Rythu Runamafi Latest News: రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు టోకరా పెట్టింది అని కేటీఆర్ ఆరోపించారు. తాజాగా తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం రైతులను మోసం చేసిందని అన్నారు. ఓవైపు జన్వాడ ఫామ్ హౌజ్ కూల్చివేత వివాదంపై సస్పెన్స్ కొనసాగుతుండగానే మరోవైపు కేటీఆర్ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ ప్రెస్ మీట్ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. " రేవంత్ రెడ్డి సర్కారు ప్రకటించిన రుణమాఫీ అందకపోవడం వల్ల రైతులే స్వయంగా రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపడుతున్నారు. రైతులు గుండెలు మండి రాస్తారోకోలు చేస్తోంటే.. ప్రభుత్వం పోలీసులను పంపించి వారిని అరెస్టులు చేయిస్తోంది. అన్నదాతలపై కేసులు పెట్టి వేధిస్తున్నారు. రైతులు రుణమాఫీ కోసం ధర్నాలు చేస్తుండగా.. పోలీసులు మాత్రం వారికి కనీసం 7 సంవత్సరాలు శిక్షపడేలా సెక్షన్ 126, రెండు సంవత్సరాలు శిక్షపడేలా సెక్షన్ 189, ఏడాది శిక్షపడేలా సెక్షన్ 223 కింద కేసులు పెట్టి వేధిస్తున్నారు" అని కేటీఆర్ మండిపడ్డారు.
ఓవైపు రైతుల రుణమాఫీ పూర్తయింది పాలాభిషేకాలు చేసుకోండి అని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. మరోవైపు 2 లక్షల రుణమాఫీ పూర్తయింది అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఊదరగొడుతున్నారు. ఇలా ముఖ్యమంత్రి, మంత్రులు కలిసి అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు అని కేటీఆర్ అసహనం వ్యక్తంచేశారు.
వైరా సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తూ మొత్తం 31 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని చెప్పిన వీడియోను కేటీఆర్ ఈ మీడియా సమావేశంలో ప్రసారం చేసి చూపించారు. అలాగే డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కతో పాటు మిగతా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వివిధ సాంకేతిక కారణాల వల్ల ఇప్పటివరకు రుణమాఫీ కానీ రైతుల్లో మిగతా 12 వేల కోట్లు కూడా జమ చేయడం జరుగుతుంది అని చెప్పిన వీడియోలను కూడా కేటీఆర్ ప్రసారం చేసి చూపించారు.
ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినదానికి, మంత్రులు చెప్పినదానికే పొంతన లేనప్పుడు వాస్తవం ఏంటో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు అని కేటీఆర్ పేర్కొన్నారు. మల్లు భట్టి విక్రమార్క చెప్పిన వివరాల ప్రకారం రైతుల రుణమాఫీ అనేది అసలు జరగనే లేదు అని స్పష్టంగా అర్థమవుతోందన్నారు. అంతేకాదు.. అసలు మంత్రులకు రైతుల రుణమాఫీపై స్పష్టత ఉందా లేదా అని నిలదీశారు. రైతులను మోసం చేసి రైతు స్వరాజ్యం అని ఎలా చెబుతారు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతులకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసన దీక్షలకు దిగుతామన్నారు. మండల కేంద్రాల్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి ధర్నాలకు దిగాల్సిందిగా కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.