Avinash Reddy: నేడు అవినాష్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ

Avinash Reddy: ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించిన అవినాష్

Update: 2023-05-25 03:16 GMT

Avinash Reddy: నేడు అవినాష్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ

Avinash Reddy: వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్‌కు సంబంధించి ఇవాళ తెలంగాణ హైకోర్టు విచారణ జరపనుంది. సీబీఐ అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ అవినాష్ దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు తీర్పు వచ్చే అవకాశముంది. అటు వివేకా హత్య కేసులో గత కొన్ని రోజులుగా అవినాష్ సీబీఐ విచారణకు హాజరుకావడం లేదు. తన తల్లి అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలోనే ఉండటంతో.. కొంత సమయం కావాలని అవినాష్ సీబీఐకి లేఖ రాశాడు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

వివేకా హత్య కేసులో అనుమానాలు ఉన్నాయంటూ ఆయన కుమార్తె సునీత పిటిషన్ మేరకు... ఏపీ హైకోర్టు 2020లో ఈ కేసును సీబీఐకి అప్పగించింది. అప్పటి నుంచి సీబీఐ దర్యాప్తు మొదలుపెట్టింది. కానీ ఏపీలో కేసు దర్యాప్తు ముందుకెళ్లడం లేదని సునీత పలుమార్లు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో గతేడాది నవంబర్‌లో వివేకా హత్య కేసును హైదరాబాద్‌కు బదిలీ చేసింది. అప్పటి నుంచి సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే నిందితులకు సహకరించారని కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, అతని తండ్రి భాస్కర్‌రెడ్డిలపై సీబీఐ విచారణ జరిపింది. ఈ క్రమంలో గత నెలలో భాస్కర్‌రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. అలాగే ఎంపీ అవినాష్‌ను పలుమార్లు ప్రశ్నించారు.

వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌ది కీలక పాత్ర ఉందంటూ సీబీఐ పలుమార్లు కోర్టులకు నివేదిక అందించింది. హత్యకు సంబంధించిన కుట్ర అవినాష్ రెడ్డికి ముందే తెలుసని సీబీఐ వాదిస్తోంది. విచారణలో తమకు సహకరించడంలేదని, దర్యాప్తులో శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలను సేకరించామని, హత్యకు ముందు అవినాష్ ఇంట్లో సునీల్ యాదవ్, ఉదయ్ ఉన్నారన్నారు. హత్యను గుండెపోటుగా ఎవరు చిత్రీకరించారో తెలియాల్సి ఉందని, వివేకా హత్య జరిగిన రోజు ఉదయం అవినాష్ రెడ్డి జమ్మలమడుగుకు దగ్గరలో ఉన్నట్లు చెప్పారని, కానీ మొబైల్ ఫోన్ సిగ్నల్స్ మాత్రం ఆయన ఇంట్లోనే ఉన్నట్లు చూపిస్తున్నాయన్నారు. అంతేకాకుండా ఆ రాత్రంతా ఎంపీ అవినాష్ తన ఫోన్ ను అసాధారణంగా వినియోగించినట్లు గుర్తించామని సీబీఐ తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.

మరోవైపు వివేకా హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని అవినాష్ చెబుతున్నాడు. సీబీఐ అధికారులు అసలు నిందితులను వదిలేసి.. తనను కావాలనే కేసులో ఇరికించే కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నాడు. హత్య జరిగిన రోజు తాను జమ్మలమడుగు వెళ్తున్నానని.. విషయం తెలిసి మళ్లీ వెనక్కి వచ్చినట్లు తెలిపారు.

Tags:    

Similar News