Yashasvi Jaiswal: యశస్వి జైశ్వాల్ ముంబై నుండి గోవా జట్టుకు ఎందుకు షిఫ్ట్ అవుతున్నాడు?
Reasons behind Yashasvi Jaiswal moving to Goa:
Yashasvi Jaiswal: యశస్వి జైశ్వాల్ ముంబై నుండి గోవా జట్టుకు ఎందుకు షిఫ్ట్ అవుతున్నాడు?
Why Yashasvi Jaiswal moving to GOA team from Mumbai: టీమిండియా టెస్ట్ మ్యాచ్ ఓపెనర్, ముంబై రంజీ ఆటగాడు యశస్వి జైశ్వాల్ ముంబై క్రికెట్ అసోసియేషన్ కు షాక్ ఇచ్చాడు. తను వచ్చే ఏడాది నుండి గోవా తరపున ఆడాలనుకుంటున్నట్లు చెబుతూ వారికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అంటే ప్రస్తుతానికి జైశ్వాల్ ముంబైకి గుడ్ బై చెబుతున్నట్లేనన్న మాట. జైశ్వాల్ తమకు లేఖ రాసిన విషయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ కూడా వెల్లడించింది. వ్యక్తిగత కారణాలతో తను గోవాకు షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నానని జైశ్వాల్ ఆ లేఖలో పేర్కొన్నట్లు ముంబై అసోసియేషన్ చెప్పింది.
ఇదే విషయంపై గోవా క్రికెట్ అసోసియేషన్ కూడా స్పందించింది. యశస్వి జైశ్వాల్ తమతో చర్చించిన మాట వాస్తవమేనని గోవా అసోసియేషన్ వెల్లడించింది. వచ్చే సీజన్ నుండి జైశ్వాల్ గోవా తరపున ఆడనున్నాడని, పేపర్ వర్క్ మాత్రమే మిగిలి ఉందని అసోసియేషన్ సెక్రటరీ శంబా నాయక్ చెప్పారు. జైశ్వాల్ అనుభవం గోవా జట్టుకు బాగా పనికొస్తుందని నమ్ముతున్నాం. "కాకపోతే ఆయన కేప్టెన్‌గా ఉంటారా లేక మరొకటా అనేదే ఇంకా నిర్ణయించలేదు. రాబోయే రోజుల్లో ఆ నిర్ణయం తీసుకుంటాం" అని నాయక్ అన్నారు.
యశస్వి జైశ్వాల్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం ముంబై క్రికెట్ వర్గాల్లో చర్చనియాంశమైంది. జైశ్వాల్ గోవాకు ఎందుకు వెళ్తున్నట్లు? ముంబై క్రికెట్ అసోసియేషన్‌లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అసోసియేషన్ నుండి సహకారం లేదా? ఇలా రకరకాల సందేహాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి తను వ్యక్తిగత కారణాల వల్లే గోవాకు వెళ్తున్నట్లు జైశ్వాల్ చెబుతున్నప్పటికీ, అసలు కారణాలు ఎంతో కాలం దాగి ఉండవనే టాక్ కూడా వినిపిస్తోంది.
అయితే, ముంబై, గోవా జట్ల మధ్య ఆటగాళ్లు మారడం ఇదేం కొత్త కాదు. గతంలో అర్జున్ టెండుల్కర్, సిద్ధేష్ లాడ్ కూడా ముందు గోవా తరపున ఆడిన తరువాతే ముంబైకి షిఫ్ట్ అయ్యారు.
యశస్వి జైశ్వాల్ చివరి రంజీ మ్యాచ్ విషయానికొస్తే... జనవరిలో జమ్మూకశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌లో జైశ్వాల్ తన చివరి మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో జైశ్వాల్ 30 పరుగులు చేశాడు. విదర్భ జట్టుతో సెమీ ఫైనల్ మ్యాచ్ సమయానికి మడమకు గాయం అవడంతో మ్యాచ్ కంటే ముందే పక్కకు తప్పుకున్నాడు.
ఇక ఐపిఎల్ కెరీర్ విషయానికొస్తే... ప్రస్తుత ఐపిఎల్ 2025 సీజన్‌లో యశస్వి జైశ్వాల్ రాజస్థాన్ రాయల్స్ జట్టు తరుపున ఓపెనర్‌గా కొనసాగుతున్నాడు. ఈ సీజన్‌లో జైశ్వాల్ నుండి ఇంకా బెటర్ పర్‌ఫార్మెన్స్ రానేలేదు. ఆడిన 3 మ్యాచుల్లోనూ కలిపి మొత్తం 34 పరుగులు మాత్రమే చేశాడు.