ఆరోగ్య శాఖ కొందరికి అచ్చిరావడం లేదా.. ఆ శాఖ చేపట్టిన ముగ్గురి పరిస్థితే అందుకు నిదర్శనమా?
ఆరోగ్యంగా వుండండి, ఆరోగ్యంగా వుంచండి అని ముఖ్యమంత్రి వారికి ఆరోగ్య శాఖను అప్పగించారు. అదెంటో గానీ, ఏ ముహూర్తాన వారు ఆరోగ్య శాఖలో అడుగుపెట్టారో గానీ, రాజకీయ అనారోగ్యం బారినపడుతున్నారు. అందుకే ఆరోగ్య శాఖ అంటేనే హడలిపోతున్నారు సదరు ప్రజాప్రతినిధులు. హెల్త్ మినిస్ట్రీ అచ్చిరావడంలేదని లోలోపల మధనపడుతున్నారు.
తెలంగాణ ఆరోగ్య శాఖ, కొందరు గులాబీ నేతలకు అచ్చిరావడం లేదన్న చర్చ నడుస్తోంది. ఒకప్పుడు ఆరోగ్య శాఖ అంటే చాలామంది నేతలు ఎగబడేవారు. ప్రజలకు నేరుగా సేవ చేసే అవకాశం, సంతృప్తి వుండేదని ఫీలయ్యేవారు. కానీ తెలంగాణలో ఇప్పుడు హెల్త్ మినిస్ట్రీ అంటేనే, కొందరు నేతలు హడలిపోతున్నారట. ఎందుకీ శాఖ ఇచ్చారని సణుక్కుంటున్నారట. ఎందుకంటే, గతంలో ఈ శాఖ నిర్వహించిన నేతల పరిస్థితి అయోమయంగా మారడమే ఇందుకు కారణమంటున్నారు విశ్లేషకులు.
టీఆర్ఎస్ మొదటి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి హోదాతో రాజయ్యకు వైద్య ఆరోగ్యశాఖ అప్పగించారు. అయితే ఆయనతో వచ్చిన సమస్య ఏమిటో చెప్పలేదు కానీ, ఏకంగా క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేశారు. తర్వాత ఆ శాఖను లక్ష్మారెడ్డికి అప్పగించారు. ఆయనతో కెసిఆర్‌కు ఎలాంటి విభేదాలూ రాలేదు. కానీ రెండోసారి అధికారంలోకి వచ్చాక లక్ష్మారెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కలేదు.
రెండోసారి అధికారంలోకి వచ్చాక వైద్య ఆరోగ్య శాఖను ఈటెల రాజేందర్‌కు అప్పగించారు. ఈయనక్కూడా దాదాపు ఇదే పరిస్థితి. అసలు ఆయనను మంత్రివర్గంలో తీసుకుంటారా లేదా అన్న సస్పెన్స్ నడిచింది. చివరికి అనేక సమీకరణాలతో ఆయనకు మంత్రి పదవి దక్కింది. తనను తొలుత పక్కనపెట్టి, తప్పనిసరి పరిస్థితుల్లోనే శాఖ కట్టబెట్టారని ఫీలయిన ఈటెల, తీవ్ర మనస్తాపానికి లోనయ్యారట.
తర్వాత ఆయన మంత్రి పదవి ఎప్పుడు పోతుందో తెలియదు అన్న ప్రచారం జరిగింది. తన వ్యతిరేకులను ప్రోత్సహిస్తున్నారని ఈటెల రాజేందర్ తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయారు. తామే గులాబీ పార్టీలకు ఓనర్లమంటూ ఏకంగా బహిరంగ వ్యాఖ్యలు చేసి సంచలనమయ్యారు. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈటెల మధ్య కొంత గ్యాప్ ఏర్పడిందన్న ప్రచారం జోరుగా సాగింది. అందుకే ఏడాదిలో ఇంతవరకూ ఒక్కసారి కూడా, ఆరోగ్య శాఖపై ఈటెలతో కలిసి, సమీక్ష నిర్వహించలేదట కేసీఆర్. ఇలా ఆరోగ్య శాఖ తీసుకున్న ఏ నేతకూ, ఆ శాఖ కలిసిరావడం లేదని ప్రచారం జరుగుతోంది.