మరింత వేగంగా చంద్రయాన్-3 ప్రాజెక్ట్ పనులు
Chandrayaan-3: *విభాగాల వారీగా రాకెట్ ప్రయోగ పరీక్షలు
Chandrayaan-3: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రాజెక్టు పనులను మరింత వేగవంతం చేస్తోంది. నిర్దిష్ట లక్ష్యాలు చేరుకునే విధంగా రూపకల్పన చేస్తున్న చంద్రయాన్ మిషన్ సన్నద్ధం చేస్తున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. చంద్రయాన్-3 కి సంబంధించిన విభాగాల వారీగా రాకెట్టు ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తోంది ఇస్రో. తాజాగా షార్ లో చంద్రయాన్ ల్యాండర్ పరీక్ష విజయవతంగా పరీక్షించింది ఇస్రో.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో తన పరీక్షలను మరింత వేగవంతం చేసింది. కరోనా కష్టాల నేపథ్యంలో రెండేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న ఇస్రో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు చంద్రయాన్ త్రీ ప్రయోగానికి వడివడిగా అడుగులు వేస్తోంది అంతరిక్ష పరిశోధన సంస్థ. తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన షార్ లో చంద్రయాన్-3 ప్రయోగానికి సంబంధించిన ల్యాండర్ ఇంజిన్ ట్రస్టర్స్ అర్హత పరీక్షను శాస్త్రవేత్తలు నిర్వహించారు. బెంగుళూరు నుంచి తీసుకొచ్చిన ల్యాండర్ ను ప్రయోగ పరీక్ష చేశారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఈ పరీక్ష ద్వారా ల్యాండర్ దాని పనితీరుతో పాటు సామర్ధ్యాన్ని అంచనా వేశారు.
గతంలో తమిళనాడు రాష్ట్రంలోని ఇస్రో కేంద్రమైన మహేంద్రగిరిలో ఈ పరీక్షలు నిర్వహించేవారు. ప్రస్తుతం అక్కడ అనుకూలమైన వాతావరణం లేకపోవడంతో పాటు సాంకేతికంగా ఇతరత్రా కారణాలతో ప్రయోగాలకు షార్ నే ప్రధాన కేంద్రంగా చేస్తున్నారు. ఈ క్రమంలో చంద్రయాన్-3 ప్రయోగానికి సంబంధించిన వివిధ పరీక్షలు శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచే పరీక్షలు నిర్వహిస్తున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు.