ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణపై నేడు హైకోర్టులో విచారణ
*ఈ నెల 28న విగ్రహావిష్కరణకు నిర్వాహకుల ఏర్పాట్లు
Khammam NTR Statue: ఖమ్మం ఎన్టీఆర్ విగ్రహావిష్కరణపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఎన్టీఆర్ విగ్రహం కృష్ణుడి రూపంలో ఉండటంపై... హిందూ,యాదవ సంఘాల అభ్యంతరం తెలిపాయి. కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టొద్దని హిందూ, యాదవ సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి. దీంతో హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
విగ్రహానికి మార్పులు చేసి ఆవిష్కరించేందుకు ఇప్పటికే నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 28న జూనియర్ ఎన్టీఆర్ చేతులమీదుగావిగ్రహావిష్కరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే మార్పులు చేసినా అంగీకరించేది లేదని యాదవ సంఘాలు అంటున్నాయి.
ఎన్టీఆర్ విగ్రహాన్ని శ్రీ కృష్ణుడి రూపంలో ఏర్పాటు చేయడం వల్ల భావి తరాలు ఎన్టీఆరే శ్రీ కృష్ణుడు అని భావించే అవకాశం ఉందని, దానిని తక్షణం ఆపేయాలని యాదవ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇస్కాన్ సైతం యాదవ సంఘాలకు మద్దతుగా నిలిచింది. అయితే తాము దానవీర శూర కర్ణ సినిమాలో శ్రీ కృష్ణుడి పాత్రదారిగా నటించిన ఎన్టీఆర్ ఫొటో ఆధారంగానే విగ్రహం తయారు చేయించామని, చాలా చోట్ల ఎన్టీఆర్ విగ్రహాలు ఇలానే ఉన్నాయని నిర్వాహకులు ప్రతినిధులు చెబుతున్నారు. ఈ ఒక్క విగ్రహం విషయంలోనే రాద్ధాంతం తగదంటున్నారు.
ఎన్టీఆర్ విగ్రహాన్ని శ్రీ కృష్ణుడి రూపంలో ఏర్పాటు చేసే ప్రయత్నాలను ఆపాలని కోరుతూ హైకోర్టులో 16 పిటిషన్లు దాఖలయ్యాయి. ఇస్కాన్, కరాటే కల్యాణి నేతృత్వంలోని ఆదిభట్ట కళాపీఠం,యాదవ సంఘాలు ఈ పిటిషన్లు దాఖలు చేశాయి. స్వల్ప మార్పులు చేస్తూ దానినే ప్రతిష్టించేందుకు నిర్వాహకులు రెడీ అవుతుండగా యాదవ సంఘాలు మాత్రం అడ్డుకొని తీరుతామంటున్నాయి. హైకోర్టు తీర్పును బట్టి విగ్రహావిష్కరణ ఉంటుందో ఉండదో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.