CM KCR Review Meeting Updates: కరోనా విషయంలో ఆందోళన అవసరం లేదు: సీఎం కేసీఆర్
CM KCR Review Meeting Updates: కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలపై సీఎం కేసీఆర్ ఇవాళ ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజెందర్, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ముర్తాజా రిజ్వి, ఆరోగ్యశాఖ వివిధ విభాగాధిపతులు తదితరులు పాల్గొన్నారు.
కరోనా విషయంలో ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, అదే సందర్భంలో నిర్లక్ష్యంగా కూడా ఉండవద్దని సీఎం కేసీఆర్ అన్నారు. కరోనా వైరస్ సోకిన వారు అధిక వ్యయం చేస్తూ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందాల్సిన అవసరం లేదని, ఎంతమందికైనా సేవలు అందించడానికి ప్రభుత్వ వైద్యశాలలు, ప్రభుత్వ వైద్య సిబ్బంది సంసిద్ధంగా ఉందని సీఎం వెల్లడించారు. కరోనా వ్యాప్తి నివారణలోనూ, చికిత్స లోనూ ఎంతో గొప్ప సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
జాతీయ సగటుతో పోలిస్తే తెలంగాణలో మరణాలు తక్కువ అని సీఎం అన్నారు. రికవరీ రేటు 67 శాతం ఉన్నందువల్ల ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 3,692 మంది చికిత్స పొందుతున్నారని చెప్పారు. తీవ్రమైన జబ్బులున్న 200 మంది తప్ప మిగతావారు కోలుకుంటున్నారని సీఎం తెలిపారు. లక్షణాలు లేని 9,636 మంది హోం క్వారంటైన్‌లో ఉన్నారన్నారు. '' కరోనాతో సహజీవనం చేయక తప్పని పరిస్థితి వచ్చింది. ప్రజలు వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండాలి. గాంధీ, టిమ్స్‌లో 3 వేల బెడ్లు ఆక్సిజన్ సౌకర్యంతో సిద్ధం చేశాం. రాష్ట్రవ్యాప్తంగా ఆక్సిజన్ సౌకర్యం కలిగిన 5 వేల బెడ్లు సిద్ధం చేశాం'' అని కేసీఆర్ అన్నారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యల కోసం బడ్జెట్‌కు అదనంగా రూ.100 కోట్లు కేటాయించినట్లు కేసీఆర్ చెప్పారు.