మాజీ ఎంపీ పొంగులేటి, మాజీ మంత్రి జూపల్లి బీఆర్ఎస్‌ నుంచి సస్పెండ్‌

* పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపణ

Update: 2023-04-10 04:50 GMT

మాజీ ఎంపీ పొంగులేటి, మాజీ మంత్రి జూపల్లి బీఆర్ఎస్‌ నుంచి సస్పెండ్‌

BRS: మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని భారాస సస్పెండ్‌ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఇద్దరిపై వేటు వేసింది. భారాస అధినేత, సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది.

కొల్లాపూర్‌కు చెందిన జూపల్లి కృష్ణారావు గతకొంతకాలంగా భారాసపై అసంతృప్తితో ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డితో ఆయనకు విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పలు సందర్భాల్లో బహిరంగంగానే ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వంపై జూపల్లి విమర్శలు చేశారు. కొల్లాపూర్‌ భారాసలో జూపల్లి వర్గం అసమ్మతి కారణంగా నష్టం జరుగుతోందని ఆ పార్టీ భావించింది. దీంతో గతంలో మంత్రి కేటీఆర్‌ సైతం ఆయనతో మాట్లాడినా ఫలితం లేకపోయింది.

మరోవైపు ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి గతకొంతకాలంగా కేసీఆర్‌, భారాసపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. పార్టీ మారతారని ఇటీవల ప్రచారం జరుగుతున్నా అది కార్యరూపం దాల్చలేదు. కొద్దిరోజులుగా ఆత్మీయ సమావేశాల పేరుతో జిల్లాలోని తన వర్గం నేతలతో ఆయన భేటీ అవుతున్నారు. ఆయా సమావేశాల్లో కేసీఆర్‌ కుటుంబంపై విమర్శలు చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో జూపల్లి, పొంగులేటిని భారాస సస్పెండ్‌ చేసింది.

Tags:    

Similar News