సిద్ధిపేటలో జరిగిన బహిరంగ సభలో ఆర్థికమంత్రి హరీశ్ రావుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. గురువారం సిద్దిపేట జిల్లా పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొని మాట్లాడారు. తనలా పనిచేసే నాయకుడిని ప్రజలకు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఆణిముత్యంలాంటి నాయకుడిని (హరీశ్) సిద్ధిపేటకు ఇచ్చానని చెప్పారు. హరీశ్ హుషారైన నేతని, ఆయన నేతృత్వంలో సిద్ధిపేటలో అభివృద్ధి జరుగుతోందని చెప్పారు. తన పేరును కాపాడి హరీశ్ సిద్ధిపేటను అభివృద్ధి చేశారని చెప్పారు.
సిద్దిపేట పేరులోనే బలముందని, తెలంగాణ సాధించిన పేట అన్నారు. సిద్దిపేట అంటే తనకు ప్రాణమని చెప్పారు. 'సిద్దిపేట లేకపోతే కేసీఆర్ లేడు.. కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు' అని సీఎం పేర్కొన్నారు. జిల్లాలో కరెంటు బాధలు, నీళ్ల బాధలు లేకుండా చేశామన్నారు. రంగనాయకసాగర్‌ను టూరిస్ట్ హబ్‌గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. రంగనాయకసాగర్ పర్యాటక అభివృద్ధికి రూ.100 కోట్లు ప్రకటించారు. అలాగే రుకోడు లిఫ్ట్ ఇరిగేషన్‌కు రూ.80 కోట్లు మంజూరు చేశారు.