Huzurabad: బాద్‌షాపై జోరుగా బెట్టింగ్‌లు.. బెట్టింగ్‌లో కొత్త రికార్డు బ్రేక్..
Huzurabad: సర్వే సంస్థలకు ధీటుగా హుజురాబాద్ లో బెట్టింగ్ రాయుళ్లు సర్వేలు చేశారు.
Huzurabad: సర్వే సంస్థలకు ధీటుగా హుజురాబాద్ లో బెట్టింగ్ రాయుళ్లు సర్వేలు చేశారు. విన్నింగ్ క్యాండిడేట్ ఎవరో ముందే పసిగట్టి బెట్టింగ్ షురూ చేశారు. దేశంలో ఎక్కడ పోలింగ్ జరిగినా వాలిపోయే బెట్టింగ్ బంగార్రాజులు ఇప్పుడు హుజురాబాద్‌ను వేదికగా చేసుకుని కోట్లాది రూపాయలు చేతులు మారుస్తున్నారు. హుజురాబాద్ తుది ఫలితం వెలువడేందుకు కేవలం కొద్ది సమయం మాత్రమే ఉండడంతో ఇప్పుడు అక్కడ కోట్లాది రూపాయలు చేతులు మారుతుండడంపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం
బెట్టింగ్‌కు కాదేది అనర్హం అనే రీతిలో మారిపోయారు పందెం రాయుళ్లు. మొన్నటి వరకు ఐపీఎల్‌పైన కోట్లలో బెట్టింగులు జరగగా ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ మీద కోట్లలో బెట్టింగులు జరుగుతున్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన హుజురాబాద్ ఎన్నికలపై బెట్టింగ్ రాయుళ్ల దృష్టి పడింది. ఈ ఎన్నికలను ప్రధాన పార్టీలు సీరియస్‌గా తీసుకోవడంతో పోటీ టగ్ ఆఫ్ వార్‌గా మారింది. దీంతో హుజురాబాద్ కా బాద్ షా పై కోట్లలో బెట్టింగులు నడుస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్‌లోనే కాక తెలుగు రాష్ట్రాల్లో ఈ ఎన్నికలు హాట్ టాపిక్ గా మారాయి. గత నాలుగైదు నెలల నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా హుజురాబాద్ ఉపఎన్నిక గురించి ఎక్కువగా చర్చ నడుస్తోంది. దీంతో ఇప్పుడు బెట్టింగ్ రాయుళ్లు హుజురాబాద్‌లో మకాం వేశారు. తమ అభ్యర్ధే గెలుస్తాడంటూ కోట్లలో బెట్టింగులకు పాల్పడుతున్నారు.
ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి పార్టీ సమావేశాలు, ప్రచారాలు జరుగుతున్న సమయంలో ప్రజల స్పందనను పసిగట్టి క్లీన్ అబ్జర్వేషన్ చేశారట పందెం రాయుళ్లు. ఇక సర్వే సంస్థలను మించిపోయి సొంతంగా ప్రజల నాడి పసిగట్టేందుకు సర్వేలు షురూ చేశారు. దీంతో అభ్యర్ధుల విజయావకాశాలను పక్కాగా ఎనాలసిస్ చేసి కోట్లలో బెట్టింగులకు పాల్పడుతున్నారట.
ఎన్నికలపై బెట్టింగులను కొంతమంది పందెం రాయుళ్లు ప్రొఫెషనల్‌గా మార్చుకున్నారు. ఎన్నికల ఫలితాలకు తమ బెట్టింగ్ మెనూలో చోటు కల్పించారు. ఏ రౌండ్‌లో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయి అనే అంశం నుంచి విన్నింగ్ క్యాండిడేట్ ఎంత మెజార్టీతో గెలుస్తారు అనే అంశాలపై వేల నుంచి కోట్లలో బెట్టింగులకు పాల్పడుతున్నారు. క్రికెట్ బెట్టింగ్‌లను సైతం తలదన్నేలా జరుగుతున్న హుజురాబాద్ ఉపఎన్నికల పందేలపై కోట్లలో చేతులు మారుతున్నాయి. ఇక హుజురాబాద్ ఉపఎన్నికల బెట్టింగ్‌లలో స్థానికులకంటే స్థానికేతరులే ఎక్కువగా ఉత్సాహం చూపిస్తున్నారట. హుజురాబాద్ ఉపఎన్నికలు బెట్టింగ్‌లో కొత్త రికార్డు బ్రేక్ చేస్తుందనే ప్రచారం జరుగుతోంది.