అన్ని పార్టీలు జతకడుతున్నాయి. కానీ తనతో ఎవరూ జట్టు కట్టడంలేదని, ఒంటరితనంతో కుమిలిపోతున్నట్టుంది కాంగ్రెస్. గెలిచి తీరాల్సిన హుజూర్ నగర్‌లో, కొత్త ఫ్రెండ్‌ను వెదికిపట్టుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఊరించి ఊరించి ఉసూరుమనిపించిన ఆ పార్టీ, ఇక్కడేదో అద్బుతాలు చేయగలదని నమ్ముతోంది. సినమా గ్లామర్, సామాజిక లెక్కలు పక్కాగా ఉపయోగపడతాయని భావిస్తోంది. అందుకే గాంధీభవన్ నుంచి ఒక్క ఉదుటున మరో పార్టీ గడపలోకి దూకాడు హనుమంతుడు. ఇంతకీ, హుజూర్ నగర్‌లో ఏ పార్టీ హెల్ప్ అడుగుతోంది కాంగ్రెస్ మరి అందుకు పవర్ స్టార్ ఓకే అనేసి, ప్రచారానికి వస్తారా తెలంగాణలోనూ కేసీఆర్‌తో ఢీ అంటే ఢీ అంటారా?
హుజూర్ నగర్ ఉపఎన్నికల పుణ్యమా అని, కొత్తకొత్త రాజకీయాలను చూసే భాగ్యం దక్కింది తెలంగాణ ప్రజలకు. పరస్పరం కొట్టుకునే పార్టీలు ఒకవైపు ఒక్కటవుతుంటే, మరోవైపు కలివిడిగా వుండే పార్టీలు విడివిడిగా సమరానికి సై అంటున్నాయి. ఇప్పుడు మరో కొత్త పొత్తు పొద్దెక్కుతోంది హుజూర్ నగర్‌లో. హుజూర్ నగర్‌లో ఎలాగైనా గెలవాలని తపిస్తున్న కాంగ్రెస్, రకరకాల వ్యూహాలు వేస్తోంది. కొత్త పార్టీలతో స్నేహం చేస్తోంది. హుజూర్ నగర్‌లో కాంగ్రెస్‌కు మద్దతివ్వాలంటూ జనసేన గడప తొక్కింది కాంగ్రెస్ పార్టీ. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు హైదరాబాద్‌లో జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లారు. ఆ పార్టీ తెలంగాణ ఇంచార్జ్ ఎన్.శంకర్ గౌడ్, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు అర్హం ఖాన్, పార్టీ అధ్యక్షుడి రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్‌లతో చర్చించారు. ఉప ఎన్నికకు సంబంధించిన అంశాలపై ప్రధానంగా చర్చ సాగింది.
ప్రస్తుతం కేరళలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్న పవన్ కల్యాణ్ కాంగ్రెస్ విజ్ఞప్తిపై ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ జనసేన కాంగ్రెస్‌కు మద్దతునిస్తే హుజూర్ నగర్ ఉపఎన్నిక మరింత రసవత్తరంగా మారడం ఖాయం. హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భార్య పద్మావతి పోటీ చేస్తున్నారు. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ సీపీఐ మద్దతు కోరింది ఆ పార్టీ నేతలు కూడా సానుకూలంగా స్పందించారు. ఇటు టీడీపీ కూడా సీపీఎం సాయం కోరింది. అయితే, టీఆర్ఎస్ వైపే సీపీఎం మొగ్గుతోందని తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ వ్యూహం మార్చి జనసేన మద్దతు కోరింది.
అయితే ఏపీ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావితం చూపలేకపోయిన జనసేన తెలంగాణ ఉపఎన్నికపై ప్రభావం చూపగలదా..? అన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. టీఆర్ఎస్ సీపీఐ మద్దతుతో బరిలో దిగుతుండటంతో జనసేనతో పొత్తు తమకు ఎంతో కొంత కలిసొస్తుందని కాంగ్రెస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ అభిమానులు, కాపు నేతలు తమకు అండగా వుంటారన్న భావనలో వుంది కాంగ్రెస్. హుజూర్ నగర్‌లో బీసీ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఈ కలయిక, ఉపయోగపడుతుందని కూడా ఆశిస్తోంది. అయితే, పవన్‌తో ఉన్న సంబంధాలతో వీహెచ్, జనసేన గడపతొక్కి మద్దతు కోరారు. మరి కాంగ్రెస్ ప్రతిపాదనపై పవన్ ఎలా రియాక్ట్ అవుతారు ఒకవేళ పొత్తుకు ఒప్పుకుంటే హుజూర్ నగర్‌లో ప్రచారం చేయడానికి వస్తారా..? అన్నది ఉత్కంఠ కలిగిస్తోంది. కానీ పొత్తుకు ఒప్పుకోవడం అంత ఈజీ కాదని అర్థమవుతోంది.
ఒకవేళ కాంగ్రెస్‌తో పొత్తుకు ఒప్పుకుంటే, పవన్ కల్యాణ్ కేసీఆర్ సర్కారుపై విమర్శల జడివాన కురిపించాల్సి వుంటుంది. ఇప్పటికే ఏపీలో కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ, భావోద్వేగాలను మండించే ప్రయత్నం చేశారు పవన్. జనసేనాని వ్యాఖ్యలను టీఆర్‌ఎస్సే కాదు, ఇతర తెలంగాణవాదులు సైతం ఖండించారు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ ఇక్కడ అడుగుపెట్టి, పవన్ తనదైన శైలిలో భావోద్వేగాల ప్రసంగాలు చేస్తే, అధికార పార్టీతో ఢీ అంటే ఢీ అనే పరిస్థితి వస్తుందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. అందుకే అసలు ఉనికేలేని తెలంగాణలో అడుగుపెట్టి, అదీ కూడా ఒక బైపోల్‌కు మద్దతిచ్చి, పలుచన కాకుండా, వ్యూహాత్మకంగా సైలెంట్‌గానో లేదంటో ఎవరికీ మద్దతు ఉండదన్న సంకేతాలో పంపాలని, పవన్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. చూడాలి, బలమున్న ఏపీలోనే బలం చూపలేని జనసేన, అనువుగాని చోట అధికులమనరాదు అన్న తరహాలో ఊరికే ఉంటుందా లేదంటే కేసీఆర్‌తో ఢీ అంటే ఢీ అంటుందో చూడాలి.