ఆయన వరుసగా రెండుసార్లు గెలిచిన ఎమ్మెల్యే. గులాబీ పార్టీలో ఏకైక మైనార్టీ శాసనసభ్యుడు. క్యాబినెట్ విస్తరణపై గంపెడాశలు పెట్టుకున్న ఆయనకు, కేసీఆర్ క్యాబినెట్‌లో బెర్త్ దక్కలేదు. అంతే. అలకపాన్పు ఎక్కిన ఆయన, బీజేపీ ఎంపీతో భేటి అయ్యారు. ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. వెంటనే సదరు ఎమ్మెల్యే యూ టర్న్ తీసుకున్నా పార్టీలో ఆయన ఒంటరిగానే మిగిలిపోయారు. జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యేలు- ఎమ్మెల్సీలకు అసెంబ్లీ కమిటీల్లో స్ధానం కల్పించినా ఆయన్ను మాత్రం పక్కన పెట్టడానికి కారణం అదేనా....? పుండు మీద కారం చల్లడం వెనుక గులాబీ వ్యూహం ఏంటి..? ఇందూరు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన ఆ ఎమ్మెల్యే ఫ్యూచరేంటి?
ఒక్క సమావేశంతో, రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాఫిక్ గా మారారు నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్. గులాబీ పార్టీలో ఏకైక మైనార్టీ ఎమ్మెల్యే. కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితునిగా పేరు తెచ్చుకున్నారు. రెండు దఫాలుగా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిని ఓడించి పార్టీలో గుర్తింపు సాధించారు. మైనార్టీ కోటాలో మంత్రి లేదా నామినేటెడ్ పోస్టు ఖాయమని ముందు నుంచి ఆశల పల్లకిలో ఊరేగారు. తొలిసారి గెలిచినప్పుడు ఎలాంటి పదవి రాకపోవడంతో, ఐదేళ్లుగా ఎమ్మెల్యేగానే ఉండిపోయారు. రెండోసారి గెలిచాక మంత్రి పదవి ఖాయమని ఆశపడ్డారు. ఇటీవల జరిగిన క్యాబినెట్ విస్తరణలో తన పేరు లేకపోవడంతో అసంతృప్తితో రగిలిపోయారట. ఇటు నియోజకవర్గానికి అటు పార్టీకి దూరంగా ఉన్న ఆయన కొద్దిరోజుల క్రితం బీజేపీ ఎంపీ అర్వింద్‌తో కలవడం పెను సంచలనం సృష్టించింది. తనకు మంత్రి పదవి ఇవ్వలేదని టీఆర్ఎస్ క్యాడర్, నియోజకవర్గ ప్రజలు అసంతృప్తితో ఉన్నారని చెప్పుకొచ్చిన ఆయన మనసు మార్చుకుని యూటర్న్ తీసుకున్నారు. కవితను టార్గెట్ చేస్తూ టీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పిచే అర్వింద్‌తో భేటీ కావడాన్ని టీఆర్ఎస్ అధిష్ఠానం సీరియస్‌గా తీసుకుందట. పార్టీకి డ్యామేజ్ కాకుండా తాత్కాలికంగా షకీల్ ను బుజ్జగించినా ఆయన్ను ఇప్పుడు పక్కన పెట్టారనే టాక్ నడుస్తోంది. ఐతే ఆయన అనుచరులు మాత్రం తమ నేతే పార్టీకి దూరంగా ఉంటున్నారని చెబుతున్నారట. షకీల్ పార్టీలో ఉంటారో పార్టీని వీడుతారో అంతు చిక్కడం లేదని టీఆర్ఎస్ నేతలు చెవులు కొరుక్కుంటున్నారట.
జిల్లా నుంచి మంత్రి పదవులు ఆశించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు, అసెంబ్లీ కమిటీల్లో చోటు కల్పించారు సీఎం కేసీఆర్. ఐతే ఏకైక మైనార్టీ ఎమ్మెల్యేగా ఉన్న షకీల్ అమీర్ కు మాత్రం ఏ కమిటీల్లో స్ధానం కల్పించలేదు. ఇటీవల అర్వింద్ తో భేటీ కావడంతోనే ఆయనకు కమిటీలో చోటు దక్కలేదనే టాక్ నడుస్తోంది. క్యాబినెట్ విస్తరణలో బెర్త్ ఆశించిన అర్బన్ ఎమ్మెల్యే బిగాలకు పీఏసీ, మైనార్టీ కమిటీల్లో సభ్యునిగా నియమించగా, ఆర్మూర్ ఎమ్మెల్యేకు పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ ఛైర్మన్ గా అవకాశం ఇచ్చారు. ఎమ్మెల్సీ ఆకుల లలిత, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్‌లను పబ్లిక్ ఎస్టిమేషన్ కమిటీలో సభ్యులుగా చేర్చగా బీసీ కమిటీ సభ్యునిగా బాజిరెడ్డిని, ఎస్సీ, మైనార్టీ కమిటీ సభ్యునిగా ఎమ్మెల్సీ రాజేశ్వరరావును నియమించారు. లైబ్రరీ కమిటీ సభ్యునిగా జుక్కల్ ఎమ్మెల్యే షిండే కు, ప్రభుత్వ హామీల కమిటీ ఛైర్మన్ గా ఎమ్మెల్సీ వీజీ గౌడ్ కు అవకాశం ఇచ్చారు. మంత్రి ప్రశాంత్ రెడ్డికి అసెంబ్లీ ప్రత్యేక కమిటీ సభ్యునిగా నియమించారు. మొత్తానికి ముగ్గురు ఎమ్మెల్సీలు, ఆరుగురు ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కమిటీల్లో బెర్త్ దొరగ్గా పుండు మీద కారం చల్లినట్లు షకీల్ కు మొండి చేయి ఇచ్చారట. మైనార్టీ కమిటీల్లోను ఇతరులను సభ్యులుగా చేర్చడం అవమానంగా ఫీల్ అవుతున్నారట షకీల్.
సీఎం కేసీఆర్‌ను తన పొలిటికల్ గాడ్ ఫాదర్ గా చెప్పినా, షకీల్‌ను పార్టీ అధినేత నమ్మడం లేదనే ప్రచారం జరుగుతోంది. కవితను టార్గెట్ చేసి ఓడించిన నేతను కలవడం, అసంతృప్తిని వెళ్లగక్కడంపై అధిష్ఠానం గుర్రుగా ఉందట. ఇటు షకీల్ సైతం ఇంకా అసంతృప్తితో రగిలిపోతున్నారట. నియోజకవర్గంవైపు సైతం కన్నెత్తి చూడటం లేదట. అసలు షకీల్ బీజేపీ నేతలను సంప్రదించడం వెనుక ఆంతర్యం ఏంటన్నది రాజకీయ విశ్లేషకులకు సైతం అంతు చిక్కడం లేదట. షకీల్ ఎపిసోడ్ తాత్కాలికంగా ఆగినట్లా లేదా పూర్తిగా తెరపడినట్లేనా అన్నది తెలియక గులాబీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నారు.