తెలంగాణలో బీసీ కార్డు కోసం బీజేపీ తహతహ.. బీజేపీ నినాదం బీసీ ముఖ్యమంత్రి?

Update: 2019-12-12 12:19 GMT

తెలంగాణలో ఒక పార్టీ వెన్నెముకలాంటి వర్గంపై గురిపెట్టింది భారతీయ జనతా పార్టీ. ఆ పార్టీ ఇప్పుడు దాదాపు కనుమరుగు అవుతుండటంతో, వారందర్నీ తనవైపు తిప్పుకునేందుకు రకరకాల స్ట్రాటజీలు వేస్తోంది. ఊహకందని వ్యూహాలకు పదును పెడుతోంది. ఇంతకీ ఏదా వర్గం ఏంటా స్ట్రాటజీ?

తెలంగాణలో పార్టీ బలోపేతంపై ప్రత్యేకంగా దృష్టి సారించిన బీజేపీ జాతీయ నాయకత్వం ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దేశంలో మెజారిటీ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ, నరేంద్రమోడీ ప్రధాని అయిన తర్వాత దేశవ్యాప్తంగా కమలదళాన్ని విస్తరించే పనిలో నిమగ్నమయ్యింది. రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చాక దక్షిణాది రాష్ట్రాల్లో కూడా పార్టీని విస్తరించేందుకు బీజేపీ పెద్దలు వ్యూహరచన చేస్తున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణపై కమలనాథులు ఫోకస్ పెట్టారు.

నాలుగు పార్లమెంట్‌ స్థానాలు గెలిచి ఊపు మీదున్న కమలదళం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్‌ను దెబ్బతీయడానికి ప్రణాళికలు రచిస్తోంది. పార్టీలోకి భారీగా చేరికలు చేపట్టిన ఆ పార్టీ కొంతమేర పుంజుకుంది. ఇంకా కొందరు అధికార పార్టీకి చెందిన నాయకులు తమతో టచ్ లో ఉన్నారని మైండ్‌ గేమ్‌ ఆడుతోంది. మరోవైపు ఏ చిన్న ప్రజా సమస్య రైజ్‌ అయినా, ఆందోళనకు దిగుతూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారుతోంది. అలా ఏ అంశాన్నీ వదలకుండా తెలంగాణలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా పావులు కదుపుతోంది బీజేపీ. ఇక ఇప్పుడు ఆ పార్టీ దృష్టి బీసీలపై పడింది. తెలంగాణ జనాభాలో ఎక్కువగా ఉన్న బీసీ ఓటర్లను తమవైపు తిప్పుకోవడం ద్వారా రాష్ట్రంలో మరింత బలపడవచ్చని భావిస్తోంది కాషాయ పార్టీ.

బీసీ ఓటర్ల మద్దతు ఉన్న టీడీపీ, తెలంగాణలో బలహీనపడటంతో ఆ స్థానాన్ని ఎలాగైనా భర్తీ చేయాలని చూస్తోంది బీజేపీ. టి టీడీపీ సగానికిపైగా ఖాళీ అయ్యింది. మిగతా నాయకులు సైతం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అలా టీడీపీ కేడర్ తమ వైపు రావడం వల్ల బీసీ ఓటింగ్ తమకు పెరుగుతుందన్న లెక్కలు వేసుకుంటోంది కమలం. టీడీపీ సీనియర్ నాయకుడు దేవేందర్ గౌడ్ కుమారుడు, వీరేందర్ గౌడ్ తో పాటు పలువురు బీసీ నాయకులను పార్టీలో చేర్చుకోవడం వ్యూహంలో భాగమేనన్న అభిప్రాయాలను పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు.

బీసీ వర్గానికే చెందిన ప్రధాని మోడీ ఇప్పటికే జాతీయ స్థాయిలో బీసీలకు పెద్దపీట వేస్తున్నారని, ఆ పార్టీ నాయకులు అంటున్నారు. అదే వర్గానికి చెందిన తమిళిసైని తెలంగాణకు గవర్నర్‌గా నియమించారు. తెలంగాణలో బీసీ వర్గానికే చెందిన దత్తాత్రేయను హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌గా అవకాశం ఇచ్చారు. ఇక బీసీ వర్గానికే చెందిన ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ను కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరోవైపు అధికార పార్టీతో పాటు ఇతర పార్టీలకు చెందిన పలు బీసీ నాయకులు పార్టీలో చేరే అవకాశం ఉందని బీజేపీ లీడర్లు చెప్తున్నారు. వీరిలో కొందరు ప్రముఖ నాయకులు ఉన్నారని అంటున్నారు. ఇక 2023లో బీసీనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు లేకపోలేదని పార్టీలోని కొందరు సీనియర్లు అభిప్రాయపడ్తున్నారు. చూడాలి, మొన్నటి వరకు టీడీపీనే బీసీ మంత్రను పాటించింది. మరి ఇప్పుడు వారంతా బీజేపీ వైపు మళ్లుతారా కమలం వ్యూహం సక్సెస్‌ అవుతుందా అన్నది రానున్న కాలమే చెప్పాలి.

Full View 

Tags:    

Similar News