హైదరాబాద్‌లో నేటి నుంచి ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్
*స్టాప్‌లైన్, సిగ్నల్ దగ్గర లైన్ దాటితే రూ.100 ఫైన్
Hyderabad: భాగ్యనగరంలో ట్రాఫిక్ నానాటికి భారీగా పెరిగిపోతుంది. ట్రాఫిక్‌ను కంట్రోల్ చేసేందుకు పోలీసులు హెచ్చరికలు జారీ చేసినా ఎలాంటి మార్పు కనిపించడం లేదు. దీంతో ఇవాళ్టి నుంచి ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్‌ను నిర్వహించబోతున్నారు. దీనికి ట్రాఫిక్ పోలీసులు పెట్టుకున్న పేరు ఆపరేషన్ రోప్. అక్రమంగా ఆక్రమించుకున్న పార్కింగ్ ప్రదేశాలను తొలగించడం కోసం ఈ ఆపరేషన్ చేపడుతున్నారు. ఫుట్‌పాత్‌పై ఉన్న ఆక్రమణలపై కేసులు నమోదు చేస్తున్నారు.
అంతేకాదు, సిగ్నల్స్ వద్ద స్టాప్‌లైన్ గీత దాటితే వంద రూపాయల జరిమానా విధిస్తున్నారు. ఫ్రీ లెప్ట్‌ను బ్లాక్ చేసినవారికి భారీగా జరిమానాలు పడనున్నాయి. ఫ్రీలెప్ట్‌ను బ్లాక్ చేసిన వాహనాలకు 1000 జరిమానా విధించనున్నారు. అదేవిధంగా రాంగ్ పార్కింగ్ చేస్తే నాలుగు చక్రాల వాహనాలకు 600 జరిమానాతో పాటు మరో వంద కూడా జరిమానాగా విధించనున్నారు. అంటే మొత్తం రూ. 700 జరిమానా కట్టాలి. ట్రాఫిక్ సజావుగా సాగేందుకు ఉచిత క్యారేజీ మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఫుట్‌పాత్‌లను అక్రమంగా ఆక్రమించుకున్న వివిధ సంస్థలకు చెందిన యజమానులకు స్వచ్చందంగా ఖాళీ చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.