BRS MLC Kavitha Reached Hyderabad: హైదరాబాద్ చేరుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్ చేరుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు పార్టీ శ్రేణుల నుండి ఘన స్వాగతం లభించింది.

Update: 2024-08-28 12:15 GMT

BRS MLC Kavitha Reached Hyderabad: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ నుండి హైదరాబాద్ చేరుకున్నారు. ఐదున్నర నెలల తరువాత హైదరాబాద్ వచ్చిన కవితకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. కవిత ఎయిర్ పోర్టు నుండి బయటికి వస్తూనే జై తెలంగాణ నినాదాలు చేశారు. కవిత రాక సందర్భంగా అక్కడికి భారీ సంఖ్యలో తరలివచ్చిన బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలతో ఎయిర్ పోర్ట్ అరైవల్స్ ప్రాంగణం అంతా నిండిపోయింది. కవితకు స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలు మహిళా నేతలు అక్కడికి తరలివచ్చారు. ముందుగా కవితను కలిసి స్వాగతం చెప్పేందుకు బీఆర్ఎస్ శ్రేణులు పోటీపడటం కనిపించింది. ఎయిర్ పోర్టు నుండి ఆమె నేరుగా తన నివాసానికి వెళ్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కవిత వెంట కేటీఆర్, ఆమె భర్త అనిల్ కుమార్, హరీష్ రావు, కుమారుడు ఉన్నారు. 

Full View

ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో అరెస్టయి తీహాడ్ జైలుకు వెళ్లిన కవిత నిన్న బెయిల్‌పై విడుదలయ్యారు. జైలు నుండి విడుదలైన అనంతరం నిన్న రాత్రి మీడియాతో మాట్లాడుతు కవిత ఉద్వేగానికి గురయ్యారు. అదే సమయంలో తనకు ఈ దుస్థితి కల్పించిన వారికి వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం అని కుండబద్ధలు కొట్టినట్లు హెచ్చరించారు. 

ఒక తల్లి ఐదున్నర నెలలు తన పిల్లలకు దూరంగా ఉంటే కలిగే బాధే తనని కూడా వేధిస్తోంది అని అన్నారు. ఐదున్నర నెలలు తరువాత కుటుంబసభ్యులను కలిసిన ఆనందంలో కొంత ఉద్వేగానికి గురయ్యాను అని కంటతడి పెట్టుకున్నారు. ఓవైపు కన్నీళ్లు తుడుచుకుంటూనే.. తనకి ఈ పరిస్థితి కల్పించిన వారికి కచ్చితంగా బదులు తీర్చుకుంటానని శపథం చేశారు. కష్టకాలంలో తమకు తోడున్న ప్రతీ ఒక్కరికి ధన్యావాదాలు తెలిపారు. నేను కేసీఆర్ బిడ్డను. నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను జగమొండిని.. నన్ను అక్రమంగా జైలుకి పంపించి మరింత జగమొండిని చేశారు. నేను ఫైటర్‌ని. అందుకే ఏదేమైనా ఈ న్యాయ పోరాటం కొనసాగిస్తాను అని కవిత ప్రకటించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కవిత చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Tags:    

Similar News