హాట్ టాపిక్‌గా ఇద్దరు ఎంపీల కలయిక..డీఎస్, అర్వింద్ ఒకే వేదిక దేనికి సంకేతం?
కుటుంబం ఒక్కటే కానీ ఎంపీలు ఇద్దరు ఒకరు రాజ్యసభ సభ్యులైతే మరొకరు లోక్‌సభ వరుసకు తండ్రీ కొడుకులే కానీ ఒకరు అధికార పార్టీ ఎంపీ, మరొకరు కమలం పార్టీ. కొడుకు రాజకీయ రంగ ప్రవేశమే తండ్రి రాజకీయ జీవితాన్ని తలకిందులు చేసింది. చాలారోజుల తర్వాత ఆ ఇద్దరు ఒకే వేదికను పంచుకున్నారు. ఆ ఇద్దరి కలయిక ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. జిల్లా రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెరలేచిందా అన్న చర్చ జరుగుతోంది. ఇంతకీ ఎవరా ఎంపీలు ? ఏంటా స్టోరీ.
ధర్మపురి శ్రీనివాస్. నాడు కాంగ్రెస్ ఉద్దండ నేత...నేడు టీఆర్ఎస్ ఎంపీ. ధర్మపురి అరవింద్. డీఎస్ కుమారుడు బీజేపీ ఎంపీ. టెక్నికల్‌గా ఇద్దరూ ఇప్పుడు వేర్వేరు పార్టీలు. తెర వెనక ఇద్దరూ ఒక్కటేనన్నది బహిరంగ రహస్యం. మరి నిజంగానే ఇద్దరూ ఒకే వేదికపైకి రాబోతున్నారా? ఒకే పార్టీ కండువాతో ఇక తెరముందుకు వస్తారా?
దేశ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉన్న నేతగా ఎదిగి రాష్ట్ర రాజకీయాల్లో చక్రంతిప్పిన ధర్మపురి శ్రీనివాస్ ఫ్యామిలీ పాలిటిక్స్ ఆసక్తిగా మారాయి. టీఆర్ఎస్ నుంచి రాజ్యసభ సభ్యునిగా ఉన్న డీఎస్, కొంత కాలంగా సైలెంట్‌గా ఉన్నారు. ఆయన పెద్ద కుమారుడు ధర్మపురి సంజయ్ టీఆర్ఎస్‌లోనే ఉన్నా, యాక్టివ్‌గా లేరు. ఇక చిన్న కుమారుడు ధర్మపురి అర్వింద్, బీజేపీలో చేరి యువనేతగా ప్రత్యేక గుర్తింపు సాధించారు. కాషాయ దళంలో చేరిన సుమారు 24 నెలల్లోనే, నిజామాబాద్ ఎంపీగా గెలిచారు. ముఖ్యమంత్రి కూతురు కవితను ఓడించి బీజేపీలో స్పెషల్ అట్రాక్షన్‌గా మారారు. డీఎస్ టీఆర్ఎస్‌లో ఉండగానే, ఆయన చిన్న కుమారుడు బీజేపీలో చేరడంపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. అయినా అప్పుడూ డీఎస్ మౌనమే.
అర్వింద్ వల్లే, డీఎస్ టీఆర్ఎస్‌కు దూరమయ్యారనే టాక్ కూడా ఉంది. జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులంతా మూకుమ్మడిగా ధర్మపురి శ్రీనివాస్‌ను, పార్టీ నుంచి బయటకు పంపాలని తీర్మానం చేశారు. అప్పటి నుంచి ఆయన టీఆర్ఎస్‌కు అంటీముట్టనట్లు ఉంటున్నారు. అటు టీఆర్ఎస్ అధిష్ఠానం సైతం డీఎస్ వైఖరిపై అసంతృప్తితో ఉంది. జరిగిన పరిణామాలపై సీఎం కేసీఆర్‌కు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా, కేసీఆర్ ఆయనకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదనే ప్రచారం జరిగింది. దీంతో ఆయన స్వగృహ ప్రవేశం చేస్తారనే ప్రచారం జోరుగా సాగింది. ఆయన క్యాడర్ అంతా కాంగ్రెస్ గూటికి చేరడంతో ప్రచారానికి మరింత బలం చేకూరింది. ఐతే ఆయన కాంగ్రెస్ నేతలకు టచ్‌లోకి వెళ్లినా, వ్యూహాత్మకంగా టీఆర్ఎస్‌లోనే కొనసాగారు. టీఆర్ఎస్‌లో ఉండి, కొడుకు అర్వింద్ గెలుపు కోసం తెరవెనుక చక్రం తిప్పారని రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నిజామాబాద్ ఎంపీగా గెలిచిన అర్వింద్, రాజ్యసభ సభ్యుని హోదాలో ఉన్న డీఎస్‌లు చాలా కాలం తర్వాత ఒకే స్టేజీని పంచుకోవడంతో, జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ధర్మపురి అర్వింద్ బీజేపీలో చేరినప్పటి నుంచి ఆయన తండ్రితో కలిసి స్టేజీని పంచుకున్న సందర్భాలేవు. ఐతే అర్వింద్ ఎంపీ అయ్యాక రైతు సన్మాన కార్యక్రమంలో ఇద్దరూ ఒకే వేదికను కలిసి పంచుకోవడంతో జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత రాజకీయ పరిణామాలతో టీఆర్ఎస్ అధిష్టానం డీఎస్‌ను పార్టీ నుంచి బయటకు పంపే సాహసం చేసే పరిస్ధితి కనిపించడం లేదు. ఆయన కూడా తానంతట తానుగా రాజ్యసభ పదవికి రాజీనామా చేసే అవకాశం లేదు. ఫలితంగా ఆయన పార్టీలోనే ఉంటూ తనకు జరిగిన అవమానంపై అవకాశం దొరికినప్పుడల్లా, రివెంజ్ తీసుకుంటారని టాక్ నడుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం కృషి చేసిన డీఎస్, త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లోనూ, ఆ పార్టీకి మేలు చేసేలా చక్రం తిప్పుతారా అన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో బలమైన శక్తిగా ఎదగాలని భావిస్తున్న బీజేపీ, ఆ ప్రయత్నాల్లో భాగంగా డీఎస్‌ను కూడా పార్టీలో చేర్చుకుంటుందా అనే కొత్త టాక్ తెరపైకొచ్చింది. మారుతున్న రాజకీయ పరిణామాలతో, డీఎస్ ఫ్యామిలి పాలిటిక్స్ ఏ విధంగా టర్న్ అవుతాయన్నది పార్టీ శ్రేణుల్లో ఆసక్తి కలిగిస్తోంది.
శ్రీనివాస్ పార్టీ మారుతారా లేదా అన్నది పక్కన పెడితే, టీఆర్ఎస్‌లో మాత్రం యాక్టివ్‌గా ఉండరన్నది జగమెరిగిన సత్యం. ఆయన సైలెంట్‌గా ఉన్నా, టీఆర్ఎస్ గెలుపు కోసం ఏ మేరకు పనిచేస్తారన్నది అనుమానమే. రాజకీయ చక్రం తిప్పడంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న డీఎస్, మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు అమలు పరుస్తారన్నది సర్వత్రా ఉత్కంఠగా మారింది.