KCR: లాక్‌డౌన్‌ మరింత కఠినంగా అమ‌లు చేయండి

KCR: రాష్ట్రమంతటా లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.

Update: 2021-05-21 16:07 GMT

కేసీఆర్ ఫైల్ ఫోటో

KCR: రాష్ట్ర రెవెన్యూ నష్టాన్ని లెక్క చేయకుండా లాక్ డౌన్ ను అమలు పరుస్తున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా, రాష్ట్రమంతటా లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్ని జిల్లాల కలెక్టర్లను, డీజీపీ, పోలీసు అధికారులను ఆదేశించారు. మరికొద్ది రోజుల్లో రోహిణి కార్తె ప్రవేశించనున్న నేపథ్యంలో రైతుల వ్యవసాయ పనులు ప్రారంభం కానున్న పరిస్థితుల్లో ధాన్యం సేకరణ కార్యక్రమాన్ని మరో వారం 10 రోజుల్లో వేగవంతంగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.

వైద్యాధికారులతో వరంగల్‌ అర్బన్‌ కలెక్టరేట్‌ కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. లాక్‌డౌన్‌ ఈనెల 30 వరకు ఉంటుందని, మరింత కఠినంగా అమలు చేయాలని, అనుమతి పత్రాలు లేకుండా బయట తిరిగే వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. లాక్‌డౌన్‌ వల్ల కరోనా చాలా వరకు నియంత్రణలోకి వచ్చిందని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని లాక్‌డౌన్‌ విధించామని, వైరస్‌ కట్టడికి ప్రజలంతా సహకరించాలని సూచించారు.

కొన్ని జిల్లాల్లో లాక్‌డౌన్‌ సరిగా అమలు చేయకపోవడం పట్ల సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు.గ్రామాల్లో ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారని, నగరాలు, పట్టణాల్లో మరింత సమర్థంగా అమలు కావాలని అన్నారు. 10 రోజుల్లో కొనుగోళ్లను పూర్తి చేయాలని చెప్పారు. అంతకుముందు కేసీఆర్‌ వరంగల్‌ కేంద్రకారాగారాన్ని సందర్శించారు. కారాగారాన్ని అక్కడి నుంచి తరలించాలని అధికారులను ఆదేశించారు. జైలు ప్రాంగణంలోని 73 ఎకరాల్లో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు అంశంపై అక్కడి అధికారులతో చర్చించారు.

అవసరం లేకపోయినా బయటకు వచ్చినట్లయితే వైరస్‌ కట్టడి కష్టమవుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. జిల్లాల్లో ఆస్పత్రుల నిర్వహణపై కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, కొవిడ్‌ వ్యాధిగ్రస్తులకు అవసరమైన అన్ని వైద్యసేవలు అందేలా చూడాలని స్పష్టం చేశారు.ఆస్పత్రిలో సిబ్బంది తక్కువగా ఉన్న చోట అవసరమైన సిబ్బందిని నియమించుకోవాలని సూచించారు. లాక్‌డౌన్‌ కారణంగా రైతులు ఇబ్బందులు పడకుండా ధాన్యం కొనుగోళ్లు చేయాలని కేసీఆర్‌ సూచించారు.

Tags:    

Similar News