ఏడున్నర గంటల పాటు సమావేశమయిన తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో పాటు పాలన వ్యవహారాల్లో తీసుకోవాల్సిన నిర్ణయాల కోసం పలు కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మంత్రులతో కూడిన ఈ కమిటీలు తమకు అప్పగించిన అంశాలపై సమగ్రమైన విశ్లేషణలతో కూడిన నివేదికలు అందజేయనున్నాయి.
అటు హుజూర్ నగర్ ఉప ఎన్నికలు ఇటు దసరా నవరాత్రుల సమయంలో ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్ వివాదాన్ని పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేసింది. మంత్రి వర్గ సమావేశంలో ఆర్టీసీ అంశంపై చర్చించిన సీఎంకేసీఆర్ కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కమిటీ వేశారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో సభ్యులుగా ముఖ్య కార్యదర్శులు రామకృష్ణారావు, సునీల్‌శర్మ ఉన్నారు. ఈ కమిటీ నేడు ఆర్టీసీ కార్మికులతో చర్చించనుంది. వీటితో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తగు సూచనలు చేసేందుకు, ఆయా శాఖల ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలను పరిశీలించేందుకు శాశ్వత ప్రాతిపదికన 8 మంత్రివర్గ ఉప సంఘాలను నియమించింది.
వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజెందర్ అధ్యక్షతన వైద్య, ఆరోగ్య కమిటి ఏర్పాటు చేశారు. ఇందులో సభ్యులుగా మంత్రులు కేటీఆర్‌తో పాటు ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస యాదవ్ ఉన్నారు. రాష్ట్రంలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, వివిధ సీజన్లలో వచ్చే అంటువ్యాధులు, ఇతరత్రా వ్యాధుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వ పరంగా చేయాల్సిన పనులను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధ్యక్షతన గ్రామీణ పారిశుధ్య కమిటి ఏర్పాటు చేశారు. ఇందులో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, పువ్వాడ అజయ్ సభ్యులుగా నియమించారు. ప్రస్తుతం అమలవుతున్న 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలునూ, భవిష్యత్తులో గ్రామాల్లో పారిశుధ్య పనులను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది.
మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అధ్యక్షతన పట్టణ పారిశుధ్య కమిటి ఏర్పాటు చేశారు. ఇందులో మంత్రులు టి.హరీశ్ రావు, శ్రీనివాస గౌడ్, తలసాని శ్రీనివాస యాదవ్, సబితా ఇంద్రారెడ్డి సభ్యులుగా ఉన్నారు. పట్టణాలను పరిశుభ్రంగా ఉంచేందుకు అమలు చేసే కార్యాచరణను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. ఇక ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆధ్వర్యంలో వనరుల సమీకరణ కమిటీని ఏర్పాటుచేశారు. ఇందులో సభ్యులుగా కేటీఆర్ , శ్రీనివాస గౌడ్‌లను ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర స్థాయిలో వనరులను సమీకరించుకోవడం, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టే అంశాలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది.
అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన పచ్చదనం కమిటిలో మంత్రులు కెటీఆర్, జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డిలు సభ్యులుగా ఉన్నారు. రాష్ట్రంలో పచ్చదనం పెంపు, అడవులు కాపాడడం, కలప స్మగ్లింగును అరికట్టే అంశాలను ఈ కమిటి పర్యవేక్షిస్తుంది. వీటితో పాటు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన మంత్రులు గంగుల కమలాకర్, జగదీశ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావులతో కలిపి వ్యవసాయ కమిటీలను ఏర్పాటు చేశారు. సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించడం, కల్తీలను నిరోధించడం, వ్యవసాయాభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలను అమలు చేయడం, విత్తనాలను, ఎరువులను సేకరించడానికి ఒక సమగ్ర విధానం రూపొందించడం తదితర కార్యక్రమాలను ఈ కమిటి పర్యవేక్షిస్తుంది. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పడంపై ఈ కమిటీ దృష్టి సారించనుంది.
పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అధ్యక్షతన పౌల్ట్రి కమిటి ని ఏర్పాటు చేశారు. ఇందులో మంత్రులు శ్రీనివాస గౌడ్, ఈటల రాజెందర్, నిరంజన్ రెడ్డి సభ్యులుగా ఉన్నారు. రాష్ట్రంలో పౌల్ట్రి పరిశ్రమను పటిష్ట పరచడానికి అవసరమైన పాలసీ రూపొందించనుంది. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధ్యక్షతన మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్ సభ్యులుగా సంక్షేమ కమిటిని ప్రభుత్వం నియమించింది. వివిధ వర్గాల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలను ఈ కమిటి పర్యవేక్షిస్తుంది.
ప్రభుత్వ పథకాలతో పాటు వివిధ కార్యక్రమాల అమలు తీరుపై చర్చించేందుకు సీఎం కేసీఆర్ ఈనెల 10న మంత్రులు, కలెక్టర్లతో సమావేశం కానున్నారు. గ్రామాల్లో ప్రస్తుతం అమలవుతున్న 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు తీరుపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశానికి డిపిఓలను, డిఎల్పివోలను కూడా ఆహ్వానించారు. గ్రామాల్లో పారిశుధ్యం కాపాడడానికి ఇప్పటి వరకు తీసుకున్న చర్యలతో పాటు, భవిష్యత్తులో చేయాల్సిన పనులపై ఈ సమావేశంలో చర్చిస్తారు.