Komatireddy: ప్లీజ్ సర్ క్షమించండి.. అందుకే అపాయింట్‌మెంట్ దొరకడం లేదా?
Komatireddy: నమ్ముకున్న పార్టీలో ఎలివేషన్ రావట్లేదు పార్టీ పగ్గాలు దక్కుతాయన్న ఆశ కనిపించలేదు.
Komatireddy: నమ్ముకున్న పార్టీలో ఎలివేషన్ రావట్లేదు పార్టీ పగ్గాలు దక్కుతాయన్న ఆశ కనిపించలేదు. అందివచ్చిన అవకాశాలని వినియోగించడంలో పార్టీలో ఇతర నేతల సహకారం అసలే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మరో ఊహించని దెబ్బ!!. పీసీసీ ప్రకటనకు ముందు జరిగిన వివాదమో లేదా మరేదైనా వ్యక్తగత కోపమో కానీ ఆయనకు అపాయింట్‌మెంట్ దొరకడం లేదట. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆ పెద్ద మనిషి పట్టించుకోవడం లేదట. కలుస్తానంటే ఇదిగో, అదిగో అంటూ దాటవేస్తున్నారట. ఆ మాటకొస్తే అసలు ఫోనే ఎత్తడం లేదట. అసలు అపాయింట్‌మెంట్ దొరకనిది ఎవరికి? ఇవ్వక ససేమిరా అంటోంది ఎవరు?
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. భువనగిరి ఎంపీ. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఫైర్‌బ్రాండ్‌గా పేరున్న నేత. ఆయన పార్టీలో ఏది చేసిన సంచలనమే. ఏం మాట్లాడినా సంచలనమే. అలాంటి కోమటిరెడ్డికి కొన్నాళ్ల నుంచి కాలం కలసి రావడం లేదట. మనిషి చూడటానికి కాస్త సాఫ్ట్‌గా కనిపించినా వ్యవహారం దుకూడుగా ముందుకు ఉండటం వెంకట్‌రెడ్డిని ఫైర్‌బ్రాండ్‌గా నాయకుడిగా నిలబెట్టింది. ఆ వ్యక్తిత్వమే ఆయనను రాజకీయాల్లో కీలకమై నాయకుడిగా ఎదిగేలా చేసింది. అలాంటి కోమటిరెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం నుంచి సరైన సహకారం అందడం లేదట. రేవంత్‌రెడ్డిని పీసీసీ చీఫ్‌గా నియమించినప్పటి నుంచీ పార్టీ నిర్వహించే కార్యక్రమాలకు దూరంగా ఉంటూ నియోజకవర్గ కార్యక్రమాలకు మాత్రమే హాజరవుతున్న వెంకట్‌రెడ్డి హైకమాండ్ తీరును తప్పుపడుతూ అప్పట్లో ఆగ్రహంతో ఊగిపోయారు. అధికారిక ప్రకటన వచ్చిన తరువాత ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చాక, రేవంత్‌రెడ్డిపై రెచ్చిపోయారు. పార్టీ ఇన్‌ఛార్జ్ మాణిక్కం ఠాగూర్‌పైనా ఆరోపణలు గుప్పించారు. అలా అధిష్టానం ఆగ్రహానికి గురయ్యారు.
ఆ ఆగ్రహమే ఆ పెద్ద మనిషి అపాయింట్‌మెంట్ దక్కకుండా చేస్తోందట. జాతీయ పార్టీకి ఎంపీగా ఉన్న కోమటిరెడ్డికి, ఆ పార్టీ ఇన్‌ఛార్జి ఠాగూర్‌ను కలిసే అవకాశమే రావడం లేదట. ఎన్నిసార్లు ఫోన్ చేసినా అందుబాటులోకి రావడం లేదట. అపాయింట్‌మెంటు కాదు కదా ఫోన్ చేసినా ఎత్తడానికి ఆయన మొండికేస్తున్నారట. రాష్ట్రానికి వచ్చినా ఢిల్లీల్లో ఉన్నా ససేమిరా అంటున్నారట. దీంతో కోమటిరెడ్డి ఆవేదన చెందుతున్నారన్న చర్చ జరుగుతోంది. తానేం తప్పు చేశానని తన అనుచరుల వద్ద చెప్పుకుంటున్నారట. విషయాన్ని పార్టీ సీనియర్లకు చెప్పడం, వారు ఏవేవో సలహాలు ఇవ్వడం. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్‌గా మారుతోందన్న చర్చ జరుగుతోంది.
