ఫుల్ ఫామ్‌లో ఉన్న ట్రావిస్ హెడ్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన ప్రిన్స్ యాదవ్.. ఎవరీ కొత్త ఫాస్ట్ బౌలర్?

దూకుడు మీదున్న ట్రావిస్ హెడ్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన ప్రిన్స్ యాదవ్.. ఎవరీ కొత్త ఫాస్ట్ బౌలర్?
Travis Head striked by Price Yadav: ప్రతీ ఐపిఎల్ సీజన్ కొంతమంది కొత్త ఆటగాళ్లను ప్రపంచానికి పరిచయం చేస్తోంది. వారిలోని టాలెంట్‌ను వెలికి తీస్తోంది. అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ ఓ కొత్త టాలెంటెడ్ బౌలర్ అందరి దృష్టిని ఆకర్షించాడు. అతడి పేరే ప్రిన్స్ యాదవ్.
ఇంతకు ముందు ప్రిన్స్ యాదవ్ అంటే పెద్దగా పరిచయం లేని పేరు. ఎందుకంటే ప్రిన్స్ ఐపిఎల్‌లోకి ఎంట్రీ ఇవ్వడం ఇదే మొదటిసారి. పైగా ఇదే తొలి మ్యాచ్. కానీ ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఫోర్ల మీద ఫోర్లు, సిక్సుల మీద సిక్సులు కొడుతూ లక్నో ఆటగాళ్లకు ఛాలెంజ్ విసురుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్ మేన్ ట్రావిస్ హెడ్ వికెట్ తీశాడు. అది కూడా క్లీన్ బౌల్డ్ చేశాడు.
అప్పటి వరకు హెడ్ కొడుతున్న షాట్స్‌ను హోమ్ గ్రౌండ్ అయిన ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ క్రికెట్ ప్రియులు గట్టిగా అరుపులు, కేకలతో ఎంజాయ్ చేస్తూ కనిపించారు. కానీ హెడ్ క్లీన్ బౌల్డ్ అవడంతో స్టేడియం అంతా ఒక్కసారిగా సైలెంట్ అయింది. 15 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన జట్టును హెడ్ ఆదుకున్నాడు. 7.3 ఓవర్ల వద్ద తను ఔట్ అయ్యేటప్పటికి జట్టు స్కోర్ ను 76 పరుగులకు తీసుకెళ్లాడు. అందులో తనే 28 బంతుల్లో 47 పరుగులు రాబట్టాడు. అలా పరుగులు రాబడుతూ క్రీజులో ఫుల్ ఫామ్‌లో ఉన్న హెడ్‌ను ప్రిన్స్ యూదవ్ పెవిలియన్ బాట పట్టించాడు.
From the City of Nawabs to the City of Nizams 💥pic.twitter.com/1noHooIA3f
— Lucknow Super Giants (@LucknowIPL) March 27, 2025
ఇంతకీ ఎవరీ ప్రిన్స్ యాదవ్?
ప్రిన్స్ యాదవ్ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. 2001, డిసెంబర్ 12న యూపీలో జన్మించాడు. గతంలో ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో ఆడాడు. 2024 లో పురాని ఢిల్లీ 6 ఫ్రాంచైజ్ తరపున ఆడుతున్నప్పుడు మొదటిసారిగా హైలైట్ అయ్యాడు. 10 మ్యాచుల్లో 13 వికెట్లు తీసి తన బౌలింగ్ తో మెప్పించాడు. దాంతో ఢిల్లీ రంజీ జట్టులో చోటు సంపాదించాడు.
ఆ తర్వాత వెంటనే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024-25 లో మరోసారి సత్తా చాటుకున్నాడు. ఫుల్ ఫామ్ లో ఉన్న ఉత్తర్ ప్రదేశ్ జట్టు బ్యాటర్స్ నితీశ్ రాణా, సమీర్ రిజివిల వికెట్స్ తీసి ఔరా అనిపించాడు. టోర్నీలో ఢిల్లీ తరపున 7.54 ఎకానమీ రేట్ తో 11 వికెట్లు తీసి జట్టు సెమీ ఫైనల్స్ వరకు వెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు.
డైరెక్ట్ ఐపీఎల్ 2025
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ప్రిన్స్ పెర్ఫార్మెన్స్ వృథాగా పోలేదు. ప్రిన్స్ పెర్ఫార్మెన్స్ మరునాడే ఐపీఎల్ 2025 వేలం జరిగింది. లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజ్ అతడిని రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది.
రాబోయే రోజుల్లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో కీలకమైన బౌలర్ గా ఎలివేట్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. అన్నట్లు గతంలో ఢిల్లీ జట్టు తరపున ఆడటంలో, ఇప్పుడు లక్నో జట్టులో చోటు సంపాదించుకోవడంలో రిషబ్ పంత్ సపోర్ట్ కూడా పుష్కలంగా ఉంది.