తెలంగాణలో మండుతున్న ఎండలు.. 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు.. బయటకు రావొద్దని సూచన...

TS High Temperatures: పదేళ్లలో మార్చి నెలలో 44 డిగ్రీలకు చేరుకోవడం ఇదే మొదటిసారి...

Update: 2022-03-30 08:45 GMT

తెలంగాణలో మండుతున్న ఎండలు.. 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు.. బయటకు రావొద్దని సూచన...

TS High Temperatures: తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. ప్రత్యేకించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భానుడి భగభగలతో జనం అల్లాడిపోతున్నారు. గత మూడు రోజులుగా జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయింది. ఉదయం తొమ్మిది దాటితే చాలు జనం ఇళ్లలోంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఇక మధ్యాహ్నం పూర్తిగా రోడ్లన్నీ జనం లేక నిర్మానుష్యంగా మారి, కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తున్నాయి.

గత రెండు రోజులనుండి జిల్లాలో 43 నుండి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో మూడు రోజులపాటు ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అలర్ట్ అయ్యింది. గత పదేళ్లలో మర్చి నెలలో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరుకోవడం ఇదే మొదటిసారి అంటున్నారు అధికారులు. అత్యవసర పనులుంటే తప్పా బయటకు వెళ్లకూడదని సూచిస్తున్నారు.

జిల్లాలో ఎండల తీవ్రత పెరగడంతో ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. కొంతమంది వ్యాపారాలు ఎండలకు గిరాకీ లేక షాపులను మూసివేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అటు వ్యవసాయ, ఉపాధిహామీ కూలీలపై ఎండలు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. దీంతో ఉదయం ఆరు గంటలనుండే తమ పనులను ప్రారంభించి పదకొండు గంటలకే ముగించుకుంటున్నారు. మండుతున్న ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు శీతల పానీయాలు సేవించడంతో పాటు చెట్ల నీడలో సేద తీరుతున్నారు.

Similar News