సోయం ఒకే దెబ్బకు రెండు పిట్టల వ్యూహం ఫలితమిస్తుందా?

Update: 2019-07-24 10:29 GMT

ఆ ఎంపీ దూకుడు పెంచారు పోడు భూములు గిరిజనుల హక్కు అన్నారు..అడ్డం వస్తే తన్ని తరిమేయాలని ఆదివాసీలకు పిలుపునిచ్చారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని చట్టం చేసే పార్లమెంట్‌లో నినదించారు. ఆదివాసీల అమ్మాయిలను వేధిస్తే అంతు చూస్తామని ఒక వర్గాన్ని హెచ్చరించారు. మొత్తం తెలంగాణ సర్కార్‌ను టార్గెట్ చేసినట్టుగా అనిపిస్తోంది కదా. అదే ఆ ఎంపీ వ్యూహం కూడా. అయితే ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా, ఆ ఎంపీ వ్యూహం వేశారు. ఇంతకీ ఆ ఎంపీ ఎవరు ఒకే దెబ్బ రెండు పిట్టల వ్యూహమేంటి?

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోడుభూముల పోరు ఉధృతమవుతోంది. ఆదివాసీ నాయకులు సర్కారు తీరుపై మండి పడుతున్నారు. ఇక ఆదిలాబాద్‌ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా గెలిచిన ఎంపి సోయం బాపురావు పోడుభూములపై తీవ్రంగా స్పందించారు.

గిరిజనులు సాగు చేసుకుంటున్న భూముల్లో హరిత హారం మొక్కలు నాటితే తొలగించాలని పిలుపునిచ్చారు సోయం. అదేవిధంగా అటవీ అధికారులు, అడవి బిడ్దలకు అడ్డం వస్తే తన్ని తరిమేయాలని కూడా గిరిజనులతో అన్నారు సోయం. ఏళ్లుగా సాగుచేసుకుంటున్న భూములకు హక్కు పత్రాలు ఇవ్వకపోతే, ఇంద్రవెల్లి తరహా పోరాటం చేస్తామని తెలంగాణ సర్కార్‌ను హెచ్చారించారు సోయం బాపురావు.

బీజేపీ ఎంపీగా గెలిచిన తర్వాత కేసీఆర్‌ సర్కార్‌పై వాయిస్‌ పెంచారు సోయం బాపురావు. గోంది గూడ గిరిజనులను ఖాళీ చేయించడంపై మండిపడ్డారు. ఆదివాసీలకు పోడుభూములు ఇస్తామని ఓట్లు పొందిన టిఆర్‌ఎస్, ఇప్పుడు హరితహారం పేరుతో గిరిజనులను ఇబ్బందులపాలు చేయడాన్ని సీరియస్‌గా తీసుకున్నారు సోయం. ఇదే అంశంపై అధికార పార్టీని దోషిగా నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నారని అర్థమవుతోంది. ఆ స్ట్రాటజీలో భాగంగానే ఆదివాసీలకు పోడులు ఇవ్వాలని కోరుతూ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టేందుకు సిద్దమవుతున్నారట సోయం.

బస్సు యాత్రతో గూడెల్లోకి వెళ్లి ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయాలను సరిదిద్దాలని, గిరిజనులను చైతన్యం చేయాలని, సోయం సిద్దమవుతుండటం టీఆర్ఎస్‌కు మింగుడు పడటం లేదట. ఇప్పటికే లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే ఉద్యమం గూడేల్లో తీవ్రంగా ఉంది. దీనికి తోడు సోయం లంబాడాల ఎస్టీ జాబితా అంశాన్ని పార్లమెంట్‌‌ జీరో అవర్‌లో లేవనెత్తారు. ఇలాంటి అంశాలతో బస్సు యాత్ర చేస్తే సర్కార్ అభాసుపాలవుతుందని ప్రభుత్వం ఆందోళన చెందుతోందట. మరోవైపు సోయం ఎంపిగా గెలవడని భావిస్తే, ఇప్పుడు ఎంపీగా గెలడమే కాకుండా రాష్ట్రస్థాయిలో నాయకుడిగా ఎదగడం, టిఆర్‌ఎస్ గిరిజన నాయకులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోందని ప్రచారం జరుగుతోంది.

అయితే తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో పాస్‌ కావడంలో కీలకపాత్ర పోషించింది బీజేపీ. కాని అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతింది. కేవలం ఒకే ఒక్క అసెంబ్లీ సీటుకే పరిమితమైంది. అయితే పార్లమెంట్ ఎన్నికల నాటికి కమలం సీన్‌ పూర్తిగా మారింది. ఎవరూ ఊహించనివిధంగా నాలుగు ఎంపీ స్థానాలు గెలిచింది. అందులో ఒకటి గిరిజనుల ఖిల్లా ఆదిలాబాద్ ఎంపీ సీటు. దాంతో వ్యూహం మార్చింది బిజెపి. ఆదివాసీల వర్గాల్లో బలపడటానికి సోయం బాపురావును ఆయుధంగా ప్రయోగించాలని భావిస్తోందట కమలం.

ఆదివాసీల ఓటు బ్యాంకును పదిలం చేసుకోవాలన్న పట్టుదల పెంచుకుంది బీజేపీ. మొన్న లంబాడా తండాలో పర్యటించి, ఓ ఇంట్లో భోజనం కూడా చేశారు బీజేపీ చీఫ్, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా. పోడు భూముల అంశం, రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుండటంతో, ఇదే అదనుగా సోయంను, ఆదివాసీ సమస్యలపై పోరాటానికి ఢిల్లీ పెద్దలు పురికొల్పుతున్నారట.

ఢిల్లీ బీజేపీ వ్యూహంలో భాగంగానే ఆదివాసీ సమస్యలపై టిఆర్‌ఎస్ సర్కార్‌ను ఇరుకున పెట్టేందుకు సోయం బాపురావు అదేపనిగా పోడు భూముల వ్యవహారాన్ని లేవనెత్తుతున్నారు. ఇక పోరును జంతర్ మంతర్ వద్ద నిర్వహించడానికి ఢిల్లీ పార్టీ పెద్దలు సహాయ సహకారాలు అందిస్తున్నారని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతోంది. ఆదివాసీ సమస్యలపై సోయం నిర్వహించే బస్సుయాత్రలో కేంద్రమంత్రులు సైతం పాల్గొంటారని కార్యకర్తలు బయట చెప్పుకుంటున్నారు. దీనితో తెలంగాణ రాష్ట్రంలో తమ పార్టీకి ఆదివాసీ వర్గాల్లో పట్టు పెరుగుతుందని భావిస్తోందట బీజేపీ.

మొత్తానికి ఎంపీగా ఎన్నికై, రాష్ట్ర నాయకునిగా బలపడేందుకు సోయం బాపురావు ప్రయత్నిస్తున్న టైంలో, అటు పోడు భూముల అంశాన్ని ఉద్యమంగా మలచాలని ఢిల్లీ పెద్దలు కూడా ప్రోత్సహిస్తుండటం, సోయంకు అందివచ్చిన అవకాశమైంది. అందుకే గులాబీ సర్కార్‌పై అనేక అస్త్రాలు సంధిస్తూ, ఉక్కిరిబిక్కిరి చేసే ప్రయత్నం చేస్తున్నారు సోయం.

Full View  

Tags:    

Similar News