బ్రైట్ లైఫ్ స్వచ్ఛంద సంస్థ సేవా కార్యక్రమాలు
*యప్ టీవీ ఫౌండర్ పాడి ఉదయానందన్‌రెడ్డి ఆధ్వర్యంలో సేవాకార్యక్రమాలు
Bright Life Charity: గ్రామీణ ఉపాధి, మహిళా సాధికారత లక్ష్యంగా యప్ టీవీ నిర్వాహకులు పాడి ఉదయానందన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బ్రైట్ లైఫ్ సంస్థ మరిన్ని కార్యక్రమాలను చేపట్టేందుకు సిద్ధమవుతోంది. కరీంనగర్ జిల్లా వీణవంక గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇప్పటివరకు జరిగిన సేవా కార్యక్రమాలతో పాటు భవిష్యత్తులో చేపట్టనున్న కార్యక్రమాలను వివరించారు. ఆర్థికంగా వెనుకబడిన నిరుపేద పిల్లలు తమ జీవిత లక్ష్యాలను చేరుకోవడంతో పాటు మెరుగైన భవిష్యత్తును నిర్మించుకునేందుకు దోహదపడేలా నాణ్యమైన కంప్యూటర్ కోర్సుల్లో శిక్షణ ఇప్పిస్తున్నట్లు వివరించారు.
అర్హత ఉన్న ప్రతీ విద్యార్థికి నెలకు వెయ్యి రూపాయలు వారి అకౌంట్లలోనే వేస్తామని ఇప్పటివరకు వీణవంక పట్టణంలో 155 మంది విద్యార్థులకు స్కాలర్ షిప్‌లు అందజేసినట్లు తెలిపారు. త్వరలోనే ఈ కార్యక్రమాన్ని వీణవంక మండలానికి విస్తరిస్తామన్నారు. వచ్చే సంక్రాంతి నాటికి పైలెట్ ప్రాజెక్ట్‌గా కరీంనగర్ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని మొదలుపెడతామని.. క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరిస్తామని పాడి ఉదయానందన్ రెడ్డి ప్రకటించారు.