తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఆయన ప్రముఖమైన నాయకుడు కానీ ఆయన మనసు మాత్రం ఇంకా ఆయన మాతృ పార్టీ తెలుగుదేశం పార్టీలోనే ఉందట. ఆయన తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ నేత అయినా, ఇంకా ఏపిలో అమరావతిపై మాజీ అధినేతకు మద్దతుగా వాయిస్‌ను వినిపిస్తున్నారట. దీంతో ఆయన మనసంతా అక్కడే అనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది. ఇంతకీ ఆ ప్రముఖనేత ఎవ్వరు...?
ఆయనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. ఆయన తెలుగుదేశంను వీడి దాదాపు ఐదేళ్లు గడుస్తున్నా, ఆయన మనసు మాత్రం ఇంకా తెలుగుదేశం పార్టీలోనే ఉందనే చర్చ జరుగుతోంది. తెలంగాణ కాంగ్రెస్‌లో ముఖ్యమైన నేతగా ఉన్నా, ఆయన మనసు మాత్రం టిడిపిలోనే ఉందనే చర్చ తెలంగాణ రాజకీయవర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఆయన తాజాగా చేసిన వాఖ్యలే అందుకు నిదర్శమన్న మాటలు వినపడ్తున్నాయి.
ఏపీ రాజధాని అమరావతి గందరగోళంగా మారడం తెలంగాణవాదిగా సంతోషం కలిగిస్తోందని, కానీ.. భారత పౌరుడిగా బాధగా ఉందని అన్నారు. తెలంగాణ పౌరుడిగా ఎందుకు సంతోషంగా ఉందంటే.. ఏపీ రాజధాని గందరగోళంలో పడటం వల్ల హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందుతూ తెలంగాణకు ఆదాయం పెరిగిందని, అందుకే తెలంగాణవాదిగా సంతోషిస్తున్నానని తెలిపారు.
ఆంద్రప్రదేశ్‌లో రాజధాని ఆందోళనలు తెలంగాణకు మేలు చేస్తున్నాయని, హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ బూమ్ పెరగడానికి దోహదం చేస్తున్నాయని, చంద్రబాబు సహా టీడీపీ నేతలు రోజూ విమర్శిస్తూనే వున్నారు. ఇప్పుడీ మాటలు, రేవంత్ రెడ్డి నోటి నుంచి కూడా జాలువారాయి. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పెరుగుతున్నందుకు, తెలంగాణ వ్యక్తిగా సంతోషిస్తున్నానన్న రేవంత్, ఒక భారతీయుడిగా మాత్రం బాధపడుతున్నాని అన్నారు. రెండు రాష్ట్రాలుగా విడిపోయినా, చివరికి రేవంత్ కాంగ్రెస్‌లో చేరినా, ఆయన మనసు ఇంకా చంద్రబాబు చుట్టే తిరుగుతందనడానికి, ఈ వ్యాఖ్యలే నిదర్శనమని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ మారినా ఆయన మనసు మాత్రం చంద్రబాబు వద్దే ఉందని కొందరంటున్నారు.