హైదరాబాద్‌... రెండో రాజధాని!!.. కొత్త చర్చపై దేశం ఏమంటోంది?

Update: 2019-11-06 09:04 GMT

ఎక్కడా లేని ఆశలు రేపడంలో రాజకీయ నాయకులను మించిన వారుండరు. హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని అవుతుందన్న విషయంలోనూ అలానే జరుగుతోంది. నిజానికి ఇదేమీ కొత్త విషయం కాదు. అంబేద్కర్ కాలంలో ఒకసారి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలోనూ ఈ అంశం తెరపైకి వచ్చింది. మూడు, నాలుగు నెలల క్రితం సోషల్ మీడియాలోనూ ఈ విషయమై చర్చ జరిగి ఆగిపోయింది. బీజేపీ సీనియర్ నేత, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు మరోసారి దేశ రెండో రాజధాని పై మాట్లాడడం పాత ప్రచారానికి ప్రాణం పోసినట్లయింది. సాధారణంగా విద్యాసాగర్ రావు తన వద్ద పూర్తి సమాచారం లేనిదే మాట్లాడరు. ఆయన అలా మాట్లాడారంటే, బీజేపీ అధిష్ఠానమే ఆయనతో అలా మాట్లాడించినట్లుగా భావిస్తున్నారు.

విద్యాసాగర్ రావు ప్రధానంగా ఢిల్లీలో పెరిగిపోయిన కాలుష్యం గురించి ప్రస్తావించారు. కాకపోతే కాలుష్యం గురించి ఆలోచించి మాత్రమే ఆయన దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్ చేయాలని వ్యాఖ్యానించి ఉంటారని అనుకోలేం. కాలుష్యమే కారణమనుకుంటే రెండో రాజధానిని చేయడానికి దక్షిణ భారతదేశంలో ఆ మాటకు వస్తే ఉత్తర భారతదేశంలోనే మరెన్నో నగరాలున్నాయి. హైదరాబాద్ గురించే ఆయన పర్టిక్యులర్ గా ప్రస్తావించారంటే మరేవో కారణాలుంటాయి. అవేంటో కూడా చూద్దాం. దేశానికి రెండో రాజధాని అంటే ఏమిటి ? నిజంగా కేంద్రప్రభుత్వం దేశానికి రెండో రాజధాని కావాలని కోరుకుంటుందా లాంటి ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. వాటి గురించి మాట్లాడుకునేందుకు ముందు మనం, నాలుగేళ్ళ తరువాతనే లేదంటే కాస్తంత ముందస్తుగానో జరగబోయే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల గురించి కూడా మాట్లాడుకోవాలి. ఏదైనా ప్రాంతంలో లేదంటే రాష్ట్రంలో పాగా వేయాలంటే బీజేపీ ఒక ప్రణాళిక ప్రకారం పని చేస్తుంది. మూడు, నాలుగేళ్ళ ముందు నుంచే ఏదైనా ఒక అంశాన్ని లేవనెత్తుతుంది. ప్రజలంతా దాని గురించే మాట్లాడుకునేలా చేస్తుంది. తాను హీరో అయ్యేందుకు ప్రయత్నిస్తుంది. హైదరాబాద్ లో మున్సిపల్ ఎన్నికలు కావచ్చు లేదంటే భవిష్యత్తులో రాబోయే ఎన్నికలైనా కావచ్చు. వాటికి పునాది వేసుకునేందుకు రెండో రాజధాని అంశాన్ని బీజేపీ తెరపైకి తీసుకువస్తుండవచ్చు. బీజేపీ దీన్నొక ఇష్యూగా చేసుకునే అవకాశం ఉంది.

