తెలంగాణ ఉద్యమంలో ఆయన ఉరకలెత్తారు. గులాబీ రథసారథికి అడుగడుగునా అండగా నిలిచారు. కేసీఆర్‌కు నమ్మినబంటుగా, కేసీఆర్ మనిషిగా టీఆర్ఎస్‌లో పేరు తెచ్చుకున్నారు. ఎంపీగానూ ఢిల్లీలో చక్రంతిప్పారు. కానీ వన్ ఫైన్ మార్నింగ్ ఆయన ఎంపీగా ఓడిపోయారు. ఇప్పుడేం చేయాలో దిక్కుతోచడం లేదని ఆయనపై, సొంత పార్టీ నేతలే మాట్లాడుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఆయన గురించి వినిపిస్తున్న ఒక విషయం, నిజంగా ఆయన కిక్కిస్తోంది. నిజంగా ఆ గుడ్ న్యూస్ నిజమైతే బాగుండన్న ఆశా కలుగుతోందట. ఇంతకీ ఆయనెవరు ఆయనకు సంబంధించి గుడ్ న్యూస్ ఏంటి నిజంగా చర్చ జరుగుతోందా...గాలి మాటలేనా?
బి.వినోద్ కుమార్. కరీంనగర్ మాజీ ఎంపీ. కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌తో కలిసి అడుగులు వేసిన నాయకుడు. ఇప్పుడాయన పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయారు. మరి తన మనసెరిగిన వినోద్‌కుమార్‌కు, గులాబీ అధినేత త్వరలో గుడ్ న్యూస్ చెప్పబోతున్నారన్న చర్చ నిజమేనా?
తెలంగాణ రాష్ట్ర సమితిలో అత్యంత సీనియర్ నాయకుడు బి.వినోద్ కుమార్. లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ చేతిలో ఓడిపోయారు. కేసీఆర్‌కు అత్యంత దగ్గరి మనిషిగా పేరు తెచ్చుకున్న వినోద్ కుమార్ గురించి ఒక ఆసక్తికరమైన విషయం, రాజకీయవర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే, మంత్రివర్గంలోకి వినోద్. ఔను. వినోద్‌ను కేబినెట్‌లోకి తీసుకోవాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు తెలంగాణ భవన్‌లో చర్చ జరుగుతోంది. తెలంగాణ ఉద్యమం నుంచి తనకు తోడునీడగా ఉన్న వినోద్‌ను మంత్రివర్గంలోకి తీసుకుంటే ఎలా ఉంటుందని తలపోస్తున్నారట కేసీఆర్. ఎంపీగా ఓడిపోయిన వినోద్‌కు ఎమ్మెల్సీ ఇచ్చి, మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం కేసీఆర్ తలపోస్తున్నట్టు టీఆర్ఎస్ కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారట.
వినోద్‌ను మంత్రివర్గంలోకి తీసుకుంటే పలు అంశాల్లో కలిసి వస్తుందన్న ఉద్దేశంలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సీనియర్ నాయకుడు అయినందున, పాలనలో ప్రయోజనకరంగా ఉంటుందని, బలమైన నాయకుడి మాటకు విలువ ఉంటుందన్న ఉద్దేశంతో వినోద్ పేరును తెర మీదకు తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
వినోద్ పేరు తెరపైకి రావడం వెనక సామాజిక సమీకరణలు కూడా వినిపిస్తున్నాయి. వినోద్ వెలమ. అంటే కేసీఆర్ సామాజికవర్గం. ఇప్పటికే ఇద్దరు బలమైన వెలమ ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు కల్పించలేదు కేసీఆర్. ఒకరికి పార్టీ బాధ్యతలు అప్పగించగా, మరొకరికి కేబినెట్ బెర్త్ ఇస్తారన్న సిగ్నల్స్ కూడా రావడం లేదు. దీంతో అదే వెలమ సామాజికవర్గానికి చెందిన, కేసీఆర్‌తో పాటు వారికి సైతం వరుసకు బంధువైన వినోద్ కుమార్‌కు మంత్రివర్గంలో చోటు కల్పిస్తే, సామాజిక లెక్కలు కూడా సరిపోతాయన్న చర్చ జరుగుతోందని టీఆర్ఎస్ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.
మొత్తానికి కరీంనగర్ ఎంపీగా ఓడిపోయిన వినోద్ కుమార్ పట్ల, కేసీఆర్‌కు సానుభూతి ఉంది. తనతో పాటు ఉద్యమంలో పాల్గొనడం, గత ఐదేళ్లు ఢిల్లీలో ఉండి జాతీయ పార్టీలతో టీఆర్ఎస్ స్నేహానికి బాటలు వేశారన్న అభిప్రాయమూ ఉంది. మంత్రివర్గంలోనూ చోటు కల్పిస్తే, తనకు మరింత చేదోడువాదోడుగా ఉంటారని కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి అనేక సమీకరణల నేపథ్యంలో, వినోద్ కుమార్ పేరు వినిపిస్తోంది. రానున్న మంత్రివర్గ విస్తరణలో వినోద్‌కు చోటు పక్కాగా ఉంటుందని తెలంగాణ భవన్‌లో చర్చించుకుంటున్నారు. చూడాలి, అంతటా వినిపిస్తున్న, చర్చిస్తున్న వినోద్ కుమార్‌కు గుడ్‌న్యూస్ నిజమో, లేదంటే గాలివార్తో మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది.