కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు బంధు పథకం ఆ ప్రభుత్వానికి గుది బండగా మారుతోందా? అందుకే ఇకపై సీజన్ ల వారీ చెల్లింపులకు స్వస్తి చెప్పి ఏడాది పొడవునా సాయమందేలా కొత్త ప్లాన్ తయారు చేసారా? రైతుబంధులో వచ్చే మార్పులేంటి?
తెలంగాణ ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన రైతుబంధు పథకం ముందస్తు ఎన్నికల్లో విజయం సాధించడానికి కేసీఆర్ కు బాగా ఉపయోగపడింది. అయితే ఈ పథకంలో కొన్ని మార్పులు చేయాలని ఎప్పటినుంచో సూచిస్తున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించడం లేదని అధికారులు అంటున్నారు. అయితే ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ఈ పథకానికి నిధులు కేటాయించడం చాలా కష్టమవుతోంది.
రైతుబంధు పథకం ఒక్క దఫా చెల్లింపుకు దాదాపు ఏడు వేల కోట్లు ఖర్చు అవుతుంది. అంటే ఏడాదికి సుమారు 14 వేల కోట్లు. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో ఒకే దఫా ఏడు వేల కోట్లు చెల్లించడం చాలా కష్టమవుతోంది. ఈ నేపథ్యంలో రైతుబంధు చెల్లింపులో కొత్త పద్ధతిని అమలు చేయాలని నిర్ణయించారని తెలిసింది. ఇప్పటివరకు రైతులందరికీ గంప గుత్తగా ఒకే సారి భూమి విస్తీర్ణాన్ని బట్టి అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు. అయితే రైతు బంధు పథకం అమలు తీరులో ప్రభుత్వంలో అనధికారిక నిబంధనలు పాటించేందుకు సిద్దమైనట్టు తెలుస్తోంది. ముందుగా చిన్న రైతులకు ఆ తరువాత మిగతా వారికి ఏడాది పొడువునా రైతు సాయం అందేలా కొత్త పద్దతి అమలు చేయబోతున్నారు. ఆర్థిక వెసులు బాట మేరకు విడతల వారిగా రైతు బంధు సాయం ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
గత ఏడాది రైతు బంధు కింద ఖరీప్ కాలానికి ఖరీప్ లోనే, రబీ కాలానికి చెందిన డబ్బులు రబీ కాలంలో వేసారు. కాని రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారిపోయింది. ఖరీప్ ,రబీ కాలాలు మారిపోతున్నా రైతులకు ఇంత వరకు రైతు బంధు సాయం ఇవ్వలేదు తాజా ప్రతిపాదనతో ఏడాది పొడవునా రైతుబంధు సాయం ఇచ్చే అవకాశం ఉందని ఓ సీనియర్ అధికారి చెప్తున్నారు. ముందుగా మూడు ఎకరాల లోపు ఉన్న రైతులకు
ఆ తరువాత ఐదు ఎకరాల లోపు ఉన్న వారికి డబ్బు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. పది ఎకరాల లోపు, ఆపైన ఎక్కువ ఎకరాలున్న వారికి నెమ్మదిగా ఇవ్వాలని నిర్ణయించారు. దీని ప్రకారమే రబీ దాటిపోయినా వానాకాలం పంట సాయం అందించారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో కాలల వారీగా కాకుండా విడతల వారిగా రైతు బంధు డబ్బులు విడుదల చేయనున్నట్టు అధికార వర్గాలు చెపుతున్నాయి.
ఈ ఏడాది మొదటి విడత రైతుబంధు చెల్లింపులు ఇంకా కొనసాగుతున్నాయి. వీటిని ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. తర్వాత రైతుబంధు రెండో దఫా నిధులు విడుదల చేయనున్నారు. జీఎస్టీ పరిహారం కింద తాజాగా కేంద్రం 1036 కోట్లు విడుదల చేసింది. అందులో నుంచి వెయ్యి కోట్లను రైతు బంధు కు కేటాయించే అవకాశం ఉందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. నిధులు సమకూరగానే రైతు బంధుకు మరి కొన్ని డబ్బులు విడుదల చేస్తామని అన్నారు. దీనికి తోడు లిక్కర్ రేట్లు పెంచడం వల్ల ప్రతి నెల రాష్ట్ర ఖజానాకు వచ్చే 400 కోట్లు అదనపు ఆదాయాన్ని నేరుగా రైతు బంధుకు మళ్లించే అవకాశం ఉందని అంటున్నారు. రబీ కాలానికి రైతు బంధు సొమ్ముపై వ్యవసాయ శాఖ వచ్చేవారం బ్యాంకర్లతో సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. రైతు బంధు డబ్బులను ఇతర అప్పుల జమ చేయొద్దని ప్రభుత్వం బ్యాంకులను కోరనుంది.