తెలంగాణ కమ్యూనిస్టు పార్టీల సారథులపై, వారి హైకమాండ్‌లు సీరియస్‌గా వున్నాయా...వరుసగా అన్ని ఎన్నికల్లోనూ ఓడిపోవడం, డిపాజిట్లు సైతం గల్లంతుకావడంతో, పార్టీ రాష్ట్ర కార్యదర్శులపై అధిష్టానాలు ఆగ్రహంగా వున్నాయా ఇలాగైతే కష్టమని హెచ్చరిక సంకేతాలు పంపాయా అసలు స్టేట్ లెఫ్ట్ పార్టీల్లో ఏం జరుగుతోంది? త్వరలో సంచలన నిర్ణయాలు తప్పవా?
పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తున్న వామపక్షాలు
మునిసిపల్ ఎన్నికలపై ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నాయి. గత శాసన సభ, లోక్ సభ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఏ విధంగా ముందుకు వెళ్లాలనే విషయంలో ఆ పార్టీలకు క్లారిటీ అంటూ లేకుండా పోయింది. దీంతో మున్సిపల్ ఎన్నికల్లోను సేమ్ సీనే రిపీట్ అయ్యే అవకాశాలే ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ఇద్దరు రాష్ట్ర కార్యదర్శులకు తమ పనితీరు మెరుగుపరుచుకోవాలని వారి జాతీయ నాయకత్వం సీరియస్ గా హెచ్చరికలు జారీ చేసిందట. మరికొన్ని రోజుల్లొ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండటంతో కనీసం ఈ ఎన్నికల్లో అయిన ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేయాలని రెండు పార్టీల కార్యదర్శులకు క్లాస్ తీసుకున్నారట. దీంతో మున్సిపల్ ఎన్నికలు సిపిఐ, సిపిఎంలకు కార్యదర్శులకు అగ్ని పరీక్షగా మారాయి.
తెలంగాణలో కార్మిక సంఘాలపై గట్టి పట్టున్న వామపక్షాలు ప్రజల నాడీ పట్టడంలో మాత్రం ఘోరంగా విఫలమవుతున్నాయి. పారిశుధ్య కార్మికుల నుంచి ఆర్టీసీ కార్మికుల వరకు ట్రేడ్ యూనియన్లు సీఐటియు, ఎఐటియుసీ సంఘాలు చాలా బలంగా ఉన్నాయి. ఏ ఉద్యమానికైనా వామపక్షాలకు చెందిన కార్మిక సంఘాలు ముందు వరుసలో ఉంటాయని చెప్పడంలో సందేహం లేదు.
ఆర్టీసీ కార్మికుల సమ్మెలో వామపక్షాలకు అనుబంధంగా ఉన్న కార్మిక సంఘాలు కీలకంగా వ్యవహరించాయి. అయితే గడిచిన ఎన్నికల్లో ఆ పార్టీల నుంచి చట్ట సభల్లో ప్రాతినిధ్యం లేకపోవటం రెండు పార్టీలను కలవరానికి గురి చేస్తుందట. అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికల్లో చేదు అనుభవాన్ని చవి చూసిన సిపిఐ , సిపిఎంలు మునిసిపల్ ఎన్నికల్లో బరిలో ఉండాలా వద్దా అన్న విషయంలో నిర్ణయం తీసుకోలేక సతమతమవుతున్నాయట.
ఇక ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాలో వామపక్ష పార్టీలకు గతంలో మంచి పట్టు ఉండేది. 2014 ఎన్నికల వరకు వామపక్షాల తరఫున అసెంబ్లీలో ప్రాతినిథ్యం ఉండేది. గెలిచిన ఒకరిద్దరు కూడా వేరే పార్టీ కండువా కప్పుకోవడంతో వామపక్షాలకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం కరువైంది. ప్రధాన కార్యదర్శులు, మరో ఒకరిద్దరు తప్ప చెప్పుకోదగ్గ నేతలు కూడా ఆ పార్టీల్లో లేకుండా పోయారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన లెఫ్ట్ పార్టీల కూటమి తరుఫున సీపీఎం ప్రజాకూటమి తరఫున సీపీఐ పోటీ చేసింది. ఒక్క సీటు కూడా వామపక్షాలు గెలవలేక చతికిలపడ్డాయి. హూజూర్‌నగర్ ఉప ఎన్నికల్లోనూ, గందరగోళంతో వ్యవహరించాయి.
ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడే సహజ స్వభావాన్ని వామపక్షాలు కోల్పోయాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో అనుబంధ కార్మిక సంఘాల మద్దతుతో ఉనికి కాపాడుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసినా, కాలానికి తగ్గట్టుగా మారకపోతే ప్రత్యక్ష ఎన్నికల్లోనూ ఒకటి రెండు స్థానాల్లో కూడా గెలిచే పరిస్థితులు కనిపించట్లేదని విశ్లేషకుల అభిప్రాయం. సీపీఐ, సీపీఎంలు విభేదాలు పక్కన పెట్టి తలోదారిన వెళ్లకుండా కలిసి పని చేయాలని వారు కోరుతున్నారు. తెలంగాణలో బలంగా వున్న పార్టీలు, ఇప్పుడు ఇంత బలహీనంగా తయారు కావడానికి కార్యదర్శుల వ్యవహారశైలే కారణమన్న విమర్శలూ లేకపోలేదు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకడ రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఒంటెద్దు పోకడలు పోతున్నారని, సొంత పార్టీలోనే విమర్శలు వస్తున్నాయి. కేంద్ర నాయకత్వం దగ్గర పరపతితో ఎలాగొలా నెట్టుకొస్తున్నారు కానీ, బలమైన ఉద్యమాలు నిర్మించడంలో, అందుకు నాయకత్వం వహించడంలో విఫలమవుతున్నారని, కేంద్ర నాయకత్వమే ఆగ్రహంగా వుందట. అందుకే వచ్చే మున్సిపల్ ఎన్నికల్లోనైనా బలం చాటాలని, లేదంటే తీవ్ర పరిణామాలుంటాయన్న హెచ్చరికలు చేశారట.