ఆర్టీసీ సమ్మె.. చర్చనీయాంశంగా మారిన ఇద్దరు మంత్రుల మౌనం

Update: 2019-10-15 05:09 GMT

ఆర్టీసీ సమ్మె రోజురోజుకీ ఉధృతమవుతోంది. కార్మికుల ఆత్మహత్యలతో అలజడి రేగుతోంది. ప్రభుత్వం కూడా అంతే పట్టుదలతో వ్యవహరిస్తోంది. మంత్రులు సైతం ఆర్టీసీ నేతలు, విపక్షాలపై విరుచుకుపడుతున్నారు. అయితే, మంత్రులందరూ నోరు విప్పుతున్నా ఇద్దరు ముగ్గురు మాత్రం మౌనం వహించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరు? ఎందుకు నోరు విప్పడం లేదు?

ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్రరూపం దాల్చడంతో కేసీఆర్ ప్రభుత్వంపై ముప్పేట దాడి జరుగుతోంది. ఆర్టీసీ కార్మిక సంఘాలతోపాటు విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కార్మికుల ఆవేదనతోపాటు విపక్షాల ఆరోపణలు బలంగా ప్రజల్లోకి వెళ్తుండటంతో ప్రభుత్వం కౌంటర్ కూడా మొదలుపెట్టింది. కేసీఆర్ ఆదేశాలతో పలువురు మంత్రులు ఎదురుదాడి చేస్తున్నారు. కార్మికుల జోలికి పోకుండా, సంఘాల నేతలు, విపక్షాలపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అయితే, కేబినెట్‌లో కేటీఆర్‌తోపాటు మరో ఇద్దరికి మినహా మిగిలిన మంత్రులందరికీ ఏం మాట్లాడాలనే దానిపై ప్రగతిభవన్ నుంచి ఫోన్లు వెళ్లాయట. ముఖ్యంగా కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉండటం పైగా ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కావడంతో ఆయన్ను నోరు విప్పొద్దని పార్టీ పెద్దలు వారించినట్లు తెలుస్తోంది. ఇక మంత్రి సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్‌ నుంచి రావడంతో సమ్మెపై మాట్లాడితే విమర్శలు వస్తాయని వద్దన్నట్లు తెలిసింది. ఇలాంటి కారణంతోనే మంత్రి మల్లారెడ్డిని కూడా వద్దని చెప్పారట. వీళ్లు కాకుండా, మిగతా మంత్రుల్లో పలువురు మీడియా ముందుకొచ్చి రెండ్రోజులుగా ఆర్టీసీ సమ్మెపై, విపక్షాలపై ఎదురుదాడి చేస్తున్నారు.

అయితే, మంత్రులందరూ స్పందిస్తున్నా, ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన హరీష్‌రావు, ఈటల రాజేందర్ నోరు విప్పకపోవడం చర్చనీయాంశంగా మారింది. హరీష్‌ యూనియన్ ఆవిర్భావం నుంచి గౌరవ అధ్యక్షులుగా ఉండటంతో ఆయన స్పందించాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే, హరీష్‌రావు, ఈటల రాజేందర్‌లు ప్రభుత్వ తీరుపై అసంతృప్తిగా ఉన్నారనే మాట వినిపిస్తోంది. అందుకే, ఈ ఇద్దరు మంత్రులూ ఆర్టీసీ సమ్మెపై మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నారని సన్నిహితులు చెబుతున్నారు.

Full View 

Tags:    

Similar News