Kavitha Released on Bail: జైలు నుండి విడుదలైన కవిత ఏమన్నారంటే..
తీహార్ జైలు నుండి విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన రాజకీయ ప్రత్యర్థులను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Kavitha Speech after releasing from Jail: జైలు నుండి బయటికొచ్చిన తరువాత కవిత తన కుమారుడిని, భర్త అనిల్ కుమార్‌ని, సోదరుడు కేటీఆర్‌ని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. చాలా రోజుల తరువాత అయిన వారిని కలిశాననే ఆనందంలో ఒకింత ఉద్వేగానికి గురయ్యారు. కుటుంబసభ్యులతో కలిసి తన వాహనం ఎక్కివెళ్లిపోతూ వాహనం పైనుంచే అక్కడే ఉన్న మీడియాతో మాట్లాడారు.
తీహార్ జైలు నుండి బయటికొచ్చిన సందర్భంగా కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడుతూ " నాకు, నా కుటుంబసభ్యులకు ఇటువంటి పరిస్థితిని కల్పించిన వారికి కచ్చితంగా వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం అని తమ రాజకీయ ప్రత్యర్ధులను ఉద్దేశించి హెచ్చరికలు జారీచేశారు. ఒక తల్లి ఐదున్నర నెలలు తన పిల్లలకు దూరంగా ఉంటే కలిగే బాధే తనని కూడా వేధిస్తోంది అని అన్నారు. ఐదున్నర నెలలు తరువాత కుటుంబసభ్యులను కలిసిన ఆనందంలో కొంత ఉద్వేగానికి గురయ్యాను అని కంటతడి పెట్టుకున్నారు. ఓవైపు కన్నీళ్లు తుడుచుకుంటూనే.. తనకి ఈ పరిస్థితి కల్పించిన వారికి కచ్చితంగా బదులు తీర్చుకుంటానని శపథం చేశారు. కష్టకాలంలో తమకు తోడున్న ప్రతీ ఒక్కరికి ధన్యావాదాలు తెలిపారు. నేను కేసీఆర్ బిడ్డను. నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను జగమొండిని.. నన్ను అక్రమంగా జైలుకి పంపించి మరింత జగమొండిని చేశారు. నేను ఫైటర్‌ని. అందుకే ఏదేమైనా ఈ న్యాయ పోరాటం కొనసాగిస్తానంటూ జై తెలంగాణ నినాదంతో కవిత తన మాటలను ముగించి అక్కడి నుండి వెళ్లిపోయారు.
జైలు నుండి విడుదల అయిన వెంటనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన రాజకీయ ప్రత్యర్థులను ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యాయి.