TS Finance: ఆర్ధికశాఖకి కరోనా ఎఫెక్ట్..హామీల అమలు కలగానే మిగులనుందా..?
Telangana Finance: తెలంగాణ ఆర్ధికశాఖకి కరోనా ఎఫెక్ట్ తగిలింది.
Telangana Finance: తెలంగాణ ఆర్ధికశాఖకి కరోనా ఎఫెక్ట్ తగిలింది. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాడానికి కరోనా అడ్డుగా మారింది. కరోనా ఎఫెక్ట్‌తో హామీల అమలు కలగానే మిగులనుందా?
తెలంగాణ ప్రభుత్వం అనేక ప్రతిష్టాత్మక కార్యక్రమాలను తీసుకొస్తున్నప్పటికి కొన్ని అనుకోని పరిణామాలు వాటికి ఆటంకం కలిగిస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తితో ఉద్యోగులకు, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, రైతులకు రుణమాఫీ నిధులు రిలీజ్ చేసేందుకు అడ్డంకులు వచ్చి పడ్డాయి.
జీహెచ్ఎంసీ ఎన్నికలకుముందు నిరుద్యోగ భృతిని ఇస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఉద్యోగాల భర్తీ తర్వాత ఇది అమలు చేస్తామని చెప్పారు. కానీ పరిస్థితి తారుమారైంది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఇది ఎప్పుడు అమలు అవుతుందో ప్రశ్నగా మారింది. తెలంగాణలో నిరుద్యోగ భృతి పథకం కింద నిరుద్యోగులకు నెలకు 3 వేల 16 రూపాయలు పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అలా అర్హులైన 10 లక్షల మంది యువతకు నెలకు 3,016 చొప్పున భృతి ఇవ్వాలన్నా... ఏడాదికి 3,600 కోట్లు అవసరం అని అధికారులు అంచనా వేస్తున్నారు.
అలాగే, రైతు రుణమాఫీకి సర్వం సిద్ధమైంది. గతేడాది 2.96 లక్షల మంది రైతులకు చెందిన 25 వేల రూపాయల వరకు రుణాలపై 408 కోట్లను ప్రభుత్వం మాఫీ చేసింది. 2021–22 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో రుణమాఫీ కోసం ప్రభుత్వం 5,225 కోట్లు కేటాయించింది. అయితే ఈసారి ఏ రకంగా రుణమాఫీ సొమ్ము విడుదల చేయాలన్న దానిపై వ్యవసాయ శాఖ కసరత్తు చేసింది. అందుకోసం రెండు ఆప్షన్లను ప్రభుత్వం ముందుంచింది. గతంలో 25 వేల వరకు రుణాలు మాఫీ చేసినందున ఈసారి 25 వేల నుంచి 50 వేల మధ్య ఉన్న రైతుల పంట రుణాలను మాఫీ చేయాలన్నది ఒక ఆప్షన్.
ఈ కేటగిరీలో 8.02 లక్షల మంది రైతులు అర్హులుగా తేలారు. వారి కోసం 4,900 కోట్లు విడుదల చేయాల్సి ఉంటుంది. ఇక రెండోది ప్రతి ఒక్కరికీ 25 వేలు మాఫీ చేయాలన్న ఆప్షన్‌ను సిద్ధం చేశారు. ఈ ఆప్షన్ ప్రకారం చూస్తే 13.45 లక్షల మంది రైతులు అర్హులుగా తేలారు. అందుకోసం 5,100 కోట్లు విడుదల చేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితి దీనికి సానుకూలంగా లేకపోవడంతో రైతు రుణమాఫీ డబ్బులు విడుదలకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.
దీంతో పాటు రాష్ట్రంలో ఉన్న ఒక లక్ష 46 వేల మందికి సంబంధించిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం కూడా జాప్యం జరుగుతోంది. పీఆర్‌సీ కమిటీ ఇచ్చిన నివేదికలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తెలిపినా..పరిస్థితుల ప్రభావంతో మరింత జాప్యం కానున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం వరాలు కురిపించినా పరిస్థితులు మాత్రం అనుకూలంగా లేకపోవడం ఇటు ఉద్యోగులకు అటు నిరుద్యోగులకు మరోవైపు రైతులకు శాపంగా మారింది.