కోమటిరెడ్డి బ్రదర్స్ మళ్లీ ఫాంలోకి వచ్చారా.. గాంధీభవన్‌లో బ్రదర్స్‌పై ఎలాంటి చర్చ జరుగుతోంది?
నల్గొండలో కోమటిరెడ్డి బ్రదర్స్ మళ్లీ ఫాంలోకి వచ్చారా? మున్సిపల్ పీఠాలపై, ఓ రేంజ్‌లో పోరాటం చేసిన కోమటి రెడ్డి సోదరులపై, గాంధీభవన్‌లో ఎలాంటి చర్చ జరుగుతోంది?
నల్గొండ జిల్లాలో పద్దెనిమిది మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో చండూరును మాత్రమే కాంగ్రెస్ గెలుచుకోగలిగింది. నేరేడుచర్ల, హాలియా,నల్గొండ, చౌటుప్పల్, యాదగిరిగుట్టల్లో మాత్రం టిఆర్ఎస్‌కు దీటుగా కౌన్సిలర్లను గెలుచుకుని, సవాల్ విసిరింది కాంగ్రెస్. జిల్లాలో అన్ని మున్సిపాలిటీల్లో గెలవాలన్న ఫ్లాన్ టిఆర్ఎస్‌ది. కానీ తాను పెద్దగా గెలవకపోయినా, గులాబీ వ్యూహానికి మాత్రం చెక్‌పెట్టామంటున్నారు కాంగ్రెస్ నేతలు.
నేరేడుచర్ల మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక, తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. మూడు రోజుల పాటు నేరేడుచర్ల ఇష్యూ నడిచింది. టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గం లోని మున్సిపాలిటీ ఇది. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఓడాక, మున్సిపల్ ఎన్నికలను చాలెంజ్‌గా తీసుకున్నారు ఉత్తమ్. నేరేడుచర్ల కోసం ధర్నా , రాస్తారోకోలు చేశారు. ఏకంగా సూర్యాపేట కలెక్టర్ ట్రాన్స్ ఫర్‌కు డిమాండ్ చేశారు. ఎన్నికల సందర్భంలో అరెస్టు కావడంతో, పార్టీకి మైలేజ్‌తో పాటు, నేరేడుచర్లపై రాజకీయ పోరాటం కాంగ్రెస్‌కు సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని అంటున్నారు విశ్లేషకులు.
ఇక మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి, చౌటుప్పల్‌లో రచ్చ రచ్చే చేశారు. ఎన్నికల నాడు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని, తీరా గెలిచాక టిఆర్ఎస్‌తో ముగ్గురు సిపిఎం పార్టీ కౌన్సిలర్లు వెళ్లిపోవడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. కాంగ్రెస్ క్యాడర్‌తో కలిసి సిపిఎం పార్టీ కార్యాలయంపైనే దాడి చేశారు. పరస్పర రాళ్లదాడితో చైర్మన్ ఎన్నిక రోజు ఉద్రిక్తంగా మారింది చౌటుప్పల్.
ఇక భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డీ అంతే. యాదగిరిగుట్ట ఇష్యూతో రాజకీయాల్లో శాశ్వత మిత్రులు,శాశ్వత శత్రువులు ఉండరని నిరూపించారు. అప్పటి వరకు ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతతో కోమటిరెడ్డి బ్రదర్స్‌కు రాజకీయంగా మంచి సంబంధాలున్నాయని అనుకున్నారు. కానీ యాదగిరిగుట్ట మున్సిపాలిటీ విషయంలో ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతపై తీవ్ర విమర్శలు చేసారు కోమటిరెడ్డి బ్రదర్స్. ఆమె కూడా అంతేదీటుగా సమాధానం ఇచ్చినా యాదగిరిగుట్ట మున్సిపాలిటీ ఎన్నిక అయ్యే వరకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫాలో అప్ చేశారు. యాదగిరిగుట్టతో పాటు ఆదిభట్ల, పెద్ద అంబర్ పేట, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి టిఆర్ఎస్‌పై దూకుడు ప్రదర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీకి ఏకపక్షంగా చైర్మన్‌లు వస్తున్నా, ఏమాత్రం నిస్సహాయంగా వుండకుండా, ఉత్తమ్, కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయ పోరాటంతో శ్రేణుల్లో ఉత్సాహం నింపారని క్యాడర్ చెప్పుకుంటున్నారు.