దేశానికి రెండో రాజధాని అంశం ఇప్పటిదేమీ కాదు. గతంలోనే అంబేద్కర్ హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధానిగా చేసే అంశం గురించి ప్రస్తావించారు. హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతులకు నిలయంగా ఉండడం, చక్కటి వాతావరణం, సైనికపరంగా వ్యూహాత్మకంగా కీలకస్థానంలో ఉండడం, ఉత్తర - దక్షిణ భారతాలను అనుసంధానం చేసే ప్రాంతంలో ఉండడం లాంటి వాటన్నిటినీ ఆయన దృష్టిలో ఉంచుకొని ఉండవచ్చు. విచిత్రమేమిటంటే బీజేపీ కూడా ఇవే అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్లుగా ఉంది. హైదరాబాద్ లో తెలంగాణ వారితో పాటుగా ఉత్తరభారతీయులు మాత్రమే కాదు దక్షిణ భారతంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా లక్షల సంఖ్యలో ఉన్నారు. వారంతా కూడా హైదరాబాద్ ను దేశ రెండో రాజధానిగా చేయడాన్ని ఇష్టపడే అవకాశం ఉంది. దాని కంటే ముఖ్యమైన అంశం మరొకటి కూడా ఉంది. ప్రజల్లో పోలరైజేషన్ చేయడం బీజేపీ వ్యూహంగా ఉంటోంది. అందుకు అనువైన పరిస్థితులు కూడా హైదరాబాద్ లో ఉన్నాయి. ఇక ఢిల్లీకి పాకిస్థాన్ తో పొంచిఉన్న ముప్పును పరిగణనలోకి తీసుకున్నా కూడా హైదరాబాద్ లో రక్షణ శాఖ మరో ప్రధాన కార్యాలయం ఉండడం తప్పనిసరి అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. హైదరాబాద్ లో ఇప్పటికే రక్షణ శాఖకు సంబంధించిన కార్యాలయాలు అనేకం ఉన్నాయి. పొరుగుదేశాలతో యుద్ధం జరిగితే ఢిల్లీలో ఏం జరిగినా కూడా మరో కమాండ్ కంట్రోల్ గా హైదరాబాద్ పనికొస్తుంది. ఇలా ఎన్నో రకాల కారణాలతో బీజేపీ గానీ కేంద్రప్రభుత్వం గానీ దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్ ను చేసేందుకు ఇష్టపడే అవకాశం ఉంది.

హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధాని చేయాలని ప్రజలు కోరుకుంటున్నారా అనే విషయాన్ని గురించి కూడా ఆలోచించాలి. ఇప్పటి వరకూ ప్రజల వైపు నుంచి ఆ డిమాండ్ వచ్చిన దాఖలాలు ఏవీ లేవు. పైగా రాష్ట్ర విభజన సమయంలోనే తెలంగాణ ప్రజానీకం ఈ డిమాండ్ ను తీవ్రంగా వ్యతిరేకించింది. దేశ రెండో రాజధాని అంశం సాధారణమైందేమీ కాదు. కొంత ప్రాంతాన్ని పూర్తిగా కేంద్రానికి అప్పగించడం లేదంటే హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయడంతోనూ ముడిపడింది. మరి హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తారా అని ప్రశ్నించుకుంటే పార్టీకి ప్రయోజనం కలుగుతుందనుకుంటే ఏం చేసేందుకైనా బీజేపీ సిద్ధమే. ఆర్టికల్ 370ని రద్దు చేయడం అసంభవం అనుకుంటే గంటల వ్యవధిలో కేంద్రప్రభుత్వం దాన్ని రద్దు చేసేసింది. ఇప్పటి వరకూ మనం కేంద్రపాలిత ప్రాంతాలు రాష్ట్రాలు కావడమే చూశాం. రాష్ట్రాలు సైతం కేంద్రపాలిత ప్రాంతాలు కావడం మాత్రం బీజేపీ హయాంలోనే చూస్తున్నాం. ఇక బీజేపీ తలుచుకుంటే హైదరాబాద్ ను యూటీ చేయడమో లేదంటో కొన్ని ప్రతిపాదనలతో హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధానిగా ప్రకటించడమో అసాధ్యమేమీ కాదు. రాష్ట్ర ప్రభుత్వం సమ్మతి లేకుండానే సరిహద్దులు మార్చేందుకు ఏ ప్రాంతాన్నయినా కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 వీలు కల్పిస్తుంది. ఇక హఠాత్ నిర్ణయాలు తీసుకోవడం కూడా బీజేపీ కి కొత్తేమీ కాదు. పెద్ద నోట్ల రద్దు, సర్జికల్ దాడులు లాంటివి ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. అసాధ్యం అనుకున్న దాన్ని సాధించడం బీజేపీ కి అలవాటైపోయింది. రాజ్యసభలో బలం తగ్గినా కావాల్సిన బిల్లులు ఆమోదం పొందేలా చేసుకుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే రిస్క్ తీసుకోవడానికి కూడా అది సిద్ధంగా ఉంటుంది.