తెలంగాణ కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి వచ్చిన ఈ చిక్కు సమస్యపై సీనియర్లు కూడా ఆలోచనలో పడ్డారట. పీసీసీ ప్రకటన వచ్చిన నాడు ఇన్‌ఛార్జ్ ఠాగూర్‌తో కాస్త సంయమనంతో ఉంటే బాగుండేదంటూ ఇప్పుడు సలహా ఇస్తున్నారట. రేవంత్ దగ్గర డబ్బులు తీసుకొని ఆయనకు పీసీసీ పదవి ఇచ్చారని ఠాగూర్‌ను ఉద్దేశించి అనడం ఆయనకు కోపం తెప్పించి ఉంటుందని లెక్కలు వేస్తున్నారట. ఓటుకు నోటులాగే, ఓటుకు పీసీసీ పదవి అమ్ముకున్నారని ఆగ్రహంతో ఊగిపోవడమే కోమటిరెడ్డికి ఇబ్బందిగా మారిందని చెప్పుకుంటున్నారట. లోకల్‌గా ఇంత జరిగినా అధిష్టానం దగ్గర మంచి పలుకువడి ఉన్న కోమటిరెడ్డికి హైకమాండ్ సరైన గుర్తింపునే ఇచ్చింది. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ, నియోజకవర్గానికే పరిమితం అవడం మంచిది కాదంటూ కీలక కమిటీలో పదవి కేటాయించింది. ఇదంతా బాగానే ఉన్నా ఠాగూర్ తన విషయంలో చూపిస్తున్న వివక్షను మాత్రం వెంకట్‌రెడ్డి తట్టుకోలేకపోతున్నారట.
పొలిటికల్ ఎఫైర్ కమిటీలో చోటు కల్పించిన నాటి నుంచి మాణిక్కం ఠాగూర్‌తో భేటి అవ్వడానికి కోమటిరెడ్డి చేయని ప్రయత్నం లేదట. కానీ మాణిక్కం ససేమిరా అంటూ, కోమటిరెడ్డి ఫోన్‌కు రిప్లై కూడా ఇవ్వడం లేదట. దాదాపు రెండునెలలుగా ఆయన అందుబాటులోకి రావడం లేదన్న చర్చ పార్టీలో జోరుగా జరుగుతోంది. ఇటీవల రెండుసార్లు ఠాగూర్ హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని కోమటిరెడ్డి తనకు సన్నిహితులైన సీనియర్ల వద్ద ప్రస్తావించారట. అయ్యిందేదో అయ్యింది ఇక రాజీకొద్దామని కోమటిరెడ్డి ఓ మెట్టు దిగినా ఆయన పట్టు విడవడం లేదట. పీఏసీలో సీటిస్తే రేవంత్ పని తీరును నిలదీయడానికి మంచి అవకాశంగా భావిస్తున్నా ఆ కమిటీకి ఛైర్మన్‌గా ఉన్న ఠాగూర్ ఓకే చెప్పలేకపోవడంతో కోమటిరెడ్డి కమిటీ మీటింగ్ రావడం లేదటన్న చర్చ జరుగుతోంది. అందుకే కొందరు సీనియర్ల సలహాతో ఇన్‌చార్జ్‌తో మంతనాలకు చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే, రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యారన్న ఉక్రోశమో, తనకు రాలేదన్న ఆవేదనో కానీ పీసీసీ ప్రకటనకు ముందు, తర్వాత ఆవేశంలో ఇష్టమొచినట్లు ఆరోపణలు చేసిన కోమటిరెడ్డి అదంతా ఏదో అయిందని తూచ్ అంటున్నారట. కానీ పట్టరానంత కోపంతో అన్న మాటలని మనసులో పెట్టుకున్న మాణిక్కం కావాలనే కోమటిరెడ్డిని అవాయిడ్ చేస్తున్నారని పార్టీలో నేతలు కొందరు చెప్పుకుంటున్నారు. మరి కోమటిరెడ్డి మళ్లీ తన టైమ్ ఎప్పుడొస్తుందో తన ప్రయత్నం ఎప్పుడు ఫలిస్తుందో చూడాలి.