మరో సమరానికి ఇందూరు సిద్దమా?

Update: 2019-07-03 10:25 GMT

ఇందూరు మరో సమరానికి సిద్దమవుతోంది. ఇప్పటికే ఎంపీస్థానంతో సత్తా చాటిన కమలం, గ్రౌండ్‌లెవల్లో మరింత చొచ్చుకెళ్లేందుకు వ్యూహ ప్రతివ్యూహాలకు పదునుపెడుతంటే, అటు గులాబీదళం కూడా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. కాంగ్రెస్‌ సైతం పట్టు నిలపుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ నగర పాలక సంస్ధతో పాటు కామారెడ్డి, బోధన్, ఆర్మూర్ కొత్తగా ఏర్పాటైన భీంగల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి పురపాలక సంఘాలున్నాయి. ఇవిప్పుడు ఎన్నికలకు రెడీ అవుతున్నాయి. ప్రభుత్వం సైతం ఎన్నికల పక్రియ ప్రారంభించింది. మున్సిపల్ నిబంధనల చట్ట సవరణకు ఆర్డినెన్స్ జారీ చేసిన ప్రభుత్వం, జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో వార్డులను ఖరారు చేసింది. నిజామాబాద్ కార్పొరేషన్ లో ప్రస్తుతం ఉన్న 50 డివిజన్ లకు అదనంగా మరో 10 డివిజన్లు పెంచారు. బోధన్ మున్సిపాలిటీలో 35 వార్డులు ఉండగా 38గా ఖరారు చేశారు. ఆర్మూర్ లో 23 వార్డులు ఉండగా ఆ సంఖ్య 36 కు పెంచారు. భీంగల్ లో 7 వార్డులను 12కు పెంచారు. కామారెడ్డిలో 33 వార్డులకు 49 వార్డులుగా పెంచారు. బాన్సువాడలో 11 వార్డులు ఉండగా ఆ సంఖ్య 19కి పెరగ్గా, ఎల్లారెడ్డిలో 9 వార్డులను 12కు పెంచారు. విలీన గ్రామాలను కలుపుకుని ఈ సంఖ్యను పెంచారు. అధికారులు ఎన్నికలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చకచకా చేస్తున్నారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కార్పొరేషన్ తో పాటు మున్సిపాలిటీల్లో తమ జెండాలను ఎగురవేసేందుకు రాజకీయ పార్టీలు రెడీ అయ్యాయి. పార్లమెంట్ ఎన్నికల విజయంతో ఊపు మీద ఉన్న కాషాయ పార్టీ, నిజామాబాద్ నగరపాలక సంస్ధతో పాటు ఆర్మూర్, బోధన్ మున్సిపాలిటీలపై కన్నేసింది. కాంగ్రెస్-టీడీపీ నుంచి భారీగా వలసలను ప్రోత్సహిస్తున్నారు ఆ పార్టీ నేతలు. పార్లమెంట్ విజయం స్పూర్తితో మున్సిపాలిటీలపై కాషాయజెండా ఎగురవేస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఎంపీ ఎన్నికల మినహా వరుస ఎన్నికల విజయంతో ఊపుమీద ఉన్న గులాబీ పార్టీ మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగురవేసేందుకు సై అంటోంది. ఈ మేరకు పార్టీ సభ్యత్వాలను జోరుగా చేయిస్తోంది. వరుస ఓటములు, వలసలతో ఢీలా పడ్డ కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికలపై ధీమాగా ఉంది.

మున్సిపల్ ఎన్నికలకు పార్టీలు సై అంటుండటంతో జిల్లాలో పొలిటికల్ హీట్ పెరిగింది. అన్ని పార్టీలు గెలుపుపై ధీమాగా ఉన్నా ఓటరు నాడి ఎలా ఉంటుందన్నది ఆసక్తిగా మారింది. అయితే అన్ని పార్టీల్లో నేతల మధ్య విభేదాలు రాజ్యమేలుతున్నాయి. అది పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ ప్రతిఫలించింది. పరిషత్‌ పోరులోనూ క్రాస్ ఓటింగ్‌ ప్రధాన పార్టీలను దెబ్బతీసింది. మున్సిపల్‌ ఎన్నికల్లో అలాంటి పరిస్థితి లేకుండా జాగ్రత్తపడుతున్నాయి పార్టీలు. నేతల మధ్య సమన్వయం, సఖ్యత కోసం అధిష్టాన బిగ్‌షాట్‌లు రంగంలోకి దిగుతున్నాయి.

Full View 

Tags:    

Similar News