KTR Padayatra: త్వరలోనే పాదయాత్ర.. కేటీఆర్ సంచలన ప్రకటన..!
KTR Padayatra: బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు అభ్యర్థన మేరకు భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
KTR Padayatra: బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు అభ్యర్థన మేరకు భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎక్స్ వేదిగా నిర్వహించిన ‘ఆస్క్ కేటీఆర్’ క్యాంపెయిన్‌లో యూజర్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఇందులో భాగంగా పాదయాత్రపై కేటీఆర్ స్పష్టత ఇచ్చారు.
‘‘పార్టీ కార్యకర్తల ఆకాంక్షలతో భవిష్యత్‌లో పాదయాత్ర చేస్తా. రాష్ట్రవ్యాప్తంగా విస్త్రృతంగా పాదయాత్ర చేస్తా. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు శాపం. కాంగ్రెస్ పాలనలో నష్టం నుంచి రాష్ట్రం కోలుకోవడం అసాధ్యం. బీఆర్‌ఎస్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయం’’ అని కేటీఆర్ తెలిపారు.
కేసీఆర్ ఆరోగ్యం, రాజకీయాలపై..
2025లో కేసీఆర్ రాజకీయాల్లో యాక్టీవ్ గా ఉండబోతున్నారని.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి కాస్త సమయం ఇచ్చారని చెప్పారు. రాష్ట్రం ఉన్నన్ని రోజులు, తెలంగాణ పదం ఉన్నన్ని రోజులు కేసీఆర్ పేరు నిలిచే ఉంటుందన్నారు. కేసీఆర్ సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నారని, ఆయన పార్టీని, తమ నాయకులందరికీ ఎప్పటికప్పుడు ఆయా అంశాల పైన మార్గదర్శనం చేస్తున్నారని తెలిపారు.
బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా కొత్తగా ఎన్నికైన ఈ ప్రభుత్వానికి ఇచ్చిన 420 హమీలు అమలు చేసేందుకు సరిపడా సమయం ఇచ్చారన్నారు. నూతన సంవత్సరం తర్వాత ఆయన నుంచి మరిన్ని కార్యక్రమాలను చూస్తామన్నారు.