KTR: సింగరేణి ప్రాంత నాయకులతో కేటీఆర్ భేటీ
KTR: సింగరేణిని ప్రైవేటీకరించేందుకు కేంద్రం బొగ్గు గనులను వేలం వేసింది
KTR: సింగరేణిని ప్రైవేటీకరణ చేసేందుకే కేంద్రం తెలంగాణ బొగ్గు గనులను వేలం వేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గతంలోనూ బలవంతంగా రెండు బొగ్గు గనులను ప్రైవేట్ సంస్థలకు కేటాయించినప్పటీకి అప్పటి సీఎం కేసీఆర్ తట్టెడు మట్టి కూడా ఎత్తనీయలేదని గుర్తు చేశారు. ఇకపై కూడా తట్టెడు మట్టిని ఎత్తనివ్వబోమని కేటీఆర్ స్పష‌్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 6 నెలలు కూడా కాలేదని.. అప్పుడే బీజేపీతో కలిసి తెలంగాణ బొగ్గు గనులను వేలానికి పెట్టారని ఆరోపించారు. తెలంగాణ గొంతుక పార్లమెంట్లో లేదన్న భ్రమతోనే కాంగ్రెస్, బీజేపీతో కలిసి ఈ కుటిల ప్రయత్నం చేస్తున్నాయన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సింగరేణిని కాపాడుకుంటామని కేటీఆర్ అన్నారు.