Sourav Ganguly: ఐసీసీ క్రికెట్ కమిటీ ఛైర్మన్ గా మళ్లీ గంగూలీనే..ప్యానెల్లోకి వీవీఎస్ లక్ష్మణ్

Sourav Ganguly: ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ ఛైర్మన్ గా భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ మరోసారి నియమితులయ్యాడు. దుబాయ్ వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా గంగూలీని మరోసారి కమిటీ చైర్మన్ గా ఎన్నుకున్నారు. భారత మాజీ బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా ప్యానెల్ సభ్యుడిగా కొనసాగారు. ఈ విషయాన్ని ప్రపంచ క్రికెట్ సంస్థ ఆదివారం ప్రకటించింది. 2000 నుండి 2005 వరకు భారత జట్టుకు నాయకత్వం వహించిన గంగూలీ, 2021లో తొలిసారిగా ఈ కమిటీకి ఛైర్మన్ అయ్యాడు.
మూడు సంవత్సరాల చొప్పున గరిష్టంగా మూడు పర్యాయాలు పనిచేసిన తర్వాత అనిల్ కుంబ్లే రాజీనామా చేశారు. అనంతరం 52 ఏళ్ల గంగూలీ బాధ్యతలు స్వీకరించారు. గంగూలీ, లక్ష్మణ్‌లతో పాటు, ఆఫ్ఘనిస్తాన్ మాజీ ఆటగాడు హమీద్ హసన్, వెస్టిండీస్ గ్రేట్ బ్యాట్స్‌మన్ డెస్మండ్ హేన్స్, దక్షిణాఫ్రికా టెస్ట్, వన్డే కెప్టెన్ టెంబా బావుమా, ఇంగ్లాండ్ మాజీ బ్యాట్స్‌మన్ జోనాథన్ ట్రాట్‌లను కమిటీలో నియమించారు.
గంగూలీ నేతృత్వంలోని ఈ కమిటీ వన్డే క్రికెట్‌లో ఒక బంతిని ఉపయోగించాలని సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. వన్డేల్లో రెండు కొత్త బంతుల నియమం చాలా కాలంగా అమలులో ఉంది. ఈ సిఫార్సును ఐసిసి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆమోదించాలి. ఆ తర్వాతే సవరించిన ఆట పరిస్థితులలో ఇది చేరుతుంది. జింబాబ్వేలోని హరారేలో జరిగే ఐసిసి బోర్డు ఈ అంశంపై చర్చించే అవకాశం ఉంది. ప్రస్తుతం వన్డేల్లో రెండు కొత్త తెల్ల కూకబుర్రా బంతులను ఉపయోగిస్తున్నారు. బౌలర్లు రెండు చివరల నుండి వేర్వేరు కొత్త బంతులను ఉపయోగించడం వల్ల, బంతి గట్టిగా ఉంటుంది. ఇది బ్యాట్స్‌మెన్‌కు స్వేచ్ఛగా స్కోర్ చేయడానికి ప్రయోజనాన్ని ఇస్తుంది.
అఫ్గానిస్తాన్ లో తాలిబన్ల పాలన మొదలైనప్పటి నుంచి చెల్లాచెదురైపోయిన ఆ దేశ మహిళా క్రికెట్లర కోసం ఐసీసీ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. మహిళలు ఆటలు ఆడడానికి తాలిబన్ల వ్యతిరేకం కావడంతో ఆఫ్గాన్ అమ్మాయిల క్రికెట్ జట్టు ఉనికే లేకుండా పోయింది. కొందరు ఆఫ్ఘాన్ మహిళా క్రికెటర్లు ఆస్ట్రేలియా లాంటి దేశాలకు శరణార్థులుగా వెళ్లి మ్యాచ్ లు ఆడుకుంటున్నారు. వీరితోపాటు క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకోవాలనుకునే ఆఫ్గాన్ మహిళల కోసం టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని ఐసీసీ వార్షిక సమావేశాల్లో నిర్ణయించారు. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ బోర్డుల సహకారంతో ఈ టాస్క్ ఫోర్స్ పనిచేస్తుంది.