Kavitha's Bail Plea Hearing: కవితకు షాక్ మీద షాక్
Kavitha's Bail Plea Hearing: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కోర్టు నుండి షాక్ మీద షాకులు ఎదురవుతున్నాయి.
Kavitha's Bail Plea Hearing: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ, సీబీఐ నుండి విచారణ ఎదుర్కుంటూ అరెస్టయి తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కోర్టు నుండి షాక్ మీద షాకులు ఎదురవుతున్నాయి. మార్చి 15న అరెస్టయిన కవిత గత 5 నెలలుగా తీహార్ జైలులోనే ఉన్నారు. అప్పటి నుండి ఇప్పటివరకు అనేక పర్యాయాలు కవిత బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. అందులో భాగంగానే కవిత బెయిల్ పిటిషన్లను జులై1న ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. దీంతో ఈసారి ఆగస్టు 8న కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
తనకు బెయిల్ ఇవ్వలేమని పిటిషన్లను తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ తనకి బెయిల్ ఇవ్వాల్సిందిగా ఆమె సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే, ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న సీబీఐ, ఈడీ వాదనలు వినకుండా బెయిల్ ఇవ్వలేం అని తేల్చిచెప్పిన సుప్రీం కోర్టు.. ఈ కేసు తదుపరి విచారణను ఆగస్టు 27వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. ఈ కేసులో ఇప్పటికే సుప్రీం కోర్టు అఫిడవిట్ దాఖలు చేసినప్పటికీ.. ఈడీ ఇంకా తన అఫిడవిట్ దాఖలు చేయకపోవడంతో శుక్రవారంలోగా ఆ పని పూర్తి చేయాల్సిందిగా సుప్రీం కోర్టు ఈడీకి స్పష్టంచేసింది.
ఇవాళ సుప్రీం కోర్టులో కవిత బెయిల్ పిటిషన్ విచారణకు రానున్న నేపథ్యంలో ఇవాళయినా బెయిల్ వస్తుందేమోననే ఆశ కవితతో పాటు ఆమె కుటుంబసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో బలంగా కనిపించింది. ఒకవేళ కవితకు బెయిల్ వస్తే రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు చేసుకోవాలని పార్టీ శ్రేణులకు పార్టీ అధినాయకుల నుండి మౌకిక ఆదేశాలు కూడా వెళ్లినట్టు తెలుస్తోంది. కానీ నేడు కూడా బెయిల్ ఇవ్వకుండా బెయిల్ పిటిషన్ విచారణను ఆగస్టు 27 వరకు వాయిదా వేస్తున్నట్టు సుప్రీం కోర్టు స్పష్టంచేసింది. దీంతో బెయిల్ విషయంలో కవితకు మరోసారి నిరాశే ఎదురవడమే కాకుండా తదుపరి విచారణ వచ్చే వరకు ఎదురుచూడక తప్పని పరిస్థితి నెలకొంది.