ఇంద్ర వర్సెస్ సోయం..సభావేదికగా ప్రత్యక్ష సమరం

Update: 2019-10-17 06:25 GMT

పరోక్షంగానే వాళ్లు మాటల ఈటెలు విసురుకుంటారు. మీడియా మైక్‌ల ముందర, విమర్శనాస్త్రాలు సంధించుకుంటారు. ఎదురుపడితే, ఇక కొట్టుకోవడం ఖాయమన్నట్టుగా ఒకరికపై మరొకరు రుసరుసలాడుతుంటారు. మరి నిజంగా ఎదురుపడితే, ఒకే వేదికపై ముఖ్య అతిథులుగా ఆసీనులైతే...? నిజంగా ఒకే స్టేజీపై వారిద్దరూ వాలిపోయారు. అందుకే వేదిక యుద్ధ వేదిక అయినట్టనిపించింది.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ వర్సెస్‌ టిఆర్ఎస్‌ పోరు తారాస్థాయికి చేరింది. అధికారిక కార్యక్రమాలలో సైతం ఒకరిపై ఒకరు విమర్శల జడివాన కురిపించుకుంటున్నారు. కుమ్రంభీమ్ వర్థంతి సభ తాజాగా ఇందుకు వేదికైంది. కుమ్రంభీమ్ వర్ధంతి కార్యక్రమానికి, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇదే వేదికపై ఉన్న ఎంపీ సోయం బాపురావు, తెలంగాణ సర్కార్‌పై విమర్శల వర్షం కురిపించడంతో, వేదిక వేడెక్కింది. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని‌ డిమాండ్ చేశారు. దీనిపై సుప్రీం ఇచ్చిన నోటిసుకు సమాధానం ఇవ్వాలని, దీనికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చొరవ చూపాలన్నారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని మంత్రిని ప్రశ్నించారు. ప్రతిరోజు అటవీ అధికారులు అనేక విధాలుగా వేధిస్తున్నా, అటవీ మంత్రిగా ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని మంత్రి ఎదుటనే విమర్శనాస్త్రాలను సంధించారు. మినిస్టర్‌ సమక్షంలోనే సీఎంపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించడంతో, సభప్రాంగణం హాట్‌హాట్‌గా మారింది.

బిజెపి ఎంపీ సోయం బాపురావు కేసీఆర్‌ ప్రభుత్వంపై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డంతో, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇరకాటంలో‌ పడ్డారు. దాంతో బిజెపి సర్కార్‌పై, ఇంద్రకరణ్‌ కూడా చెలరేగిపోయారు. కేంద్రానికి పన్నుల రూపంలో రెండు లక్షల కోట్ల రుపాయలు ఇస్తున్నా, తిరిగి వాటిలో ముప్పై వేల కోట్లకు ‌మించి ఇవ్వడంలేదని సోయంబాపురావు సమక్షంలో ఎదురుదాడి చేశారు. దమ్ముంటే ఆ డబ్బులు ఇప్పించాలని సోయంకు సవాల్ విసిరారు ఇంద్రకరణ్‌ రెడ్డి. అనవసరంగా ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడవద్దని ఎంపికి సూచించారు మంత్రి.‌

మొత్తానికి కుమ్రంభీమ్ వర్ధంతి సభ సాక్షిగా, అటు బీజేపీ ఎంపీ, ఇటు టీఆర్ఎస్‌ మంత్రికి మాటల యుద్ధం సాగింది. పార్లమెంట్‌ ఎన్నికల నాటి నుంచే ఇద్దరి మధ్యా కోల్డ్‌వార్‌ సాగుతోంది. ప్రోటోకాల్‌ విషయంలో, సోయంబాపు రావు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇలా ఇంద్రకరణ్‌, సోయంల మధ్య మొన్నటి వరకూ పరోక్షంగా సాగిన పొలిటికల్ వార్, సభా వేదిక సాక్షిగా ప్రత్యక్ష సమరంగా మారింది.

అయితే, ఎంపిపై దూకుడుగా మంత్రి విమర్శలు చేయలేదని, టీఆర్ఎస్‌లోని ఒకవర్గం అప్పుడే కత్తులు నూరుతోంది. ఆదివాసీలు డిమాండ్ చేస్తున్నా లంబాడాలను ఎస్టీ జాబితా తొలగింపుపై మంత్రి స్పందించకపోవడంపై, ఆదివాసీ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. మొత్తానికి అధికార కార్యక్రమాలు బలాన్ని పెంచుకోవడానికి వేదికలు అవుతున్నాయి. ఇది భవిష్యత్తులో మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో రెండు పార్టీలు పట్టు బిగించడానికి‌ ప్రయత్నిస్తుస్తూ, పకడ్బందీగా వ్యూహాలు రచిస్తున్నాయి. అధికారిక కార్యక్రమాల వేదికల్లో, మాటల యుద్దం చేస్తూ, భావోద్వేగాలను మరింత మండించే ప్రయత్నం చేస్తున్నాయి.

Full View

Tags:    

Similar News