హుజూర్ నగర్‌లో పోటీ హస్తానికి, కారుకేనని మొన్నటి వరకు చర్చ జరిగింది. ఎందుకంటే, కాంగ్రెస్‌కు సిట్టింగ్ సీటు. అధికార టీఆర్‌ఎస్‌కు త్రుటిలో తప్పిన సీటు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో దుమ్మురేపిన బీజేపీ, తాను సైతం రంగంలో ఉన్నానని చెబుతోంది. అంతేకాదు, ఆ రెండు పార్టీలకు దీటుగా సోషల్ ఇంజినీరింగ్ స్ట్రాటజీకి పదునుపెట్టింది. యూపీ, బీహార్ తరహా సామాజిక సమీకరణల అస్త్రాన్ని, బైపోల్‌లో ప్రయోగిస్తానంటోంది. ఇంతకీ బీజేపీ కొత్త మంత్రమంటి?
ఎన్నిక..అదీ ఒకే స్థానానికి. కానీ రాష్ట్రం మొత్తం దృష్టి, ఆ ఉప ఎన్నికపైనే రాజకీయ పార్టీలైతే ఈ ఎన్నికల పోరును చావో రేవో అన్నట్లుగా చూస్తున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం కోసం ఇప్పటికే వ్యూహ ప్రతివ్యూహాలు రచించాయి. మంత్రుల నుంచి సాధారణ కార్యకర్తల వరకు, హుజుర్ నగర్‌లోనే మకాం వేశారు. తమ అభ్యర్థి గెలుపుకోసం ఏ చిన్న అవకాశాన్నీ వదలకుండా ముందుకు వెళ్తున్నాయి పార్టీలు.
ఇప్పటికే అన్ని పార్టీలు తమ అభ్యర్థుల్ని ఖరారు చేశాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్‌లకు తోడు, ఇప్పుడు సమరానికి సై అంటోంది బీజేపీ. వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పక్కన పెడితే, లోక్ సభ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో గెలుపొంది నూతనోత్సాహంతో ఆ పార్టీ ఎన్నికల బరిలో దిగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో
నోటా కంటె తక్కువ ఓట్లు ఆ పార్టీకి హుజూర్ నగర్ లో వచ్చినా, ఇప్పుడు మాత్రం పరిస్థితి మరోలా ఉంటుందని అంటున్నారు ఆ పార్టీ నాయకులు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, కేంద్రంలో మోడీ ప్రభుత్వ సాహసోపేత నిర్ణయాలు తమకు కలిసి వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు కాషాయ నేతలు. అభ్యర్థి ఎంపికపై చివరి వరకు తీవ్ర కసరత్తు చేసింది బీజేపీ. పదిమందికి పైగానే టికెట్ ఆశించినప్పటికీ, అభ్యర్థి బలాబలాలు, కుల ప్రాతిపాదికన బీసి నేత, పెరిక కులానికి చెందిన కోట రామారావును హుజూర్ నగర్ అభ్యర్థిగా ఆ పార్టీ ఖరారు చేసింది.
హుజూర్ నగర్‌లో ఓటర్లను కులాల వారిగా చూస్తే, మొదట బీసీలు, రెండో స్థానంలో ఓసీలున్నారు. కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ పద్మావతి, రెడ్డి సామాజిక వర్గం నుంచి పోటీలో ఉండగా, అటు టిఆర్ఏస్ నుంచి సైదిరెడ్డి కూడా రెడ్డి సామాజిక వర్గం నుంచే పోటీలో ఉన్నారు. దీంతో రెడ్డి కులస్తుల ఓట్లు చీలిపోయే అవకాశం ఉందన్నది బీజేపి అంచనా. అదే తమకు విజయాన్నిస్తుందని ధీమా.
బీజేపి నుంచి రెడ్డి సామాజిక వర్గం వారు టిక్కెట్ ఆశించినప్పటికీ, అన్ని సమీకరణాలు పరిశీలించి, రెడ్డి సామాజిక వర్గం కంటే ఎక్కువ జనాభా ఉన్న బీసీని అభ్యర్దిగా దించడం ద్వారా బీసీ ఓట్లు తమకు పడే అవకాశం ఉందని భావిస్తోంది బీజేపీ. ఇక మరోవైపు హుజూర్ నగర్ నియోజకవర్గంలో బీసీ జనాభాలో ఎక్కువ మంది పెరిక కులానికి చెందిన వారే ఉండటంతో, అదే కులానికి చెందిన కోట రామారావును అభ్యర్థిగా ఎంపిక చేసి, రంగంలోకి దిగింది.
హుజూర్ నగర్‌లో దాదాపు 40 శాతం ఉన్న బీసీల్లో, కనీసం 15 నుంచి 20 శాతం ఓట్లు బీజేపికి పడితే, మిగతా కులాల నుంచి 10 శాతం ఓట్లు తమకు వచ్చినా, కాంగ్రెస్,టీఆర్ఎస్ లకు గట్టి పోటీ ఇవ్వగలుగుతామనే అంచనాకు వచ్చారు కమల నాథులు. బీసీ అభ్యర్థిని బరిలోకి దింపడం వెనక బీజేపి వ్యూహం ఇదే అని అంటుంన్నారు రాజకీయ విశ్లేషకులు. బీజేపి కూడా రెడ్డి అభ్యర్థిని రంగంలోకి దింపితే, అటు బీసీ ఓట్లు చీలిపోవడంతో పాటు రెడ్డి ఓట్లు బీజేపికి కచ్చితంగా పడతాయనే గ్యారెంటీ లేదని, అందుకే బీసీ అభ్యర్థిని బరిలోకి దింపారని ప్రచారం జరుగుతోంది.
బీసీ సామాజిక వర్గానికి చెందిన రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు లక్ష్మణ్, అన్ని బీసీ సంఘాల ముఖ్య నేతలతో మాట్లాడుతున్నారు. హుజూర్ నగర్ ఎన్నికలో బీజేపి కి మద్దతుగా ప్రచారం చేయాలని కోరుతున్నారట. కాంగ్రెస్, టిఆర్ఎస్ లు బీసీలకు చేసింది ఏమీ లేదని చెప్పటంతో పాటు, బీసీలకి ప్రాధాన్యత ఇచ్చింది తామేనన్న ప్రచారం బాగా చేయాలని, పార్ట శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారట.
మొత్తం మీద హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో, బీసీ కార్డును ఆయుధంగా చేసుకుని రంగంలోకి దిగాలని నిర్ణయించింది బీజేపీ. మరి హుజూర్ నగర్ ఎన్నికల్లో బీసీ ఓట్లనే నమ్ముకున్న బీజేపికి ఆ వర్గం నుండి ఎలాంటి ఆదరణ లభిస్తుంది...? కాంగ్రెస్, టీఆర్ఎస్‌లకు, ఆ పార్టీ పోటీ ఇస్తుందా...? హుజూర్ నగర్‌లో బీజేపి పరువు నిలుపుకుంటుందా అనేది తేలాలంటే హుజూర్ నగర్ ఎన్నికల ఫలితాలు వచ్చేవరకు వేచి చూడాల్సిందే.