నిజామాబాద్ జిల్లాలో డేంజర్ ఆటోస్.. ఆటో మాటున అరాచకాలు
* నేరాలు చేసి ఆటోలను వదిలిపారిపోతున్న కేటుగాళ్లు * వీరి వల్ల నిజాయితీ కలిగిన ఆటో డ్రైవర్లకు అవమానాలు
Nizamabad: ఆ జిల్లాలో ఆటో ఎక్కాలంటే హడలెత్తిపోతున్నారు జనం. ఆటోవాలాల ముసుగులో.. కొందరు నేరాలకు పాల్పడుతుండటంతో ఆటో అంటేనే ప్రజలు బెంబేలెత్తేపోతున్నారు. ఆటో డ్రైవర్ ముసుగులో ఏ నరహంతకుడు ఉన్నాడో.. ఏ దొంగ కాచుకుని కూర్చున్నాడో తెలియని పరిస్థితి నెలకొంది. ఇటీవల సంచలనం సృష్టించిన కేసుల్లో ఆటోనే కేంద్ర బిందువుగా మారడంతో వామ్మో ఆటో అంటున్నారు. పోలీసులు సైతం ఆటోవాలాలపై నిఘా పెట్టారు.
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కొద్ది రోజులుగా జరుగుతున్న కొన్ని క్రైం సీన్స్ వెన్నులో వణుకుపుట్టించేలా ఉన్నాయి. ఒంటరిగా మహిళలు ఆటోలో ప్రయాణించాలంటే ఆలోచించాల్సిన పరిస్ధితి నెలకొంది. సారాంగాపూర్ కు చెందిన ఓ మహిళను ఆటోవాలాలు అపహరించి అత్యాచారం చేసి హతమార్చడం, ఓ యువతిని అపహరించే యత్నం చేయడం, ఆటోలో ఎక్కిన ఓ వృద్దుడుని శివారు ప్రాంతానికి తీసుకెళ్లి.. నిలుపుదోపిడి చేసిన కేసులో ఆటో కామన్ గా మారిపోయింది. ఆటో డ్రైవర్ అంటూ సమాజంలో పరిచయం చేసుకుంటూ నేరాలకు పాల్పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
ఆటో డ్రైవర్ల ముసుగులో నేర చరిత్ర ఉన్న వారు వరుస నేరాలకు పాల్పడుతుండటంతో నిజాయితీ కలిగిన ఆటో డ్రైవర్ లకి అవమానాలు ఎదురవుతున్నాయి. పొట్ట కూటి కోసం ఆటో నడుపుకునే తమకు ఇటువంటి ఘటనలతో ఇబ్బందులకు గురవుతున్నాయని పలువురు ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆటో డ్రైవర్ల ముసుగులో ఆటోవాలాలు గడిచన నాలుగేళ్లలో 99 నేరాలకు పాల్పడ్డట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 11 నేరాలు చేయడం పరిస్ధితి తీవ్రతకు అద్దం పడుతోంది. నేరాలకు పాల్పడే వాళ్లు.. స్థానికంగా ఆటోలను రోజువారిగా అద్దెకు తీసుకుంటున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. పథకం ప్రకారం ఆటోలో నేరాలకు పాల్పడి వాటిని వదిలిపోరిపోతున్నట్లు గుర్తించారు.