రేటర్ పరిధిలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ప్రతీరోజూ వెయ్యికి దగ్గరగా కేసులు నమోదయ్యాయి. ఇలా కేసుల సంఖ్య పైకి ఎగబాకుతుండటంతో హైదరాబాద్ వాసుల్లో భయాందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరోసారి లాక్ డౌన్ ఆలోచన చేస్తోంది. అయితే హైదరాబాద్ లో పదిహేను రోజుల లాక్ డౌన్ విధించనున్నట్లు సమాచారం. లాక్ డౌన్ జూలై మూడు నుండి మొదలవ్వచ్చని అంటున్నారు. అయితే ఈసారి మునుపటి కంటే కఠినంగా లాక్ డౌన్ అమలు చేసేలా ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమవ్వాలని ఆదేశాలు అందినట్టు చెబుతున్నారు.

అయితే లాక్ డౌ న్ 1.0 నుండి ప్రజలను వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ఎక్కువ శ్రమించింది పోలీసులే హాస్పిటల్లో డ్యూటీలు మొదలుకొని వలస కార్మికుల తరలింపు దాకా అన్నిట్లో వారే డ్యూటీ చేశారు. ఇదే సమయంలోనే పోలీసులు అధిక సంఖ్యలో వైరస్ బారిన పడుతూ వచ్చారు ఒక హైదరాబాద్ సిటీ లోనే 300 మందికి పైగా పోలీసులు వైరస్ బారిన పడ్డారు.

ఇప్పుడు మళ్లీ లాక్ డౌన్ పగడ్బందీగా నిర్వహించాలంటే పోలీసులు ఎక్కువగా శ్రమించాల్సింది వస్తోంది. పెరుగుతున్న కేసుల దృష్ట్యా మొదట్లో ఉన్నంత ఉత్సాహంగా పోలీసులు ఇప్పుడు ఉంటారా అనే అనుమానం కలుగుతుంది. ఎవరి నుండి వైరస్ సోకుతుందో తెలియని పరిస్థితి పోలీసులు అంత రిస్క్ చేస్తారా అనే ప్రశ్న తలెత్తుతుంది. ఆరోగ్య భద్రత కింద కరోనా ఉండదని ప్రభుత్వం చెప్పడంతో సిబ్బంది పరిస్థితి ఆందోళన గా ఉంది. దీంతో ఉన్నతధికారులు సిబ్బందిలో మనోధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పది మందికిపైగా పోలీస్‌ సిబ్బంది మృత్యువాత పడ్డారు. ఐదు వందలకు పైగా పోలీస్ సిబ్బంది వైరస్ తో పోరాడుతున్నారు. ఒక్క హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లోనే సగానికిపైగా పోలీస్ స్టేషన్లలో మొత్తం సిబ్బంది వైరస్ బారిన పడి హోమ్ ఐసోలేషన్‌లో ఉంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం లాక్ డౌన్ విధిస్తే దాన్ని అమలు చేసేందుకు పోలీసులు ఎలాంటి రిస్క్‌ తీసుకుంటారో చూడాలి.

Full View


Tags:    

Similar News