గతంలో ఎన్నడూ లేని విధంగా దేశ రెండో రాజధాని పై చర్చ జరుగుతోంది. ఉత్తర భారతం, దక్షిణ భారతం మధ్య కొంత అంతరం ఉంది. కేంద్రానికి సంబంధించి అధికారం అంతా ఢిల్లీలో కేంద్రీకృతం కావడం ఒక కారణం. కన్యాకుమారి నుంచి ఢిల్లీకి రైలులో వెళ్ళాలంటే రెండు రోజులు పడుతుంది. సుప్రీం కోర్టుకు చేరుతున్న కేసులు అధికమైపోతున్నాయి. చిన్న చిన్న పనులకు సైతం ప్రజలు ఢిల్లీ వెళ్ళాల్సిన అవసరం అధికమవుతోంది. అన్నిటికీ మించి దక్షిణ భారతం కూడా దేశంలో అంతర్భాగం అని చాటిచెప్పాలంటే దేశ రెండో రాజధాని దక్షిణాదిలో ఉండాలన్న భావన వ్యక్తమవుతోంది. దక్షిణాదిన మరెన్నో నగరాలుంటే హైదరాబాద్ పైనే అందరి దృష్టి ఎందుకు పడింది అనే ప్రశ్న కూడా వస్తుంది. ఇక్కడ కొంత రాజకీయం కూడా ఉంది. బీజేపీ పై అది ఉత్తరాది పార్టీ అనే ముద్ర కొంతవరకు ఉంది. బీజేపీ కర్నాటకలో మినహా దక్షిణాదిలో ఎక్కడా బలంగా లేదు. అది దక్షిణాదిలో బలపడాలంటే అందుకు ముఖద్వారం హైదరాబాద్. అక్కడ గనుక అది బలపడితే తెలంగాణలో పుంజుకోవడం కష్టం కాదు. ఇప్పటికే ఉత్తరతెలంగాణలో కొంతవరకు బీజేపీ పాగా వేసింది. హైదరాబాద్ గనుక దేశానికి రెండోరాజధాని అయితే తెలంగాణలో వేసుకున్న పునాదితో దక్షిణాదిన బీజేపీ విస్తరించే అవకాశం ఉంటుంది.

హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధానిగా చేయడాన్ని తెలంగాణ ప్రజానీకం ఎలా చూస్తుందన్నది అన్నిటికన్నా ముఖ్యమైన అంశం. సీఎం కేసీఆర్ విషయానికి వస్తే ఆ విషయంలో సీఎం కేసీఆర్ కు పెద్దగా వ్యతిరేకత లేదు. ఆయన సానుకూలంగానే ఉన్నారు. గత ఏడాది జనవరి లో జరిగిన ఓ సమావేశంలో కేసీఆర్ తన అభిప్రాయాన్ని స్పష్టంగా చేశారు. దేశానికి హైదరాబాద్ ను రెండో రాజధానిగా చేయడం మంచిదేనన్నారు. దాన్ని తాను స్వాగతిస్తా అని కూడా అన్నారు.

సమస్య ఏదైనా దాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో దిట్ట కేసీఆర్. రేపటి నాడు హైదరాబాద్ ను నిజంగా దేశానికి రెండో రాజధానిగా చేస్తే ఆ క్రెడిట్ ను సొంతం చేసుకోవడంలో బీజేపీ కన్నా కేసీఆరే ముందంజలో ఉంటారు. కాకపోతే దేశానికి రెండో రాజధాని అన్న భారాన్ని మోసేందుకు హైదరాబాద్ ఎంతవరకు సిద్ధంగా ఉందో కూడా ఆలోచించాలి. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో జనాభా అధికమైపోయింది. యావత్ తెలంగాణ జనాభాలో సుమారు మూడో వంతు ఒక్క హైదరాబాద్ నగరంలోనే ఉంటోంది. ఇప్పటికే మౌలిక వసతులు కరువై ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నగర రహదారుల గురించి చెప్పాల్సిన పని లేదు. వర్షం వస్తే ప్రయాణం భారంగా మారుతోంది. కొన్ని కోట్ల మందికి ప్రజా రవాణ వ్యవస్థను అందించే పరిస్థితి లేదు. అద్దె ఇళ్ళ కొరత పెరుగుతుంది. మురికివాడలు అధికమైపోతాయి. ఒక్కముక్కలో చెప్పాలంటే రెండో రాజధాని పేరిట ఒక్కసారిగా వచ్చిపడే కృత్రిమ హఠాత్ అభివృద్ధిని తట్టుకునే పరిస్థితిలో హైదరాబాద్ నగరం లేదు. ప్రపంచంలో ఎన్నో దేశాలకు రెండో రాజధాని ఉంది. కాకపోతే అలాంటి రాజధాని కిక్కిరిసిన ప్రాంతాలకు దూరంగా ఉంటుంది. ఏమైతేనేం ఇప్పుడు తెరపైకి వచ్చింది ఒక వదంతి కావచ్చు లేదంటే ఒక ఫీలర్ కావచ్చు. ఒక స్పష్టత వస్తేనే మరింత సమగ్రంగా చర్చించేందుకు అవకాశం ఉంటుంది. హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధానిగా చేయడం తప్పనిసరైతే అందుకు హైదరాబాద్ ను ముందుగా సన్నద్ధం చేయాల్సి ఉంటుంది. ఆ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి అండగా కేంద్రం భారీగా నిధులు సమకూర్చాలి. దేశానికి రెండో రాజధానిగా ప్రకటించడాని కన్నా ముందుగానే అందుకు కావాల్సిన రీతిలో హైదరాబాద్ ను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది.

Full View  

Tags:    

Similar News