KTR's Bold Answers : కేసీఆర్ ఆరోగ్యంగానే ఉన్నారు.. 2025 నుండి ప్రజా జీవితంలోకి వస్తారు..
KTR about BRS chief KCR health condition: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా (గతంలో ట్విటర్) #AskKTR పేరుతో నెటిజెన్స్‌తో గంటన్నరపాటు ముచ్చటించారు.
KTR about BRS chief KCR health condition: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా (గతంలో ట్విటర్) #AskKTR పేరుతో నెటిజెన్స్‌తో గంటన్నరపాటు ముచ్చటించారు. ఈ సందర్భంగా నెటిజెన్స్ అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ స్పందిస్తూ ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఒక నెటిజెన్ కేసీఆర్ ఆరోగ్యం గురించి వాకబు చేశారు. మీ నాన్న కేసీఆర్ ఎందుకు బయటికి రావడం లేదు, మాట్లాడటం లేదు. ఆయన ఆరోగ్యం ఎలా ఉందని ఆరా తీశారు. ఆ నెటిజెన్ సందేహానికి కేటీఆర్ చాలా వివరంగా జవాబిచ్చారు."కేసీఆర్ చాలా ఆరోగ్యంగా ఉన్నారు. మిమ్మల్ని ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూనే ఉన్నారు. అధికార పార్టీ ఇచ్చిన 420 హామీలను నిలబెట్టుకునేందుకు బాధ్యత కలిగిన ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తున్నారు. 2025 తరువాత ఆయన బయటికి వస్తారు" అని కేటీఆర్ స్పష్టంచేశారు.
హైడ్రా, మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై మీ అభిప్రాయం ఏంటని ఆశిష్ అనే నెటిజెన్ అడిగిన ప్రశ్నకు కేటీఆర్ స్పందించారు. వాస్తవానికి ఆ రెండింటి ఉద్దేశం చాలా గొప్పదే. కానీ ఆ గొప్పతనం అంతా పేపర్లపైకే పరిమితమైంది. వాటిని అడ్డం పెట్టుకుని దోచుకుంటున్నారు. మూసీ సుందరీకరణకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు. కానీ మూసీ పేరు చెప్పుకుని దోచుకుంటాం అంటే ఒప్పుకోమని అన్నారు. " హైడ్రా కూడా ఎంపిక చేసుకుని మరీ అల్పదాయవర్గాల వారినే టార్గెట్ చేసుకుంటోంది. ధనికులు, పెద్ద పెద్ద బిల్డర్ల జోలికి హైడ్రా వెళ్లడం లేదు" అని కేటీఆర్ ఆరోపించారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్, ఆటోమేషన్, డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ అంటూ కొత్తకొత్త టెక్నాలజీలు పుట్టుకొస్తున్నాయి కదా.. ఈ విషయంలో రాబోయే తరానికి మీరు ఇచ్చే సలహా ఏంటని మరో నెటిజెన్ అడిగారు. అందుకు కేటీఆర్ స్పందిస్తూ, కొత్తకొత్త టెక్నాలజీలు పుట్టుకురావడం అనేది ఇప్పుడేం కొత్త కాదని అన్నారు. అయితే, కొత్త కొత్త సవాళ్లనే అవకాశాలుగా మల్చుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆ కొత్త సాంకేతిక పరిజ్ఞానమే కొత్త అవకాశాలకు బాటలు వేస్తుందన్నారు.
తమిళ నటుడు విజయ్ పార్టీ స్థాపించిన రాజకీయాల్లోకి వచ్చిన నేపథ్యంలో ఒక్క ముక్కలో ఆయన గురించి ఏం చెబుతారు అని మరో నెటిజెన్ అడిగారు. అందుకు కేటీఆర్ చాలా సింపుల్‌గా స్పందిస్తూ.. మై బెస్ట్ విషెస్ అని రిప్లై ఇచ్చారు.
బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఐదేళ్లపాటు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందా? రాజ్యంగం పరంగా అంతకంటే ముందే ప్రభుత్వాన్ని మార్చే అవకాశం లేదా ? ఇది మరో నెటిజెన్ అడిగిన ప్రశ్న. కేటీఆర్ ఈ ప్రశ్నకు జవాబిస్తూ.. జనమే వారిని ఎంచుకున్నారని, వారి నిర్ణయాన్ని గౌరవిద్దామని అన్నారు. అందుకే ఈ ఐదేళ్లు ఆగుదాం అని కేటీఆర్ స్పష్టంచేశారు.
మళ్లీ మంత్రి ఎప్పుడు అవుతారు అని ఒక నెటిజెన్ అడిగిన ప్రశ్నకు స్పందించారు. 2028 ఎన్నికల తరువాతే మళ్లీ మంత్రిగా వస్తానని కేటీఆర్ ఆశాభావం వ్యక్తంచేశారు.
మహారాష్ట్రలో మీ పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు. కానీ ఇప్పుడు ఎన్నికల బరిలో లేరు. మరి ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల్లో మీరు ఎవరికి మద్దతు ఇస్తారు? ఇది మరొక నెటిజెన్ అడిగిన ప్రశ్న. కేటీఆర్ వివరణ ఇస్తూ, బీజేపి, కాంగ్రెస్.. ఈ రెండు జాతీయ పార్టీలను మాత్రం నమ్మొద్దన్నారు. అక్కడి ప్రాంతీయ పార్టీలలో ఏదో ఒకదానిని ఎంచుకోవాలి అని పేర్కొన్నారు.
ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ కలిపేసుకుంది. అయినా కూడా మళ్లీ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందనే నమ్మకం మీకుందా? అంతేకాదు.. బీజేపీ , బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒక్కటేనని కాంగ్రెస్ పార్టీ చాలా గట్టిగా ప్రచారం చేసింది కదా.. దీనిపై మీరు ఏమంటారు అంటూ జైనీ సృజన్ అనే మరొక నెటిజెన్ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కేటీఆర్ తనదైన స్టైల్లో జవాబిచ్చారు. నేతలను నాయకులను చేసేదే జనం అని అన్నారు. మేం ఎంత బలంగా మళ్లీ అధికారంలోకి తిరిగొస్తాం అనేది చూస్తూ ఉండండని బదులిచ్చారు.
టీడీపీ, వైఎస్సారీపీలతో ఎలాంటి సంబంధాలున్నాయి? సిద్ధాంతాలపరంగా కలిసి వెళ్లాల్సి వస్తే ఏ పార్టీ వైపు ఉంటారు?
టీడీపీ, వైఎస్సార్సీపీలోని అగ్ర నాయకులతో మాకు మంచి సత్సంబంధాలున్నాయి. వివిధ అంశాలపై మా మధ్య బిన్నాభిప్రాయాలు ఉంటుండ వచ్చేమో కానీ వ్యక్తిగతంగా మాకే విబేధాలు లేవు అని కేటీఆర్ తెలిపారు.
గత పదేళ్లుగా అధికారంలో ఉండి సినిమాలు చూసే సమయం, తీరిక లేకపోవచ్చు కదా.. మరి ఈమధ్యలో ఏమైనా సినిమాలు చూశారా అని ఇంకో నెటిజెన్ ప్రశ్నించారు. నచ్చిన సినిమా ఏంటని ప్రశ్నించారు.
కేటీఆర్ స్పందిస్తూ విజయ్ సేతుపతి నటించిన మహారాజ సినిమా చూశానన్నారు. సినిమా టెర్రిఫిక్ అనిపించిందని పేర్కొన్నారు.