ములుగులో మాజీ మంత్రికి గులాబీ ముల్లు.. కొత్త నేతను అందుకే తెరపైకి తెచ్చారని అనుమానం ?
జిల్లాలో రెండు పర్యాయాలు మంత్రిగా, ఒకసారి పార్లమెంట్ సభ్యుడిగా పని చేసిన నేత. టిఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు. ఒకప్పుడు తన నియోజకవర్గంలో తన మాటే వేదవాక్కు కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. అధిష్టానమే తనకు చెక్ పెట్టి ఓ యువనేతను సీన్‌లోకి దింపింది. ఇంతకీ ఎవరూ ఆ నేతలు..?
ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరు మాజీ మంత్రి చందూలాల్. 2014 ఎన్నికల్లో గెలిచి మొదటి మంత్రి వర్గంలోనే చోటు దక్కించుకున్నారు. కానీ ఐదేళ్లు తిరిగే లోపు ఓడలు బండ్లవుతాయన్న చందంగా మారింది చందూలాల్ పరిస్థితి. ఆరోగ్యం సహకరించకున్నా కేసీఆర్‌కు, తన మీద ఉన్న నమ్మకంతో గత ప్రభుత్వంలో మంత్రిగా పూర్తి పదవీకాలం కొనసాగించారు. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి సీటు ఇచ్చినా ఓటమి చెందడం, అప్పటికే అక్కడి కార్యకర్తల్లో ఆయనపై వ్యతిరేకత ఉండటంతో అక్కడ కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించాలని అధిష్ఠానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. తన స్థానాన్ని ఆ జిల్లాలో భర్తీ చేయడానికి ఓ యువనేతను పార్టీ సిద్ధం చేసిందని, చందూలాల్ టెన్షన్ పడుతున్నారని ములుగు జిల్లాలో చర్చ సాగుతోంది.
రాష్ట్రంలోనే ఏకైక గిరిజన జిల్లాగా పేరొందిన చిన్న జిల్లా ములుగు. సమ్మక్క సారక్కలు కొలువుదీరిన నేల. అటవీ సంపద, గిరిపుత్రులు, రామప్ప దేవాలయం, చెరువు, లక్నవరం సరస్సు, వాజేడు జలపాతం, మల్లూరు లక్ష్మీనరసింహస్వామి కొలువుదీరిన ప్రాంతమిది. ఇంతటి చరిత్ర ఉన్న ఈ ప్రాంతంలో రాష్ట్రంలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగిన టీఆర్‌ఎస్ కు మాజీ మంత్రి చందూలాల్ ఓటమితో రాజకీయ శూన్యత ఏర్పడింది. చందూలాల్ ఆరోగ్యం సహకరించకపోవడం, తన కుమారుడు ప్రహ్లాద్‌పై నియోజకవర్గనేతలు గుర్రుగా ఉండటం చందూలాల్ మంత్రిగా ఉన్నన్ని రోజులు తనకు తన కుటుంబ సభ్యులకు మాత్రమే పదవులు ఇప్పించికున్నారని, అందుకే వారికి చెక్ పెట్టి, అధిష్టానం ఆ స్థానంలో జిల్లాలో పట్టు నిలుపుకోవడానికి జెడ్పి చైర్మన్‌గా ఎన్నికైన కుసుమ జగదీష్‌కు ఆ బాధ్యతలు ఇచ్చినట్టు జిల్లాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత సీతక్క ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆదివాసీ గిరిజన మహిళనేత కావడం, ఆ ప్రాంతంలో మంచి పట్టు ఉన్న నేత అవడంతో రాజకీయంగా ఆమెను ఎదుర్కోవడానికి వివాదరహితుడు , యువనేత కుసుమ జగదీష్ ను టీఆర్‌ఎస్ అధిష్టానం రంగంలోకి దించిందని, అక్కడి నేతలు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీని కాపాడుతూ, కార్యకర్తల్లో ధైర్యం నింపి జిల్లా యంత్రాంగాన్ని సమర్థవంతంగా చూసుకునే నేతగా జగదీశే కరక్ట్ అని అక్కడి నేతలు భావిస్తున్నారట.
ములుగు నియోజకవర్గం ఎస్టీ రిజర్వ్‌డ్ కావడంతో మాజీమంత్రి చందూలాల్‌కు ఇన్నాళ్లు ఆ ప్రాముఖ్యత లభించందని, కానీ తను తన కుమారుడు ప్రహ్లాద్, ఎప్పుడూ ఆ దిశగా పని చేయకపోవడమే కాకుండా, స్థానిక నేతలను విస్మరించారన్న విమర్శలున్నాయి. అంతేకాదు, ఇబ్బందులూ పెట్టడంతో పాటు పార్టీ కార్యకర్తలపైనే కేసులు పెట్టడంతో మొన్నటి ఎన్నికల్లో ఓటమి చెందడమే కాదు ఉన్న పదవి దూరమైందన్న చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు పార్టీ నుంచి కూడా దూరం పెట్టారని జిల్లాలోని టీఆర్‌ఎస్ నేతలు మాట్లాడుకుంటున్నారు.
మొత్తానికి ములుగు జిల్లాలో టీఆర్‌ఎస్ పట్టు నిలుపుకోవడానికి మాజీమంత్రి చందూలాల్ కు చెక్ పెట్టి, జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్‌ను, అక్కడ ప్రత్యామ్నాయ నేతగా తయారు చేస్తోందని అర్థమవుతోంది. దాని కోసమే మొన్నటి జెడ్పిటిసి ఎన్నికల్లో జనరల్ స్థానం ఏటూరు నాగారం నుంచి పోటీ చేయించి, జెడ్పి చైర్మన్ స్థానాన్ని కట్టబెట్టారని చర్చించుకుంటున్నారు. ఇన్నాళ్లూ మాజీమంత్రి చందూలాల్‌తో ఇబ్బందిపడ్డ వర్గం సైతం జగదీష్ కు జై కొడుతున్నారు.
ఇలా సకల సమీకరణలు, పరిణామాలు తనకు వ్యతిరేకంగా జరుగుతున్నాయని చందూల్ ఆవేదన చెందుతున్నారట. అటు పార్టీ అధిష్టానం సీరియస్‌గా ఉండటం, ఇటు క్షేత్రస్థాయిలో శ్రేణుల సహాయ నిరాకరణతో, అల్లాడిపోతున్నారట మాజీ మంత్రి చందూలాల్. కనీసం తన కుమారుడిని సైతం పార్టీ పట్టించుకోవడంలేదని లోలోపల కుమిలిపోతున్నారట. చూడాలి, ములుగు జిల్లాలో, చందూలాల్ రాజకీయ జీవితం ముందు ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో.