సంచలనం సృష్టించిన బాసర ట్రిపుల్ ఐటీ ప్రొఫెసర్ రవి ఉదంతంపై ఆదిలాబాద్ జిల్లా లీగల్ సేల్ సర్వీస్ అథారిటీ స్పందించింది. హియరింగ్‌కు రావాలంటూ జిల్లా ఎస్పీ, స్థానిక పోలీసులను ఆదేశించింది. మరోవైపు విద్యార్థినులకు షీ టీమ్స్‌తో కౌన్సెలింగ్ ఇప్పిస్తామని ఇలాంటి ఘటనలు మరోసారి చోటు చేసుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని ట్రిపుల్ ఐటీ వీసీ స్పష్టం చేశారు. ఫేయిల్ అయిన విద్యార్థినులే లక్ష్యంగా వేధింపులకు పాల్పడ్డ వరాల రవిపై ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే రవిని విధుల నుంచి శాశ్వతంగా తప్పించారు. ఈ ఘటనపై దర్యాప్తు కమిటీ ఇచ్చిన ఆధారంగా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు పోలీసులు ఐపీసీ సెక్షన్ 409, 420, 506 కింద కేసు బుక్ చేశారు. మరోవైపు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌ను.. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సందర్శించారు. సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఘటనపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలను ఉపేక్షించే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. త్వరలోనే ట్రిపుల్ ఐటీకి పూర్తిస్థాయి వీసీని నియమిస్తామని విద్యార్థినుల భద్రత దృష్ట్యా ట్రిపుల్ ఐటీలో మహిళా ఎస్ఐను నియమించనున్నట్లు ప్రకటించారు.
మరోవైపు రవి ఉదంతంపై ఆదిలాబాద్ జిల్లా లీగల్ సేల్ సర్వీస్ అథారిటీ స్పందించింది. నిర్మల్ ఎస్పీ శశిధర్ రాజు, బైంసా డిఎస్పీ, స్థానిక సీఐ, ఎస్సైకి నోటీసులు జారీ అయ్యాయి. ఈనెల 15 న హియరింగ్‌కు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును ప్రీలిటిగేషన్ గా నమోదు చేసింది. క్యాంపస్‌కు ఎక్కువగా గ్రామీణ విద్యార్థినులే వస్తారని వారిలో మానసిక స్థైర్యం నింపేందుకు షీ టీమ్స్‌తో కౌన్సెలింగ్ ఇస్తున్నట్లు ఇంచార్జీ వీసీ అశోక్ తెలిపారు. రవిని కఠినంగా శిక్షించాలని మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని విద్యార్థీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.