Telangana: బీసీ ఓటు బ్యాంకుపై బీఆర్ఎస్ దృష్టి.. అసెంబ్లీలో పూలే విగ్రహం డిమాండ్ అందులో భాగమేనా?

Telangana: తెలంగాణలో బీసీ నినాదంతో బీఆర్ఎస్ ముందుకెళ్తోందా?

Update: 2024-02-05 14:45 GMT

Telangana: బీసీ ఓటు బ్యాంకుపై బీఆర్ఎస్ దృష్టి.. అసెంబ్లీలో పూలే విగ్రహం డిమాండ్ అందులో భాగమేనా?

Telangana: తెలంగాణలో బీసీ నినాదంతో బీఆర్ఎస్ ముందుకెళ్తోందా? బీసీలను తమ వైపునకు తిప్పుకునే బాధ్యతలను బీఆర్ఎస్ అధిష్టానం ఎమ్మెల్సీ కవితకు అప్పగించిందా? తెలంగాణ అసెంబ్లీలో పూలే విగ్రహం డిమాండ్ అందులో భాగమేనా? అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలు తమకు అండగా నిలిచారని బీఆర్ఎస్ భావిస్తోందా? పార్లమెంట్ ఎన్నికల్లో బీసీల ఓటు బ్యాంకును మరింత పదిలం చేసుకునే ప్లాన్‌ బీఆర్ఎస్ చేస్తోందా?

తెలంగాణలో బీసీ ఓటు బ్యాంకును పదిలం చేసుకోవడానికి ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. బీసీల అంశాన్ని తెరపైకి తీసుకురావడం ద్వారా ఆయా సామాజిక వర్గాలకు దగ్గర కావాలని ప్రయత్నం చేస్తోంది గులాబీ పార్టీ. మెజార్టీ ఓటు బ్యాంకు వర్గాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకును బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీసీల అంశాలపై స్పందిస్తున్నారు. యునైటెడ్ పూలే ఫ్రంట్ ఏర్పాటు చేశారు. బీసీల సామాజిక, రాజకీయ హక్కుల సాధన కోసం కవిత ఆధ్వర్యంలో వివిధ బీసీ సంఘాలు పోరాట బాటపట్టాయి.

తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని స్పీకర్ ప్రసాద్ కుమార్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. అదే విధంగా పూలే పేరుతో సంఘాన్ని ఏర్పాటు చేసి కార్యక్రమాలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల మధ్యప్రదేశ్‌లో జరిగిన బీసీల సదస్సుకు ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. ఇటు హైదరాబాద్‌లోనూ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. వివిధ రంగాల్లోని ప్రముఖులు, బీసీ మేధావులతో చర్చించారు. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ హక్కులు, పూలే విగ్రహం కోసం అన్ని జిల్లాలు, యూనివర్సిటీల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించనున్నారు. మరోవైపు దేశంలో బీసీ అజెండాగానే కీలక రాజకీయాలు నడుస్తాయనే అంచనాతో ముందుకుసాగుతున్నారు.

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష స్థానానికి పరిమితమైంది. అయితే ఈ సారి దళితులు, గిరిజనులు, రెడ్డి సామాజిక వర్గం, రూరల్ ముస్లిం సామాజికవర్గానికి చెందిన ప్రజలు కారు గుర్తుకు ఓట్లు వేయలేదనే చర్చ గులాబీ శ్రేణుల్లో జరిగింది. దళితులకు.. దళితబంధు లాంటి పథకాలు అమలు చేసినా.. ఓట్లు పొందేందుకు ఏ మాత్రం ఉపయోగపడలేదనే వాదన గులాబీ నేతల్లో ఉంది. అటు గిరిజనులకు పోడు పట్టాలు, తండాలను గ్రామ పంచాయతీలుగా చేసినప్పటికీ.. బంజారాలకు గిరిజన బంధు ఇవ్వలేదనే కారణంతోనే వారు కూడా దూరమైనట్లు భావిస్తున్నారు. మరో వైపు ఆయా సామాజిక వర్గాలు ఓట్లు వేయకపోవడంతోనే బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయిందని భావిస్తున్నారు.

అయితే తెలంగాణలోని చాలా రిజర్వు నియోజకవర్గాల్లో గులాబీ పార్టీ ఓటమిని చవిచూసింది. సింగరేణి ఏరియాలో కోలుకోలేని దెబ్బతిన్నది బీఆర్ఎస్. దీంతో ఎస్సీ, ఎస్టీల్లో కొన్ని కీలక కులాలు తమకు దూరం అయ్యాయని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో 52 శాతానికి పైగా వున్న బీసీలు తమకు అండగా నిలిచారని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. బీసీ సామాజిక వర్గాలు తమకు అండగా నిలవడం ద్వారానే 39 అసెంబ్లీ స్థానాల్లో అయినా బీఆర్ఎస్ గెలిచిందనే చర్చ అంతర్గతంగా జరుగుతోంది. దీంతో బీసీ సామాజిక వర్గాలు తమకు దూరం కాకుండా ఉండేందుకే కవిత బీసీ నినాదాన్ని ఎత్తుకున్నారనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ ఎన్నికల హామీని గుర్తు చేస్తూ.. కులగణన, బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల కోసం కవిత పట్టుబడుతూనే.. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ సర్కార్‌పై అటాక్ చేస్తున్నారు ఎమ్మెల్సీ కవిత.

ఇక త్వరలోనే జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు గులాబీ బాస్ కేసీఆర్. గత లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తొమ్మిది స్థానాలను కైవసం చేసుకుంది. అయితే ప్రస్తుతం ఆ పార్టీ ప్రతిపక్షంలోకి ఎంటర్ కావడంతో సిట్టింగ్ స్థానాలు నిలుపుకోవడమే సవాల్‌గా మారిందనే చర్చ జరుగుతోంది. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో తమకు అండగా నిలిచిన బీసీల ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బీసీల అంశాన్ని ఎత్తుకున్నారనే ప్రచారం స్టార్ట్ అయింది.

అయితే పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. బీసీల కోసం బీఆర్ఎస్ ఏం చేసిందని.. కాంగ్రెస్ ఆరోపిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల కోసమే ఎమ్మెల్సీ కవిత బీసీల జపం చేస్తున్నారని కౌంటర్ ఇస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పూలే విగ్రహం ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఎందుకు రాలేదని విమర్శలు చేస్తున్నారు. బీసీ వాదంతో కాంగ్రెస్‌లో ఉన్న బీసీ నేతలకు లాభం చేకూరుతుందని బీఆర్ఎస్ భావిస్తోంది. తెలంగాణ ఉద్యమంలో తమ వాదం కారణంగానే కీలక పదవులు తెలంగాణ నేతలకు వచ్చాయని ఎమ్మెల్సీ కవిత గుర్తుచేస్తున్నారు. మరి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలు ఏ పార్టీకి మద్దతు తెలియజేస్తారో వేచి చూడాలి.

Tags:    

Similar News