కారుని వెంటాడుతోన్న కమలం భయం
టీఆర్‌ఎస్‌కు బీజేపీ ఫీవర్ పట్టుకుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అసంతృప్త నేతలు బీజేపీ బాటపడుతున్నారన్న చర్చ గులాబీ పార్టీలో పెద్దఎత్తున జరుగుతోంది. ఇప్పటికే పలువురు లీడర్లు కమలం గూటికి చేరేందుకు రంగంసిద్ధంచేసుకున్నారనే టాక్ వినిపిస్తోంది.
టీఆర్‌ఎస్‌కు బీజేపీ ఫీవర్ పట్టుకుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అసంతృప్త నేతలు బీజేపీ బాటపడుతున్నారన్న చర్చ గులాబీ పార్టీలో పెద్దఎత్తున జరుగుతోంది. ఇప్పటికే పలువురు లీడర్లు కమలం గూటికి చేరేందుకు రంగంసిద్ధంచేసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. అందుకే నామినేటెడ్ పోస్టుల భర్తీపై టీఆర్‌ఎస్ అధిష్టానం ఆచితూచి వ్యవహరిస్తోందని అంటున్నారు.
రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పలేము. ఎందుకంటే, నిన్నమొన్నటివరకు నేతలంతా గులాబీ గూటికి క్యూ కడితే, ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. పలువురు టీఆర్‌ఎస్ నేతలు తమతో టచ్‌లో ఉన్నారని బీజేపీ చెబుతోంది. అయితే, కొందరు అసంతృప్త నేతలు కమలం వైపు చూస్తున్నారని పసిగట్టిన గులాబీ అధిష్టానం నామినేటెడ్ పోస్టుల భర్తీకి కసరత్తు చేసినా, ప్రస్తుత పరిస్థితులను అంచనావేసి, పెండింగ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది.
2014లో మొదటిసారి అధికారంలోకి వచ్చినా, నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో మాత్రం నాన్చుడి ధోరణినే కొనసాగింది. రెండోసారి అధికారంలోకి వచ్చాకైనా, పదవుల పంపిణీ జరుగుతుందని ఆశించిన లీడర్లకు నిరాశే ఎదురైంది. దాంతో టీఆర్‌ఎస్ ద్వితీయశ్రేణి నాయకత్వం అసంతృప్తికి గురవుతోంది. అయితే, పలువురు నేతలు బీజేపీ వైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతుండటంతో, ఈ సమయంలో నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తే, పదవులు దక్కని లీడర్లంతా కమలం గూటికి వెళ్లే ప్రమాదముందనే భయం కారు పార్టీని వెంటాడుతుందనే ప్రచారం జరుగుతోంది.
తెలంగాణలో ఎలాగైనా పాగా వేయాలని కంకణం కట్టుకున్న కమలదళం ఆపరేషన్ ఆకర్ష్‌ను బలంగా చేపడుతోంది. ఇప్పటికే బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా రాష్ట్రంలో పర్యటిస్తూ, పలువురు నేతలను కమలం గూటికి చేర్చి, పార్టీ బలోపేతానికి చర్యలు చేపట్టారు. ఇక త్వరలో తెలంగాణకు రానున్న బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ఆధ్వరంలో మరింతమంది ముఖ్యనేతలు బీజేపీలో చేరనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇదంతా దృష్టిలో పెట్టుకునే, నామినేటెడ్ పోస్టుల భర్తీని గులాబీ పార్టీ పెండింగ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది.