పేను కొరుకుడు, చేతి కొరుకుడు, పీక కొరుకుడు గురించి వినుంటారు కానీ, మీరు ఎప్పుడైనా ముక్కు కొరుకుడు గురించి విన్నారా? అస్సలు వినే ఉండరు ఎందుకంటే, ఇది ఇప్పుడిప్పుడే ఫ్యామస్ అవుతోంది, అయితే, ఇదేదో పేను కొరుకుడులాగా, కరోనా మాదిరిగా కొత్త వైరస్ అనుకోకండి కానీ, ఇది మనుషులకు సంబంధించినదే తెలంగాణలో తెగ వైరల్ అవుతోన్న ఈ ముక్కు కొరుకుడు ఏంటో మీరే చూడండి.
సాధారణంగా ఎవరికైనా కోపమొస్తే ఏం చేస్తారు? తన చేతిలో వస్తువులను నేలకొసి కొడతారు లేదా అందుబాటులో ఉన్న వస్తువుపై తన ప్రతాపాన్ని చూపిస్తారు, అంతకీ కోపం తీరకపోతే ఇంట్లో చేతికందని ప్రతి వస్తువునీ పగలగొడతారు, అదే, ప్రత్యర్ధులపై పట్టలేనంత కోపమొస్తే, చేతులతో గుద్దుతారు, లేదా కాళ్లతో తన్నుతారు కొందరైతే తమ కసి తీర్చుకోవడానికి కాళ్లూ చేతులపై కొరుకుతారు, లేదంటే చెవి కొరుకుతారు కానీ, మీరెప్పుడైనా ముక్కు కొరకడం చూశారా?
అయితే, కొందరు తమ కోపాన్ని తీర్చుకోవడానికి రాక్షసులుగా మారిపోతున్నారు. మనుషులమనే సంగతి మర్చిపోయి జంతువుల్లా ప్రవర్తిస్తున్నారు. తమ కసి తీర్చుకోవడానికి ఎక్కడబడితే అక్కడ కొరికేస్తున్నారు. ఏది దొరికితే దాన్ని కొరికిపడేస్తున్నారు. చైనాలో ఇటీవల ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదన్న కోపంతో ఓ భర్త తన భార్య ముక్కు కొరికి కరకర నమిలి తినేశాడు. అయితే, ఇదంతా తన కోపాన్ని తీర్చుకోవడానికి అతను ఎంచుకున్న మార్గమిది. దాదాపు ఇలాంటి సంఘనలే ఇప్పుడు తెలంగాణలో జరిగాయి.
హైదరాబాద్‌లో ఇద్దరు ప్రాణమిత్రుల మధ్య చిన్న విషయంలో గొడవ జరిగింది. బల్కంపేటకు చెందిన వేణు బాపూనగర్‌కి చెందిన రమేష్ ఇద్దరూ స్నేహితులు అయితే, రమేష్ ఆర్ధిక ఇబ్బందులతో తన ద్విచక్ర వాహనాన్ని తాకట్టు పెట్టి డబ్బు తెచ్చుకున్నాడు. అయితే, ఆ వాహనాన్ని విడిపిస్తానంటూ వేణు ముందుకొచ్చాడు. కానీ, ఆ తర్వాత విడిపించేందుకు ససేమిరా అనడంతో తీవ్ర కోపోద్రిక్తుడైన రమేష్ ప్రాణస్నేహితుడని కూడా చూడకూండా వేణు ముక్కును కసితీరా కొరికేశాడు. దాంతో, వేణు ముక్కు కండ చాలా వరకు ఊడిపోయింది. దాదాపు 50శాతం ముక్కును కొరికేయడంతో వేణుకి తీవ్ర రక్తస్రావమైంది.
ఇలాంటి ఘటనే నిజామాబాద్ జిల్లాలో జరిగింది. మున్సిపల్ ఎన్నికల ఓటింగ్ సందర్భంగా బోధన్‌లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్ధుల మధ్య ఘర్షణ జరిగింది. అయితే, తీవ్ర ఆగ్రహావేశాలకు గురైన కాంగ్రెస్ అభ్యర్ధి ఇలాయిస్ టీఆర్ఎస్ అభ్యర్ధి ఇమ్రాన్ ముక్కు కొరికేశాడు. కసితీరా ముక్కు కొరడంతో దాదాపు 30శాతం ముక్కును కోల్పోయాడు ఇమ్రాన్.