రాములమ్మా...అంత మాట అనేశావేంటమ్మా.. పీసీసీ రేసుకు-ట్వీట్‌కు ఏదో కనెక్షన్‌ వుందా?

Update: 2020-02-05 10:16 GMT
రాములమ్మా

గాయం విలువ తెలిసినవాడే సాయం చేయలగలడు బాబాయ్ అంటూ, సరిలేరు నీకెవ్వరుతో, సెకండ్‌ ఇన్నింగ్స్ గ్రాండ్‌గా స్టార్ట్ చేశారు విజయశాంతి. ఇక నుంచి వరుసబెట్టి సినిమాలు ఇరగదీస్తారన్న ప్రచారమూ జరిగింది. కానీ ఇంతలోనే ఏమైందో ఏమో కానీ, సినిమాలకు సెలవు అన్నట్టుగా ఆమె వ్యాఖ్యానించడం అభిమానులను నిరాశపరుస్తుంటే, రాజకీయవర్గాలనూ ఆశ్చర్యపరుస్తోంది. ఇంతకీ రాములమ్మ సినిమాలకు గుడ్‌ బై చెప్పినట్టేనా? లేదంటే విజయశాంతి ట్వీట్‌ వెనక అంతుచిక్కని అర్థం ఏదైనా వుందా?

దశాబ్ద కాలానికిపైగా వెండితెరకు దూరంగా ఉన్న లేడీ సూపర్‌స్టార్‌ విజయశాంతి, సరిలేరు నీకెవ్వరు సినిమా ఇచ్చిన సక్సెస్‌తో రాజకీయాలకు దూరమవుతారంటూ వార్తలు వచ్చాయి. ఇక సినిమాలే చేస్తారని, ప్రజాజీవితానికి దూరమైనట్లే అంటూ వార్తలు వినిపించాయి. అయితే కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు విజయశాంతి. పార్టీ నాయకులతో అంటిముట్టనట్టుఉంటున్నారు. ఇటు గాంధీభవన్ కు కూడా రావడము లేదు. అయితే, ఈ విషయంలో ట్విట్టర్ వేదికగా కొంతక్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు రాములమ్మ.

రాజకీయాల్లో చేరి తనదైన పంథాలో గుర్తింపు తెచ్చుకున్న ఆమె బీజేపీ, టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌లో పని చేయడమే కాదు సొంతంగా తల్లి తెలంగాణ పార్టీని కూడా స్థాపించారు. ఆ తర్వాత ఆ పార్టీని టీఆర్ఎస్‌లో విలీనం చేశారు. కేసీఆర్‌కు చెల్లెలు అన్నట్లుగా ఉన్న ఆమె, కొన్నాళ్లకు ఆయనతో విభేదించి కాంగ్రెస్‌లో చేరారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌గా వ్యవహరించారు. అయితే, అప్పటి ప్రచారంలో కొన్ని సభల్లో మాత్రమే పాల్గొని టీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి తర్వాత విజయశాంతి రాజకీయాల్లో సైలెంట్‌ ఉండిపోయారు. అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత లోక్‌సభ ఎన్నికలకు కూడా కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌గా వ్యవహరించిన విజయశాంతి, మహేష్ బాబు సినిమా సరిలేరు నీకెవ్వరుతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాలో విజయశాంతి చేసిన నటనకు ప్రశంసలు లభించాయి. ఆ మూవీ సూపర్ హిట్ అవ్వడంలో విజయశాంతి పాత్ర కూడా ప్రత్యేకం అయితే విజయశాంతికి ఈ సినిమా తర్వాత వరుస ఆఫర్లు వస్తున్నాయి. వాటిని ఆమె సున్నితంగా తిరస్కరించారట.

ఈ క్రమంలోనే ట్విట్టర్ వేదికగా సరిలేరు నీకెవ్వరుకు ఇంత గొప్ప విజయాన్ని అందించి, తనను ఎల్లప్పుడూ ఆదరిస్తూ వస్తున్న ప్రేక్షకులకు, అభిమానులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలన్న విజయశాంతి, తన నట ప్రస్ధానానికి 1979 కళ్ళుకుల్ ఇరమ్,కిలాడి కృష్ణుడు నుంచి నేటి 2020 సరిలేరు నీకెవ్వరు వరకు గౌరవాన్ని అందించిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా జీవన పోరాటంలో తన ప్రయాణం, మళ్లీ మరో సినిమా చేసే సమయం, సందర్భం తనకు కల్పిస్తోందో, లేదో కూడా తెలియదు ఇప్పటికి ఇక శెలవు అంటూ అన్నారు. ఈ ట్వీట్‌ ఇప్పుడు సినిమా వర్గాల్లోనే కాదు, రాజకీయవర్గాల్లోనూ చర్చనీయాంశమైంది.

మనసు నిండిన మీ ఆదరణకు, ప్రాణప్రదమైన అభిమాన సైన్యానికి ఎప్పటికీ నమస్సులు అంటూ ఆమె ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ని బట్టి చూస్తే ఆమె మళ్లీ ఇంకో సినిమా చేసే ఆలోచనలో అయితే లేనట్టుగా అర్థమవుతోంది. రాజకీయాల్లోనే చురుగ్గా ఉండేందుకు ఆమె ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. సినీ ఇండస్ట్రీలో సెకెండ్‌ ఇన్నింగ్స్‌ అదరగొట్టిన రాములమ్మ, ప్రజాఉద్యమాలు చేసేందుకు సిద్దమవుతున్నట్టు చర్చ జరుగుతోంది. అయితే, సినిమాలకు ఇక సెలవు అన్నట్టుగా ఆమె ట్వీట్ చేయడం వెనక, ఒక వ్యూహమూ లేకపోలేదన్న చర్చ జరుగుతోంది.

పీసీసీ అధ్యక్ష రేసు జోరుగా సాగుతోంది. ఎవరికి వారు సీరియస్‌గా ట్రై చేస్తున్నారు. ఈ జాబితాలో విజయశాంతి కూడా వున్నారన్న చర్చ వినిపిస్తోంది. టీపీసీసీ పీఠం కోసం ఆమె సైలెంట్‌గా ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. అయితే, విజయశాంతి తిరిగి సినిమాల్లోకి వెళ్లారని, ఆమె రాజకీయాలకు మరింత దూరం కావాలనుకుంటున్నారని, అధిష్టానం దగ్గర కొంతమంది టీకాంగ్‌ నేతలు, అధిష్టానానికి చెబుతారేమోనని విజయశాంతి భావిస్తున్నారట. దీంతో పీసీసీ పీఠంపై సినిమాల ఎఫెక్ట్ పడేలా వుందని ఆమె ఆలోచిస్తున్నారట. అందుకే ఈ విషయంలో క్లారిటీ ఇచ్చి, తనపై జరుగుతున్న ప్రచారానికి చెక్‌ పెట్టే ప్రయత్నంలో భాగంగానే, సినిమాలకు సెలవు అన్నట్టుగా ట్వీట్ చేశారని, రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. తాను సినిమాలకు వెళ్లనని, ఇక పూర్తిస్థాయి రాజకీయాలు చేస్తానని చాటేందుకే, రాములమ్మ ఇలాంటి ట్వీట్ చేశారన్న చర్చ జరుగుతోంది. చూడాలి, రాములమ్మ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో?   



Tags:    

Similar News